దక్షిణాది దండెత్తుతోంది.. మోదీషా రెడీనా?

TN-all-party-meeting-on-delimitation-e1742014389847.jpg

డీలిమిటేషన్‌పై ఏకమవుతున్నాయి దక్షిణాది రాష్ట్రాలు. దేశంలోని మరికొన్ని రాష్ట్రాలు కూడా దీనికి మద్దతివ్వబోతున్నాయి. తమిళనాడు సీఎం స్టాలిన్‌ అందరినీ ఒక్కతాటిపైకి తెచ్చే ప్రయత్నాల్లో ఉన్నారు. మార్చి 22న డీలిమిటేషన్‌పై చర్చించేందుకు చెన్నై వేదికవుతోంది. మనం మనం దక్షిణం… డీలిమిటేషన్‌పై కలిసికట్టుగా చేద్దాం పోరాటం అంటూ ఉద్యమ వేదికను సిద్ధంచేస్తున్నారు తమిళనాడు సీఎం స్టాలిన్. ఇప్పటికే చెన్నైలో అఖిలపక్ష సమావేశం నిర్వహించి అక్కడి రాజకీయ పార్టీలన్నింటిని ఏకం చేశారు. ఇప్పుడు దక్షిణాది రాష్ట్రాలను ఏకంచేసి కేంద్రంపై ఉద్యమించేందుకు పక్కా ప్లాన్‌తో ముందుకెళ్తున్నారు.

చెన్నైలో జరిగే జేఏసీ మీటింగ్‌కి దక్షిణాది రాష్ట్రాల సీఎంలను ఆహ్వానించారు. చంద్రబాబు, జగన్‌, రేవంత్‌, కేసీఆర్‌ సహా కీలక నేతలకు ఉత్తరాలు రాసి భేటీకి ఆహ్వానించారు స్టాలిన్‌. ఉత్తరాదిలో బీజేపీ వ్యతిరేక పార్టీలను సైతం చెన్నై మీటింగ్‌కు ఆహ్వానిస్తున్నారు. కేవలం ఉత్తరాలు రాసి ఊరుకోవడమే కాదు.. డీఎంకే నేతల బృందాన్ని స్వయంగా సైతం సౌత్‌ స్టేట్స్‌కి పంపిస్తున్నారు. చెన్నై మీటింగ్‌కు హాజరవుతామన్న తెలంగాణ సీఎం… అంతకంటే ముందుగానే డీలిమిటేషన్‌పై తెలంగాణలో అఖిలపక్ష సమావేశం నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. ఆ మీటింగ్‌కి కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి రావాల్సిందేనని డిమాండ్‌ చేశారు.

రేవంత్‌తో మీటింగ్ తర్వాత డీఎంకే నేతలు తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ను కలిశారు. తప్పకుండా వస్తామని వారికి మాటిచ్చారు కేటీఆర్‌. డీలిమిటేషన్‌పై దక్షిణాది రాష్ట్రాలు ఏకం కావాల్సిన సమయం వచ్చిందన్నారు. కానీ ఏపీలో కూటమి అధికారంలో ఉండటంతో డీలిమిటేషన్‌పై ఆందోళన పడాల్సిన పన్లేదంటున్నారు అక్కడి అధికారపక్ష నేతలు. నియోజకవర్గాల పునర్విభజన మంచిదేనంటున్నారు చంద్రబాబు. డీఎంకే నుంచి ఆహ్వానం అందుకున్న జగన్‌ కూడా చెన్నై మీటింగ్‌కి వెళ్లాలో లేదో ఇంకా నిర్ణయించుకోలేదు.

Share this post

submit to reddit
scroll to top