దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ధర్మస్థల వివాదం, ఇప్పుడు పూర్తిగా యూటర్న్ తీసుకుంది. హిందూ అనుకూల నినాదాలతో హోరెత్తుతోంది కన్నడ రాష్ట్రం. కుట్రదారులెవరో బైటికి రావాల్సిందే అంటూ నిరసన గళమెత్తడమే కాదు దుష్ప్రచారంపై దాదాపు యుద్ధం ప్రకటించింది బీజేపీ.ధర్మస్థలలో ఘోరమైన విషయాలెన్నో సమాధి అయిపోయాయని చెప్పుకొచ్చిన మాస్క్ మ్యాన్ సీఎన్ చిన్నయ్య నాలుక మడతేశాడు. అప్పుడేదో అలా చెప్పా.. సామూహిక ఖననాలు అబద్ధం అన్న చిన్నయ్య చివరికి కటకటాలపాలయ్యాడు. కూతురు అనన్య భట్ 2003లో ధర్మస్థలకు వెళ్లి అదృశ్యమైందని కంప్లయింట్ ఇచ్చిన సుజాత భట్ కూడా ప్లేటు ఫిరాయించేసింది. అసలు తనకు కూతురే లేదంటోంది. వ్యవహారం మొత్తం అడ్డం తిరగడంతో కర్నాటక అపోజిషన్ పార్టీ బీజేపీ వాయిస్ పెంచేసింది.

వీడి వెనుక ఉన్నదెవరు?
ధర్మస్థల ప్రతిష్టను దెబ్బతియ్యడానికి పెద్దకుట్ర జరిగిందని బీజేపీ అనుమానిస్తోంది. కొందరు స్వార్థ ప్రయోజనాల కోసమే కట్టుకథ అల్లి పోలీసుల్ని, ప్రజల్ని తప్పుదోవ పట్టించారంటూ కమలం పార్టీ కీలక నేతలంతా పెద్దఎత్తున ఆందోళన చేపట్టారు. ఒక పద్ధతి ప్రకారం తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేసి, జనంలో హిందుత్వంపై చులనకభావం పెరిగేలా కుతంత్రం జరిగిందని ఆరోపిస్తోంది కమలం పార్టీ. సిట్ దర్యాప్తును వీలైనంత త్వరగా ముగించి నిజనిరూపణ చేసి, నివేదికను జనం ముందు ఉంచాలంటూ డిమాండ్లు పెరుగుతున్నాయి. ధర్మస్థల ప్రాశస్త్యాన్ని దెబ్బతీసే కుట్రలో సిద్ధరామయ్య ప్రభుత్వం కూడా తనవంతు భూమిక వహించిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
దుష్ప్రచారంలో యూట్యూబర్లు కూడా భాగస్వాములయ్యారు. అబద్దాన్ని నిజమని నమ్మింపజేసేందుకు కొందరు వారికి డబ్బు ఆశచూపారు. ఓ యూట్యూబర్ ఈ విషయాన్ని వెల్లడించటంతో ధర్మస్థల పవిత్రతను దెబ్బతీసే ప్రయత్నాల వెనుక చాలా పెద్ద కుట్రే ఉందని అర్ధమవుతోంది. అందుకే ధర్మస్థల అంశాన్ని రాద్ధాంతం చేసిన సోషల్ మీడియా యాక్టివిస్టుల్ని కూడా ఓ పట్టు పట్టాల్సిందే అంటోంది వీహెచ్‌పీ. సామూహిక ఖననాల కేసును NIAకి అప్పగించేలా సిద్ధూ సర్కార్‌పై ఒత్తిడి పెంచడమే లక్ష్యంగా కార్యాచరణ సిద్ధం చేసుకుంది బీజేపీ. కేంద్ర దర్యాప్తు సంస్థలైతేనే నిజాన్ని వెలికితీసి, ధర్మస్థలపై ఏర్పడ్డ అపనమ్మకాన్ని తొలగించగలవని ఆ పార్టీ నమ్ముతోంది. ఇటు విశ్వహిందూ పరిషత్ కూడా బీజేపీకి కోరస్ ఇస్తోంది.
ధర్మస్థల కేసులో కీలకమైన మాస్క్‌మ్యాన్‌కి రెండునెలల పాటు ఆశ్రయం కల్పించిన మహేష్ శెట్టి ఇంటిపై సిట్ పోలీసులు దాడి చేశారు. అటు ధర్మస్థల కేసును విచారిస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం సీనియర్ అధికారి అనుచెత్ సెలవు పెట్టి అమెరికా వెళ్లడం అనుమానాలకు తావిస్తోంది. ధర్మస్థల వివాదంలో ఏర్పడ్డ యూటర్న్.. కన్నడ నాట పొలిటికల్ సునామీకి దారితీస్తోంది.





