అమరావతికి జై కొట్టిన జనం

Amaravathi-01.jpg

అమరావతిని అక్కున చేర్చుకున్నారు. విశాఖను వద్దన్నారు. జగన్మోహన్‌రెడ్డి మూడు రాజధానుల ప్రతిపాదనని ఏపీ ప్రజలు నిర్ద్వందంగా తిరస్కరించారు. రాజధానిగా అమరావతికే జై కొట్టారు. విశాఖను ఎగ్జిక్యూటివ్‌ కేపిటల్‌ చేస్తామన్న జగన్‌ ప్రతిపాదన కూడా ప్రజా కోర్టులో ఓడిపోయింది. విశాఖ ప్రజలు కూడా కూటమికే చెయ్యెత్తి జై కొట్టారు. 2019లో భారీ మెజారిటీతో గెలిచిన జగన్‌…ఆ తర్వాత మూడు రాజధానుల అంశాన్ని తెరపైకి తెచ్చారు. అమరావతిని శాసన రాజధానిగా, విశాఖను కార్యనిర్వాహక రాజధానిగా, కర్నూలును న్యాయ రాజధానిగా చేస్తామన్నారు. దీనిపై అమరావతి ప్రాంత రైతులు పెద్దఎత్తున ఉద్యమం చేశారు.

అమరాతి రైతుల ఉద్యమానికి టీడీపీ, జనసేన, బీజేపీ, సీపీఐ, సీపీఎం మద్దతు ఇచ్చాయి. అయితే వైసీపీ నేతలు ఈ ఉద్యమానికి వ్యతిరేకంగా మాట్లాడుతూ వచ్చారు. ఈసారి ఏపీ ఎన్నికల్లో రాజధాని ఒక అంశం కాబోదని అంచనావేసుకున్నారు. అయితే అమరావతి రాజధాని ఉన్న గుంటూరు, కృష్ణా జిల్లాల్లో ఇది పెద్దఎత్తున ప్రభావం చూపించింది. సైలెంట్‌ వేవ్‌ రూపంలో వైసీపీని తుడిచి పెట్టేసింది. ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల్లో కేపిటల్‌ ఎఫెక్ట్ వైసీపీని బలంగా దెబ్బ తీసింది. ఆ రెండు జిల్లాల్లో వైసీపీ అడ్రస్‌ లేకుండాపోయింది. ఉమ్మడి గుంటూరు, కృష్ణా జిల్లాల్లో మొత్తం 33 అసెంబ్లీ సీట్లు ఉంటే వైసీపీ అభ్యర్థులు ఎక్కడా ఉనికిని చాటలేకపోయారు. ఈ తీర్పుతో అమరావతి ఒక్కటే ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అంటూ ప్రజలు చాలా బలంగా చెప్పారని విశ్లేషకులు చెబుతున్నారు.

ఇక పాలనే తరువాయి అంటూ ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటిల్‌గా విశాఖలో వైసీపీ ఎంత హడావిడి చేసినా విశాఖ కూడా తిరస్కరించింది. తమ ప్రాంతాన్ని రాజధానిగా చూడాలనుకోవడం లేదంటూ ఓటు ద్వారా విశాఖ వాసులు తేల్చి చెప్పారు. విశాఖ నగరంలోని నాలుగు సీట్లతో పాటు ఉమ్మడి జిల్లాలో కూడా వైసీపీకి ఘోర పరాజయం తప్పలేదు. అమరావతి రాజధాని కేవలం ఓ వర్గం ప్రయోజనంకోసమేనని వైసీపీ భావించడమే పెద్ద తప్పిదం. కేవలం రాజకీయ పంతంతో మరో ఐదేళ్లు రాజధాని లేని రాష్ట్రంగానే పాలన సాగడాన్ని ఏపీ ప్రజలు జీర్ణించుకోలేకపోయారు. దాని ప్రభావంతోనే గిరగిరా తిరుగుతుందనుకున్న ఫ్యాన్‌ రెక్కలు తెగి కిందపడింది.

Share this post

submit to reddit
scroll to top