దొరకని ఎల్పీజీ.. సర్కారు టేకిటీజీ!

gas-crisis.jpg

ఎంత మేకపోతు గాంభీర్యం ప్రదర్శించినా, ఎల్‌పీజీ ఉత్పత్తి పదిశాతం పెరిగిందని గణాంకాలు చెబుతున్నా ఇరాన్‌పై యుద్ధ ప్రభావం భారత్‌మీద కూడా తీవ్రంగానే ఉంది. వంటింటి గ్యాస్‌ ధర పెరిగింది. దేశంకోసం ధర్మకోసం ఆ మాత్రం భారం మోయడానికి ప్రజలు సిద్ధమైనా.. కండిషన్స్‌ అప్లై అంటోంది కేంద్రం. 25రోజుల వెయిటింగ్‌ పీరియడ్‌తో వంటింట్లో కొత్త సంక్షోభం మొదలైంది.

హార్ముజ్ జలసంధి గుండా పెట్రోలియం ఉత్పత్తుల రవాణా నిలిచిపోవటంతో లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ (LPG) కొరత మొదలైంది. గుప్పిట్లో నిప్పు కణికను దాయలేమని తెలిసినా కేంద్రం సంక్షోభమేమీ లేదని నమ్మించే ప్రయత్నమే చేస్తోంది. ఈ సంక్షోభ పరిస్థితిపై కేంద్ర ప్రభుత్వ స్పందన గతంలోలాగే ఉంది. మొదట సంక్షోభం లేదని ఖండించింది. తర్వాతైనా దీనిపై స్పష్టత ఇవ్వకుండా.. అస్పష్టమైన వివరణలు, ప్రకటనలతో సరిపెడుతోంది.

నేషనల్ రెస్టారెంట్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా మార్చి 7న విడుదల చేసిన ప్రకటన ప్రభుత్వ అంచనాలు వాస్తవానికి ఎంత దూరంగా ఉన్నాయో చాటిచెబుతోంది. దేశవ్యాప్తంగా 5 లక్షలకు పైగా రెస్టారెంట్లకు NRAI ప్రాతినిధ్యం వహిస్తోంది. కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ల సరఫరాపై ఎలాంటి నిషేధం లేదని కేంద్రం చెబుతున్నా.. క్షేత్రస్థాయిలో పరిస్థితులు మాత్రం భిన్నంగా ఉన్నాయి. వంటగ్యాస్‌ కొరత రెస్టారెంట్ రంగంపై అప్పుడే ప్రభావం చూపిస్తోంది.

➧ దేశంలో 33.2 కోట్ల LPG కనెక్షన్లు
➧ ఏడాదికి 31.3 మిలియన్ టన్నుల వినియోగం
➧ ఇందులో 90శాతం డొమెస్టిక్‌ (గృహ వినియోగం)
➧ ఎల్పీజీ అవసరాల్లో 65% దిగుమతులే ఆధారం
➧ 85–90 శాతం పశ్చిమాసియా దేశాలనుంచే
➧ 2025 నవంబరులో అమెరికాతో భారత్‌ ఒప్పందం
➧ ఏటా 2.2 మిలియన్ టన్నుల LPG దిగుమతికి అగ్రిమెంట్‌

చెన్నై, ముంబై, బెంగళూరులోని అనేక హోటళ్లు, రెస్టారెంట్లు 72 గంటల్లో ఎల్పీజీ రీఫిల్ లభించకపోతే మూసివేయాల్సి వస్తుందని ప్రకటించాయి. కోయంబత్తూరులో పాపులర్‌ అన్నపూర్ణ రెస్టారెంట్ గ్యాస్‌ని ఆదా చేసేందుకు మెనూను పరిమితం చేసింది. బెంగళూరులోని ఒక రెస్టారెంట్ అయితే కేవలం కాఫీ, టీ మాత్రమే అందిస్తామని ప్రకటించింది. పుణెలో గ్యాస్ ఆధారిత క్రిమేటోరియాలు మూతపడ్డాయి. రెస్టారెంట్లు మెనూలను తగ్గించడంతో ఫుడ్ డెలివరీ చేసే వేలాది గిగ్ వర్కర్లు ఉపాధి కోల్పోయే ప్రమాదం ఉంది.

హోటళ్లు, రెస్టారెంట్లకే పరిమితం కాలేదీ సంక్షోభం. ముంబై, ఢిల్లీ వంటి నగరాల్లో పైప్డ్ గ్యాస్ సరఫరా కొనసాగుతుందో తగ్గుతుందో ఇంకా స్పష్టత లేదు. ప్రపంచంలోని అతిపెద్ద కంటైనర్ షిప్పింగ్ కంపెనీలలో ఒకటైన మార్స్క్ పశ్చిమాసియాకు వెళ్లే అన్ని రవాణాలను తాత్కాలికంగా నిలిపివేసింది. దీంతో భారత్‌ నుంచి బహ్రెయిన్, అరబ్‌ ఎమిరేట్స్‌, సౌదీ అరేబియా, ఒమాన్, ఇరాక్, కువైట్, జోర్డాన్, ఖతార్ వంటి దేశాలకు ఎగుమతులు ప్రభావితమయ్యాయి.

వియత్నాం ప్రజలకు వర్క్ ఫ్రం హోమ్ సూచించింది. బంగ్లాదేశ్‌లో విద్యాసంస్థలకు వారాంతపు సెలవులు ప్రకటించారు. ఎస్సెన్షియల్‌ కమాడిటీస్‌ యాక్ట్‌ని అమలుచేస్తూ LPG సమానంగా పంపిణీ అవుతుందని మార్చి 10న కేంద్రం ప్రకటించింది. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల ముగ్గురు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లతో కమిటీ ఏర్పాటు చేసింది. దేశీయ ఇంధన మార్కెట్‌ను స్థిరపరచేందుకు ప్రభుత్వం ఆయిల్ రిఫైనరీల ఉత్పత్తిని 10శాతం పెంచాలని ఆదేశించింది. కానీ యుద్ధం ఇంకొన్నాళ్లు ఇలాగే కొనసాగితే మాత్రం.. వంటింట్లో గ్యాస్‌ సంక్షోభం మరింత అల్లకల్లోలం సృష్టించేలా ఉంది.

Share this post

submit to reddit
scroll to top