ఇరాక్నో లిబియానో ఆక్రమించినంత తేలికకాదని అర్ధమైంది. ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ యుద్ధం ప్రకటించి మూడ్నెల్లయింది. బాంబర్ల వర్షం కురవడం లేదన్న మాటేగానీ యుద్ధం ఇంకా నడుస్తోంది. మన ఇంటిదాకా చివరికి వంటింటిదాకా వచ్చేసింది. ఇంధన వాడకాన్ని తగ్గించుకోమని ప్రభుత్వం పిలుపు ఇచ్చేదాకా వచ్చింది. లేదు లేదంటూనే చమురు కంపెనీలు పెట్రో ధరలు పెంచాల్సి వచ్చింది. మరింత సంక్షోభం ముందుందనే సంకేతాలు వస్తున్నాయి. ఎలాంటి విపత్తులనైనా తట్టుకుని నిలబడగలిగే భారత్‌లోనే పరిస్థితులు ఇంత గంభీరంగా ఉంటే.. ఇక చిన్న దేశాల పరిస్థితి దారుణంగా ఉంది.
హార్మూజ్ జలసంధి చుట్టూ అమెరికా ఇంధన దిగ్బంధనం కొనసాగుతున్న నేపథ్యంలో క్యూబాలో డీజిల్, ఫ్యూయల్ ఆయిల్ నిల్వలు పూర్తిగా ఆవిరైపోయాయి. దీంతో రాజధాని హవానాలో ఎన్నో దశాబ్దాల్లోనే లేనివిధంగా అత్యంత తీవ్రమైన విద్యుత్ కోతలు నమోదవుతున్నాయి. క్యూబా జాతీయ విద్యుత్ గ్రిడ్ ప్రస్తుతం అత్యంత సంక్షోభ పరిస్థితిలో ఉంది. వారం నుంచి హవానాలో విద్యుత్ కోతలు తీవ్రంగా పెరిగాయి. కొన్ని ప్రాంతాల్లో రోజుకు 20 నుంచి 22 గంటల పాటు కరెంట్ లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
యుద్ధ ప్రభావంతో ఇప్పటికే పలు దేశాలు లాక్ డౌన్ తరహా ఆంక్షలు విధించాయి. మరికొన్ని దేశాలు ఇంధన కోటాను విధిస్తున్నాయి. శ్రీలంక, పాకిస్తాన్ వారానికి ఒక వాహనానికి కేవలం 5 లీటర్ల పెట్రోల్ మాత్రమే ఇచ్చేలా నిబంధనలు అమల్లోకి వచ్చాయి.
ఆహారం, ఇంధనం, మందుల కొరతతో విసిగి వేసారిపోయిన క్యూబా ప్రజల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంటోంది. క్యూబా విద్యుత్ ఉత్పత్తి పూర్తిగా దేశీయ ముడి చమురు, సహజ వాయువు, పునరుత్పాదక ఇంధన వనరులపైనే ఆధారపడి ఉంది. ఎవరైనా ఇంధనం అమ్మాలనుకుంటే మేం కొనడానికి సిద్ధంగా ఉన్నామని క్యూబా అడుక్కోవాల్సి వస్తోంది. ఒకప్పుడు క్యూబాకు ప్రధానంగా చమురు సరఫరా చేసిన మెక్సికో, వెనిజులా దేశాలు కూడా 2026 జనవరిలో ట్రంప్ జారీ చేసిన ఉత్తర్వుల తర్వాత ఆయిల్ సప్లైని ఆపేశాయి. క్యూబాకు ఇంధనం పంపే దేశాలపై టారిఫ్‌లు విధిస్తామని ట్రంప్ హెచ్చరించడమే దీనికి కారణం.
2025 డిసెంబరు తర్వాత రష్యా జెండాతో వచ్చిన ఒక్క పెద్ద ఆయిల్ ట్యాంకర్ మాత్రమే క్యూబాకు ముడి చమురు తీసుకువచ్చి తాత్కాలిక ఉపశమనం కల్పించింది. నాలుగో నెలలోకి ప్రవేశించిన అమెరికా ఇంధన దిగ్బంధనం కారణంగా దాదాపు కోటి జనాభా ఉన్న క్యూబాలో ప్రజా సేవలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. అమెరికా ఇంధన దిగ్బంధనం అక్రమమని గత వారం ఐక్యరాజ్యసమితి చెప్పినా ట్రంప్ తగ్గడం లేదు. మరోవైపు క్యూబా దేశం అంధకారంలోకి మునిగిపోయింది. దాంతో ప్రభుత్వం అధికారికంగా బ్లాక్ అవుట్ ప్రకటించింది.





