అదిగో దెయ్యం.. నాన్నతో కయ్యం!

kavitha-emotional-e1767847488805.jpg

అప్పుడేమో నాన్న దేవుడంది. కాకపోతే చుట్టూ దెయ్యాలు చేరాయంది. ఆ దెయ్యాలతో జరపైలం అని కన్నతండ్రిని హెచ్చరించింది. కానీ కొన్నాళ్లకే స్వరంమారింది. ఇప్పుడు ఇన్‌డైరెక్ట్‌గా తండ్రినే టార్గెట్‌ చేసింది. తెలంగాణ మండలిలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత భావోద్వేగపూరిత ప్రసంగం చూసిన తర్వాత అందరికీ కొత్త అనుమానాలు మొదలయ్యాయి. మొన్నటిదాకా అన్న కేటీఆర్‌, బావ హరీష్‌రావే టార్గెట్‌. కానీ ఇప్పుడు ఎవరైనా జాన్తానై అన్నట్లే ఉంది కేసీఆర్ బిడ్డ స్పీడు.

గతంలో ఎమోషనల్‌గా ఆమె ఎన్నయినా మాట్లాడి ఉండొచ్చుగాక. కానీ ఇప్పుడు పెద్దలసభలో కవిత ఎమోషనల్‌ కామెంట్స్‌ చర్చకు కారణమవుతున్నాయి. ఈసారి బీఆర్‌ఎస్‌ పార్టీనో, పార్టీ ముఖ్యనేతలో కాదు.. నేరుగా అధినేతపైనే విమర్శల బాణాలు ఎక్కుపెట్టారు కల్వకుంట్ల కవిత. కాంట్రాక్టు ఉద్యోగులు, ధర్నాచౌక్‌ తరలింపు నిర్ణయాలను కవిత తప్పుపట్టారు. టీఆర్‌ఎస్‌ని బీఆర్‌ఎస్‌గా మార్చడమే సరిదిద్దుకోలేని తప్పన్నట్లు మాట్లాడారు.

పదేళ్లు ప్రభుత్వాధినేతగా ఉన్న కేసీఆర్‌కి తెలియకుండా అవినీతి జరిగే అవకాశమే లేదన్నట్లున్నాయ్‌ కవిత ఆరోపణలు. తన పాలనలో అవినీతిని కేసీఆర్‌ చూస్తూ ఊరుకున్నారన్నట్లు కవిత కామెంట్స్‌ ఉన్నాయని పార్టీశ్రేణులు చెవులు కొరుక్కుంటున్నాయి. ఉద్యమకారులను దూరం పెట్టి ఉద్యమద్రోహులను అక్కున చేర్చుకున్నారనే అపవాదును కేసీఆర్‌ మోశారనుకుంటే.. అది అపవాదు కాదు నిజమేనన్నట్లు ఇప్పుడు కవిత వ్యాఖ్యలు ఉన్నాయనే చర్చ జరుగుతోంది.

ఫెడరల్‌ ఫ్రంట్‌కోసం కేసీఆర్‌ రాష్ట్రాల పర్యటనకు వెళ్లినప్పుడు కవిత మద్దతిచ్చారు. అప్పట్లో ఆయనకు తోడున్నారు. కానీ ఇప్పుడు బీఆర్‌ఎస్‌కి జాతీయపార్టీ స్థాయి లేదన్నట్లు మాట్లాడుతున్నారు. తెగేదాకా వచ్చాక తండ్రిని కూడా ఉపేక్షించేది లేదని తేల్చేశారు కేసీఆర్‌ బిడ్డ. అందుకే ఆమె వ్యాఖ్యలు సోషల్‌మీడియాను హోరెత్తిస్తున్నాయి. ఆమె ప్రతీ విమర్శ, ప్రతీ ఆరోపణ పరోక్షంగా కేసీఆర్‌వైపే వేలెత్తిచూపేలా ఉంది. దీంతో తండ్రితోనూ ఆమెకు గ్యాప్‌ ఏర్పడిపోయిందన్న టాక్‌ బలంగా వినిపిస్తోంది.

మూడునెలల తర్వాత కవిత రాజీనామాకు ఆమోదముద్ర పడింది. దీంతో బీఆర్‌ఎస్‌తో ఆమెకు అన్ని బంధాలు తెగిపోయినట్లే. కొత్త రాజకీయపార్టీపై ఆమె సంకేతాలిచ్చింది. తెలంగాణ రాజకీయాల్లో తానేంటో చూపిస్తానంటోంది. ఒంటరిప్రయాణంలో ఆమె నెగ్గుతుందో లేదోగానీ.. కల్వకుంట్ల కుటుంబానికైతే ఆమె పంటికిందరాయే!

Share this post

submit to reddit
scroll to top