బళ్లారిలో బస్తీ మే సవాల్‌.. ఎవరిది తప్పు?

bellari-clash-final-e1767415282603.jpg

నేతల మధ్య మాటలు పేలితే రాజకీయం. అదే తూటాలు పేలితే ప్రతీకారం. గనుల ఇలాకాలో ఇప్పుడు గన్‌లు స్వైర విహారం చేస్తున్నాయి. ఆక్కడేదీ ఊరికే జరగదు. అక్కడ ఏ నాయకుడూ ఊరికే మాట్లాడడు. వన్స్ పోట్లాటకు దిగితే అంతు చూసేదాకా వదలడు. బళ్లారి ప్రాంతంలో రాజకీయ ఉద్రిక్తతలు కొత్త కాదు. కానీ ఈసారి జరిగింది సాధారణ రాజకీయ గొడవ కాదు. వాల్మీకి జయంతికి ముందు రోజు రాత్రి ఒక బ్యానర్ వ్యవహారం బళ్లారిని భయపెట్టింది.

కాంగ్రెస్ కార్యకర్తలు గాలి జనార్ధన్ రెడ్డి ఇంటి సమీపంలో వాల్మీకి జయంతి బ్యానర్లు కట్టడం ఆయన అనుచరులకు నచ్చలేదు. ఫ్లెక్సీలపై అభ్యంతరం తెలడంతో వాగ్వాదం మొదలైంది. మాటలతో మొదలైన వాగ్వాదం క్షణాల్లోనే తోపులాటగా మారింది. చూస్తుండగానే పరిస్థితి పూర్తిగా అదుపు తప్పింది. రాళ్లతో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. చివరికి తూటాలు పేలేదాకా వెళ్లింది. ఈకొట్లాటలో ఓ కాంగ్రెస్ కార్యకర్త చనిపోయాడు.

బళ్లారి ఘటనపై కాంగ్రెస్ ఎమ్మెల్యే భరత్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. హింసకు పూర్తిగా గాలి జనార్ధన్ రెడ్డే బాధ్యుడని, వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఆరోపణలను తిప్పికొట్టిన గాలి జనార్ధన్ రెడ్డి ఇది కేవలం గొడవ కాదని, తనను హత్య చేయడానికి చేసిన కుట్ర అని ఆరోపించారు. ఇంటికి చేరుకుంటున్న సమయంలో తనపై కాల్పులు జరిగాయని ఆరోపించారు. దాడి వెనుక కాంగ్రెస్‌ ఎమ్మెల్యే భరత్ రెడ్డి ఉన్నారని గాలి జనార్దన్‌రెడ్డి ఆరోపించారు.

రాజకీయ గొడవ కాస్తా క్రైమ్ కేసుగా మారిపోయింది. గాలి జనార్ధన రెడ్డి, శ్రీరాములు, సోమశేఖర్ రెడ్డి సహా పదిమందికిపై కేసు నమోదైంది. ఎవరి మాట నిజం? అసలు అక్కడ నిజంగా కాల్పులు జరిగాయా అన్న ప్రశ్నలు మొదలయ్యాయి. కాల్పుల ఆరోపణలతో ఒక్కసారిగా బళ్లారి రాజకీయంగా హాట్‌స్పాట్‌గా మారింది. ఇది బ్యానర్ గొడవతో మొదలైన హింసేనా.. లేకపోతే ముందే పన్నిన పన్నాగమా అన్నది తేలాల్సి ఉంది.

Share this post

submit to reddit
scroll to top