సాయిపల్లవికీ ‘పెళ్లి’చేసేశారు!

saipllavi.jpg

పూజా కార్యక్రమం.. పెళ్లంటూ పుకార్లు!

అదిగో పులి అంటే అదిగో తోక అన్నట్లే ఉంటాయ్‌ గాసిప్స్‌. భుజంమీద కొంగుకప్పుకున్నా, నుదిటిమీద బొట్టు పెట్టుకున్నా, ఏ గుళ్లోనో, మరో అభినందన కార్యక్రమంలోనో మెళ్లో ఓదండ కనిపిస్తే మూడుముళ్లు పడ్డట్లే లెక్క. నీతినియమాలు లేవనుకునే ఇండస్ట్రీలో ఆ హీరోయిన్‌ని చూస్తే అందరికీ చూడముచ్చటేస్తుంది. అందంతోకాదు అభినయంతో అందరి హృదయాలు కొల్లగొట్టేసింది సాయిపల్లవి. ఆమె వస్త్రధారణలో ఎప్పుడూ వల్గారిటీ లేదు. చక్కగా మన పక్కింటి పిల్లలా, మనూరి అమ్మాయిలా అనిపిస్తుంది ఎవరికైనా. సింప్లిసిటీ అంటే ఏంటో మిగతాహీరోయిన్లు సాయిపల్లవిని చూసే నేర్చుకోవాలి.

పూజా కార్యక్రమం.. పెళ్లంటూ పుకార్లు!

ఫిదానుంచి విరాటపర్వం దాకా ఏ సిన్మాలోనైనా సాయిపల్లవి నటనకు హ్యాట్సాఫ్‌ చెప్పనివారు లేరు. తనమానాన తనేదో విలువలు కాపాడుకుంటూ తనకు నచ్చిన సిన్మాలు చేసుకుంటుంటే పనికిమాలిన పుకార్లు ఎక్కువయ్యాయి. సాయిపల్లవి పెళ్లయిపోయిందోచ్‌ అంటూ వదంతులొచ్చాయి. పక్కన ఓ అబ్బాయి..ఇద్దరి మెడల్లో దండలు. ఇంకేముందీ అమ్మానాన్నకు కూడా చెప్పకుండానే సాయిపల్లవి పెళ్లిచేసుకుందంటా అంటూ ఊహాగానాలు మొదలయ్యాయి. కాకిముక్కుకి దొండపండులా ఉన్న ఆజోడీని చూసి నమ్మరనుకున్నారేమో.. సాయిపల్లవి హృదయం ఎంత విశాలం అంటూ దానికి కూడా కవరింగ్‌. అబ్బాయి అందగాడు కాకపోయినా ఇష్టపడి చేసుకుందంటూ కలరింగ్‌.

ఫొటోకూడా ఉండేసరికి సోషల్‌మీడియాలో జరిగిన ఈ ప్రచారాన్ని ముందు కొందరు నిజమ అనుకున్నారు. తను నిజాయితీగా ఉన్నప్పుడు పనికిమాలిన ప్రచారాలు పట్టించుకోవాల్సిన పన్లేదన్నది సాయిపల్లవి ఫిలాసఫీ. సాధారణంగా ఎలాంటి పుకార్లు వచ్చినా పట్టించుకోకుండా తను పట్టించుకోదు. కానీ పెళ్లయిపోయిందన్న ప్రచారం శృతిమించటంతో సాయిపల్లవి స్పందించింది. అదంతా అబద్దమని ఖండించింది. కుటుంబ సభ్యులైన స్నేహితులను కూడా ఈ ప్రచారంలోకి లాగడంతో స్పందించాల్సి వస్తోందని సాయిపల్లవి వివరణ ఇచ్చింది.

సాయిపల్లవి కొత్త సినిమా పూజా కార్యక్రమంలో తీసిన ఫొటో అది. ఆ ప్రోగ్రాంలోచి ఒక ఫొటో తీసుకొని, దాన్ని కావాలనే క్రాప్ చేసి ఇలా చేశారు. కొంతమంది ఉద్దేశపూర్వకంగా ఈ పని చేశారని సాయిపల్లవి ఆవేదన వ్యక్తంచేసింది. సినిమాలకు సంబంధించి ఆసక్తికరమైన ప్రకటనలు చేయడానికి తాను సిద్ధమవుతుంటే.. ఇలాంటి పనికిమాలిన పనులు తనని నిరుత్సాహపరుస్తున్నాయని సాయిపల్లవి ఆవేదన చెందింది. ఇలా ఒకర్ని అసౌకర్యానికి గురిచేయడం చాలా నీచమైన పనంటూ ప్రచారాన్ని ఖండించింది. ఇలాంటి సున్నిత మనసుల ఆవేదన నీచులకు అర్ధమవుతుందా!

Share this post

submit to reddit
scroll to top