‘సర్వే’జనా.. సుఖినోభవంతు!

poll-survey.jpg

సర్వే జనా సుఖినోభవంతు. అంటే జనమంతా సుఖంగా ఉండాలని. కానీ జనం సుఖంగా ఉంటారో ఉండగలరో లేదోగానీ ఈ నానుడిలోని సర్వే మాత్రం నాయకుల భవిష్యత్తుకు కీలకమవుతోంది. అదే సమయంలో ఈ ఎన్నికల సీజన్‌లో సర్వేలు నిర్వహించే వారి జీవితం మాత్రం మూడు సర్వేలు- ఆరు సంపాదనలన్నట్లు మారిపోయింది. ప్రతీ పార్టీకి సర్వేలే కీలకంగా మారుతున్నాయి. ఆ సర్వేల ఆధారంగానే టికెట్లు కేటాయిస్తున్న దాదాపుగా అన్ని పార్టీలు. కొన్ని పార్టీలు సొంతంగా సర్వేలు చేయించుకుంటున్నాయి. కొన్ని పార్టీల్లో ఆశావహులు సొంత సర్వేలతో తమ స్థానబలం ఎలా ఉందో చూసుకుంటున్నారు.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఎవరి నోట విన్నా ఇప్పుడు సర్వే మాటే. గతంలో ఒక్కసారి జరిగేదేమో. ఇప్పుడు వారం, నెల, క్వార్టర్‌ ఇలా టైమ్‌ బేస్ సర్వేలతో అప్‌డేట్స్‌ తీసుకుంటున్నారు. సర్వే సంస్థలకు క్షణం తీరికలేనట్లు చేతి నిండా పని దొరికింది. అభ్యర్థుల ఎంపికతో పాటు తాజా రాజకీయ పరిస్థితులు ఆకళింపు చేసుకోవడం, ప్రజానాడిని పసిగట్టడంలో సర్వేలే కీలకంగా నిలుస్తున్నాయి. పార్టీలకు అతీతంగా కొందరు నాయకులు విడిగా కూడా సర్వేలు చేయించుకొని నియోజకవర్గంలో తమ పరిస్థితెలా ఉందో చూసుకుంటున్నారు. గట్టెక్కుతామో లేదో ముందే పల్స్‌ తెలుసుకుంటున్నారు. ఎక్కడైనా లోటుపాట్లు ఉంటే సరిచేసుకునే ప్రయత్నాల్లో ఉన్నారు.

సీఎం కేసీఆర్‌ రెండేళ్ల కిందటే సర్వేలకు శ్రీకారం చుట్టారు. ప్రతీ ఆరునెలలకోసారి క్రమం తప్పకుండా సర్వేలు చేయించారు. ఎమ్మెల్యేల పనితీరు, ప్రభుత్వ పథకాలు అమలు తీరు, ప్రజల్లో పార్టీకున్న ఆదరణ.. ఇలా అనేక అంశాలు తీసుకొని బీఆర్‌ఎస్‌ అధినేత రకరకాల సంస్థలతో సర్వేలు చేయించారు. పార్టీ సమావేశంలో ఆ సర్వే వివరాలు బయటపెట్టి పనితీరు బాగాలేని వారిని మెరుగుపరుచుకోవాలని రెండేళ్లుగా హెచ్చరిస్తున్నారు. కొన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థుల మార్పుకు ఆ సర్వేలే ఆధారమంటున్నారు. అభ్యర్థులను ప్రకటించాక కూడా కొన్ని నియోజకవర్గాల్లో బీఆర్‌ఎస్‌ నాయకత్వం ఇప్పుడు మళ్లీ సర్వే చేయిస్తోంది.

కాంగ్రెస్‌లో కూడా ఈసారి సర్వేలే కీలకమన్న మాట బలంగా వినిపిస్తోంది. పీసీసీకి పెత్తనమివ్వకుండా ఏఐసీసీనే తనకు నమ్మకమైన ఏజెన్సీతో సర్వేలు చేయిస్తోంది. టికెట్లకోసం క్యూలో నిలుచున్న నేతలకు సర్వే నివేదికలే కీలకమన్న మాట నిర్మొహమాటంగా చెప్పేస్తోంది. ఎంత పెద్ద నాయకుడైనా సర్వేల్లో సానుకూలత లేకపోతే ఛాన్స్‌ కష్టమేనంటోంది కాంగ్రెస్‌కూడా. ఇక బీజేపీ నాయకులు పార్టీ టికెట్ల ప్రకటనకు ముందే సొంతంగా సర్వేలు చేయించుకొని తమ ప్లస్‌లు మైనస్‌లు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. నివేదికలు, సర్వేలు ఎలా ఉన్నా పనిచేసే వారికి పట్టమనే తమ సిద్ధాంతంలో ఎలాంటి మార్పు ఉండదని బీజేపీ నాయకులు చెబుతున్నారు.

 

Share this post

submit to reddit
scroll to top