స్వదేశంలోనే కొందరికి నియంత కావచ్చు. అమెరికాలాంటి అగ్రరాజ్యాలకు ప్రపంచానికే పెనుముప్పు కలిగించే మానవబాంబులా కనిపించి ఉండొచ్చు. కానీ దశాబ్దాల ప్రస్థానంలో ఇరాన్‌పై అయతుల్లా అలీ ఖమేనీది చెరగని ముద్ర. 2026 ఫిబ్రవరి 28న అమెరికా-ఇజ్రాయెల్ దాడిలో ఆయన ప్రాణాలు కోల్పోయి ఉండొచ్చుగానీ.. ఏడాదినుంచే ఆయన తన చావు ఎప్పుడైనా రావచ్చని ఊహించారు.
ఐదేళ్ల తర్వాత 2024 అక్టోబరులో మొదటిసారి ప్రజల ముందుకొచ్చిన ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ రాజీపడే ప్రసక్తే లేదని సందేశమిచ్చారు. టెహ్రాన్‌లోని మసీదులో వేలాదిమంది అనుచరులను ఉద్దేశించి తన ఆలోచనేంటో తేల్చిచెప్పేశారు. శత్రువు ఒత్తిళ్లకు లొంగేది లేదని చెప్పేశారు. 2024 అక్టోబర్‌కే ఖమేనీ పరిస్థితి క్లిష్టంగా కనిపించింది. ఎందుకంటే దానికి కొద్ది రోజుల ముందు హిజ్బుల్లా ప్రధాన కార్యదర్శి హసన్ నస్రల్లాను ఇజ్రాయెల్ భారీ బాంబులతో హతమార్చింది. నస్రల్లా మరణం ఖమేనీకి వ్యక్తిగతంగా పెద్ద దెబ్బగా మారింది.
ఇరాన్‌పై ఇజ్రాయెల్ వైమానిక దాడులు కూడా ఇరాన్ రక్షణ వ్యవస్థల బలహీనతను బయటపెట్టాయి. ఇరాన్ నుంచి ప్రయోగించిన క్షిపణులు, డ్రోన్లు కొంత నష్టం కలిగించినా ఇజ్రాయెల్ దాడులను ఆపలేకపోయాయి. తరువాత అమెరికా బాంబర్లు ఇరాన్ అణు కేంద్రాలపై దాడి చేయడంతో ఖమేనీ తన ప్రాణంకంటే ప్రతిష్టాత్మకంగా తీసుకున్న అణు కార్యక్రమానికి పెద్ద దెబ్బ తగిలింది.
ఆక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్ వ్యూహంతో గాజాలో హమాస్, లెబనాన్‌లో హిజ్బుల్లా, యెమెన్‌లో హౌతీలు, సిరియా-ఇరాక్ మిలీషియాలను ఖమేనీ ప్రోత్సహించారు. అయితే గాజా యుద్ధం తరువాత ఇజ్రాయెల్ దాడులతో ఈ వ్యూహం బలహీనపడింది. సిరియాలో బషర్ అల్ అసాద్ ప్రభుత్వ పతనం కూడా ఇరాన్‌కు దెబ్బగా మారింది.దేశంలో నిరసనలపై కఠిన నిర్బంధాన్ని అమలు చేసి ప్రజా వ్యతిరేకత మూటగట్టుకుంది ఖమేనీ ప్రభుత్వం. మూడు దశాబ్దాలకు పైగా అధికారంలో ఉన్న ఖమేనీ అంతర్గత విభేదాలు, బయటి ఒత్తిళ్ల మధ్య బ్యాలెన్స్ చేస్తూ ఖోమేనీ వారసత్వాన్ని కాపాడాలని ప్రయత్నించారు. కానీ ఖమేనీ శత్రువుల వ్యూహం నుంచి ఈసారి తప్పించుకోలేకపోయారు.
ఖమేని పెద్దకుమారుడు ముజ్తబా సుప్రీం లీడర్ అవుతారనుకున్నా అయతుల్లా అలిరెజా అరాఫీకి తాత్కాలిక బాధ్యతలు అప్పగించారు. ఖమేనికి అత్యంత సన్నిహిత వర్గంలో ఒకరిగా ఆయనకు గుర్తింపు ఉంది. అయితే తమ కనుసన్నల్లో నడిచే పాలకులు ఉండాలనే అమెరికా-ఇజ్రాయెల్ కోరుకుంటాయి. దానికి విరుద్ధంగా జరిగితే ఎవరు పగ్గాలు చేపట్టినా వారి నెత్తిన అమెరికా-ఇజ్రాయెల్ బాంబుల వర్షం కురవడమైతే ఖాయం.





