ముందు కోర్టులో తేల్చుకోండి.. ఆ తర్వాతే మా దగ్గరికి రండి అని ముందే తెగేసి చెప్పింది తెలంగాణ సర్కారు. ప్రభుత్వాలే నిర్ణయించుకోవాలని చెప్పేశాయి న్యాయస్థానాలు. టిక్కెట్ ధరల పెంపు కోసం అర్జీలు పెట్టుకోకండని కొన్నాళ్లక్రితమే ఫిల్మ్ ఇండస్ట్రీని రిక్వెస్ట్ చేసింది తెలంగాణ సర్కార్. అసెంబ్లీ సాక్షిగా సీఎం రేవంత్ అదే విషయాన్ని గట్టిగా చెప్పినా.. కొత్త భారీ సిన్మాలు రిలీజ్ అయినప్పుడల్లా అవే కన్‌ఫ్యూజన్లు రిపీట్ అవుతున్నాయి.
ఎఫ్‌డీసీ ఛైర్మన్‌గా దిల్ రాజు తన పరపతిని ఉపయోగించి గేమ్‌ఛేంజర్‌కి టిక్కెట్ రేట్లు పెంచుకున్నారు. తర్వాత కూడా మరికొందరు ప్రొడ్యూసర్ల ఒత్తిళ్లకు తలొగ్గి ప్రభుత్వాలు జీవోలివ్వడం, కోర్టుల్లో అవి బుట్టదాఖలవ్వడం ప్రహసనంగా మారింది. అఖండ-2, ఓజీ సినిమాల రిలీజ్ టైమ్‌లోనూ ఇదే జరిగింది. ధరల పెంపు జీవోలపై స్టే విధిస్తూ అప్పట్లో సింగిల్‌బెంచ్ తీర్పు ఇవ్వడం ప్రభుత్వ పెద్దల్ని ఇబ్బందిపెట్టింది. అందుకే తమ దగ్గరికొచ్చేముందు కోర్టుల దగ్గర క్లియరెన్స్ తెచ్చుకోమని సలహా ఇచ్చింది తెలంగాణ ప్రభుత్వం.
సంక్రాంతికి భారీ వసూళ్లపై ఆశలు పెట్టుకున్న చిరు, ప్రభాస్ సిన్మాల ప్రొడ్యూసర్లు హైకోర్టును ఆశ్రయించారు. తీర్పు కూడా సానుకూలంగా వచ్చింది. గతంలో సింగిల్ బెంచ్ ఇచ్చిన ఆదేశాలు ఆ మూడు సినిమాలకే పరిమితమని, మీ సినిమాలకు వర్తించవని డివిజన్ బెంచ్ క్లారిటీ ఇచ్చింది. టికెట్ ధరల పెంపు, బెనిఫిట్ షోల అనుమతిపై హోమ్ సెక్రటరీదే తుది నిర్ణయమని హైకోర్టు ఆదేశాలిచ్చింది.
ఎందుకొచ్చిన గోలని టికెట్ రేట్ల విషయంలో రేవంత్ ప్రభుత్వం కూడా ఆచితూచి ముందుకెళ్తోంది. అటూఇటూ ఊగిసలాడకుండా నిర్దిష్టమైన గైడ్‌లైన్స్‌తో క్లియర్‌కట్‌గా ప్రభుత్వం ఓ చట్టం చేసేదాకా ఈ పంచాయతీ తెగేలా లేదు.





