అంతరిక్షంలోనే గడిపేస్తున్నారు నాసా వ్యోమగామి సునీతా విలియమ్స్. ఆనందంగా కాదు, అనివార్యంగా. క్షేమంగా ఆమెని భూమ్మీదికి తీసుకురావాల్సిన స్పేస్‌ఎక్స్ క్రూ-10 మిషన్ చివరి నిమిషంలో ఆగిపోవడం మరోసారి షాక్ ఇచ్చింది. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్‌లో ఉన్న సునీతా విలియమ్స్ భూమిపై ఎప్పుడు అడుగు పెడతారనే ప్రశ్న ప్రశ్నగానే మిగిలిపోతోంది. బోయింగ్ క్రూ ఫ్లైట్ టెస్ట్‌లో భాగంగా నాసా గతేడాది జూన్‌లో ప్రయోగాత్మక పరీక్ష చేపట్టింది. అయితే వారం రోజుల్లో తిరిగి వచ్చేయాల్సిన సునీతా విలియమ్స్.. సాంకేతిక కారణాలతో క్యాప్యూల్స్ ఖాళీగా వచ్చేయడంతో 9 నెలలుగా అంతరిక్షంలోనే చిక్కుకుపోయారు. ఆమెతోపాటు మరో వ్యోమగామి బుచ్ విల్మోర్ కూడా అక్కడే ఉండిపోయారు.
సునీతావిలియమ్స్‌తో పాటు బుచ్ విల్మోర్‌ని భూమిపైకి తిరిగి క్షేమంగా తీసుకొచ్చేందుకు ఎలాన్ మస్క్ కంపెనీ స్పేస్‌ఎక్స్ సాయంతో నాసా ప్రయత్నాలు సాగిస్తోంది. ఆ ప్రయోగాలు.. ప్రయత్నాలేవీ ముందుకెళ్లకపోవడం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే రెండు సార్లు వాయిదా పడ్డ ప్రయోగాలు.. ఇప్పుడు మూడోసారీ చివరి క్షణాల్లో ఫలించలేదు. స్పేస్ ఎక్స్ క్రూ-10 మిషన్ ద్వారా నలుగురు వ్యోమగాముల్ని అంతరిక్ష కేంద్రానికి పంపి సునీతా విలియమ్స్‌తోపాటు బుచ్ విల్మోర్‌ను వెనక్కి రప్పించేందుకు నాసా 9 నెలలుగా ప్రయత్నిస్తోంది. మూడోప్రయత్నంగా అమెరికా ఫ్లోరిడాలోని కెనడీ అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి రాకెట్‌ని ప్రయోగించబోయింది. అయితే చివరి నిమిషంలో సాంకేతిక సమస్యతో ప్రయోగం నిలిచిపోయింది.
రాకెట్ హైడ్రాలిక్ సిస్టమ్‌లో సమస్య ఉత్పన్నం కావడంతో ప్రయోగం నిలిపివేసినట్లు నాసా ప్రకటించింది. సమస్యను పరిష్కరించి వారంలో మరో ప్రయోగం చేయనున్నట్లు తెలిపింది. సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్‌ను తీసుకురావాల్సిన స్పేస్ ఎక్స్ రాకెట్‌ల పనితీరుపై పెద్దఎత్తున అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కొద్దిరోజుల క్రితం స్పేస్ ఎక్స్ రాకెట్ లాంచింగ్ సమయంలో పేలిపోయింది. అంతకుముందు జనవరిలోనూ స్పేస్ ఎక్స్‌కు చెందిన మరో రాకెట్ కూడా ఫెయిల్ అయింది. తాజాగా అంతరిక్షంలోకి వెళ్లాల్సిన స్పేస్‌ఎక్స్ క్రూ-10 మిషన్ సాంకేతిక లోపంతో మరోసారి నిలిచిపోయింది.
ఇలా వరుసగా మూడుసార్లు స్పేస్ ఎక్స్ రాకెట్ ప్రయోగాలు విఫలమవడంతో వ్యోమగాములను సురక్షితంగా భూమిపైకి తీసుకురాగలరా అనే అనుమానాలొచ్చినా అన్నిటినీ పటాపంచలు చేస్తూ సేఫ్‌గా ల్యాండ్ అయింది సునీతా విలియమ్స్ టీమ్. ఆమె నేలపైకి దిగే దృశ్యాన్ని ప్రపంచమంతా అబ్బురంగా చూసింది. కాకపోతే తను సాధారణస్థితికి చేరడానికి కొంతకాలం పట్టొచ్చంతే!