రోడ్డెక్కి గోలచేస్తే తప్పు ఒప్పవుతుందా?

KCR-e1769963247610.jpg

అధికారంలో ఎవరున్నా ఫోన్‌ ట్యాపింగ్‌ సర్వసాధారణం అన్నట్లు మాట్లాడుతున్నారు కేటీఆర్‌. నిజమే..కొన్నిసార్లు అది అనివార్యం కావచ్చు. కాకపోతే శాంతిభద్రతల విషయంలోనో, తీవ్రవాద, ఉగ్రవాద కార్యకలాపాలపై నిఘాకోసమో అయితే ఎవరికీ అభ్యంతరం ఉండదు. కానీ విపక్షనేతలు, కొందరు స్వపక్షనేతలు, జర్నలిస్టులు, అధికారులు, చివరికి కొందరు సెలబ్రిటీల కాల్స్‌ని కూడా చాటుమాటుగా వినడమే అభ్యంతరకరం. ఈ వ్యవహారం పరాయివాళ్ల పడకగదుల్లోకి నక్కినక్కి తొంగిచూడటంలాంటిదే.

తన ఫోన్‌ని కూడా ట్యాపింగ్‌చేశారని స్వయంగా కేసీఆర్‌ కూతురు కవిత ఆరోపించారంటేనే ఇది ఏ స్థాయిలో జరిగిందో అర్ధమవుతోంది. కవిత అన్నతో, తండ్రి పార్టీతో విభేదించింది ఈమధ్యే. కానీ కుటుంబంతో మంచి సంబంధాలు ఉండగానే ఆమె ఫోన్‌ని ట్యాపింగ్‌ ఎందుకు చేశారో ఆ చేసినవాళ్లు, ఆదేశించినవాళ్లకే తెలియాలి. కవిత అనుమానం నిజమై ఉంటే మాత్రం కేసీఆర్‌ జమానాలో రాజకీయప్రత్యర్థులు, అధికారులు అందరిమీదా నిఘా పెట్టి ఉండాలి. కేటీఆర్‌ చెబుతున్నట్లు చాలాచోట్ల ఇది సహజంగా జరుగుతున్న ప్రక్రియే కావచ్చుకానీ.. బీఆర్‌ఎస్‌ పదేళ్లపాలనలో నీడను కూడా అనుమానించేలా ట్యాపింగ్‌ వ్యవహారం జరిగిందన్న అనుమానాలున్నాయి.

అధికారులతో మొదలైంది. రాజకీయనాయకులదాకా వచ్చింది. ఓ మీడియాసంస్థ అధిపతికూడా విచారణకు హాజరుకావాల్సి వచ్చింది. కేటీఆర్‌, హరీష్‌రావుతోనే ఆగలేదు.. ట్యాపింగ్‌ కథ ఇప్పుడు కేసీఆర్‌ గడపదాకా వచ్చింది. తన వాగ్దాటితో, పాదరసంలాంటి బుర్రతో ఎవరినైనా ఉక్కిరిబిక్కిరిచేయగల మాటలమాంత్రికుడు నాలుగున్నర గంటలు విచారణ ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇంటికే వచ్చి విచారించడం ద్వారా కేసీఆర్‌ మర్యాదను ప్రత్యేక దర్యాప్తు బృందం కాస్త కాపాడింది. ఆరుగురు అధికారుల బృందం ముందే సిద్దంచేసుకున్న ప్రశ్నలతో గుచ్చిగుచ్చి ప్రశ్నించింది. అవును ఆదేశించానని చెప్పలేరు. తనకేం సంబంధంలేదని అడ్డంతిరగలేరు. కొన్ని ప్రశ్నలకు తెలిసింది చెప్పాల్సి వచ్చింది.

గతంలో విచారించిన వారి వాంగ్మూలాల ఆధారంగా కేసీఆర్‌ని సిట్‌ అధికారులు ప్రశ్నించారు. కేసీఆర్‌ అధికార చరమాంకంలో బీజేపీని బుక్‌ చేసేందుకు చేసిన బిగ్‌ ఆపరేషన్‌ ప్రస్తావన కూడా ఎంక్వయిరీలో వచ్చింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలుకు కుట్ర జరిగిందని అప్పట్లో సంచలన ఆపరేషన్‌కు సంబంధించిన ఆడియోలు ఎలా వచ్చాయనే అంశంపై కేసీఆర్‌ని సిట్‌ బృందం విచారించింది. సీఎం ఆదేశాలతోనే అప్పట్లో ఇంటెలిజెన్స్‌ అధికారులు ఫోన్‌ ట్యాపింగ్‌ చేశారా అనే విషయంపై సిట్ అధికారులు లోతుగా ప్రశ్నించినట్లు సమాచారం.

ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ప్రభాకర్‌రావు పదవీకాలాన్ని ఎందుకు పొడిగించాల్సి వచ్చిందని కూడా సిట్‌ ఆరాతీసింది. పరిపాలనా నియమావళికి విరుద్ధంగా ఒకరికే రెండు కీలక బాధ్యతలు అప్పగించడంపై అప్పటి ప్రభుత్వాధినేతపై సిట్ అధికారులు ప్రశ్నలు సంధించారు. ఫోన్ ట్యాపింగ్ ఎక్విప్‌మెంట్‌ కొనుగోలుకు పార్టీ ఫండ్‌ను ఎందుకు వాడాల్సి వచ్చిందన్న అంశంపైనా సిట్‌నుంచి కేసీఆర్‌ ప్రశ్నలు ఎదుర్కున్నారు. బీఆర్‌ఎస్‌కి ఎలక్టోరల్ బాండ్స్ ఇచ్చిన వారి ఫోన్ నెంబర్లు ట్యాపింగ్ లిస్ట్‌లో ఎందుకున్నాయనేదానిపైనా సిట్‌ ప్రశ్నలవర్షం కురిపించిందని సమాచారం.

వయస్సు, భద్రతా కారణాల దృష్ట్యా కేసీఆర్‌ని నందినగర్‌లోని ఆయన నివాసంలోనే సిట్ అధికారులు విచారించారు. అయితే అదే సమయంలో తెలంగాణ భవన్‌సహా పలుచోట్ల బీఆర్‌ఎస్‌ శ్రేణులు నిరసనలకు దిగాయి. కాంగ్రెస్‌ ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు దిగుతోందని ఆరోపణలు గుప్పించాయి. ఆధారాలతో జరుగుతున్న విచారణకు సహకరించకుండా.. గుమ్మడికాయ దొంగల్లా భుజాలు ఎందుకు తడుముకుంటున్నారని అధికారపక్షంనుంచి గట్టిగానే కౌంటర్లు పడుతున్నాయి.

Share this post

submit to reddit
scroll to top