అయ్యకు తగ్గ కొడుకు.. నీ టాలెంట్‌ తగలెయ్య!

hq720.jpg

సోషల్‌మీడియాలో కాస్త క్రేజ్‌ రాగానే కొందరికి ఒళ్లు బలిసిపోతోంది. పుత్రోత్సాహంబు తండ్రికి అని ఆ తండ్రికి మాత్రం కొడుకు బండబూతులు కూడా వీనుల వింపుగా వినిపించి ఉంటాయి. వినేవాళ్లకు, చూసేవాళ్లకు కంపరం పుట్టింది. చేసిందే తప్పు. సరే ఏదో అత్యుత్సాహం కొద్దీ కొన్ని వాడకూడని బూతులు వాడేశానని, మరోసారి ఇలా జరగదని లెంపలేసుకుంటే అక్కడితో వివాదం ఆగిపోయేది. కాని యాటిట్యూడ్‌ స్టార్‌ కదా.. తను బట్టలిప్పి తిరిగినా లేటెస్ట్‌ ఫ్యాషన్‌ అని చెప్పుకునే బరితెగింపు ఆ నాన్నకు తగ్గ కొడుకుది.

అయ్య బుల్లితెరమీద పాతుకుపోయాడు. కొడుకుని పెద్దతెరపై చూడాలని ముచ్చటపడ్డాడు. కుర్రాడు ఒడ్డూపొడుగూ బానే ఉన్నాడని ప్రొడ్యూసర్లు ఓ ఛాన్స్‌ కూడా ఇచ్చారు. కానీ బురదలో దొర్లే జీవికి పన్నీరు వాసన పడదన్నట్లే ఉంది ఆ తెగబలిసిన సో కాల్డ్‌ యువహీరో వ్యవహారం. బరాబర్ ప్రేమిస్తా అనే సిన్మాలో అతగాడొక హీరో. పేరు చంద్రహాస్‌. గట్టి బ్యాక్‌గ్రౌండ్‌. దశాబ్దాలుగా బుల్లితెరపై మనం చూస్తున్న ప్రభాకర్‌ కొడుకే ఈ చంద్రహాస్‌. సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్‌లో హీరో చంద్రహాస్ మైక్‌ అందుకోగానే గొంతు బానే ఉందనుకున్నారు. కానీ డ్రెయిన్‌లోంచి మురుగు తన్నుకొచ్చినట్లు ఆ బూతుల దుర్గంధంతో చెవులు మూసుకోవాల్సి వచ్చింది.

పబ్లిక్‌గా బండబూతులతో స్వరాలు పాడేస్తా.. అందరూ ఆమోదించాలన్నట్లుంది చంద్రహాస్‌ వ్యవహారం. ఇదేం పోయేకాలంరా అని అంతా తిట్టిపోస్తున్నా, సోషల్‌మీడియాలో ట్రోలింగ్‌ చేస్తున్నా నెత్తికెక్కిన కళ్లు కిందికి దిగలేదు. చివరికి విషయం కేసులదాకా వెళ్లింది. అనుకోకుండా అలా జరిగిపోయిందని సినిమా డైరెక్టర్‌, ప్రొడ్యూసర్‌ విచారం వ్యక్తంచేస్తున్నారు. చంద్రహాస్‌ ఏవో బూతు చరణాలు కలిపేశాడుగానీ.. సినిమా మాత్రం చాలా క్లీన్‌గా ఉంటుందని కుటుంబసమేతంగా చూసేలా ఉంటుందని చెబుతున్నారు. ఫిబ్రవరి 6న రిలీజ్‌ చేద్దామనుకుంటే పెద్ద సమస్యే తెచ్చిపెట్టాడు సన్నాఫ్‌ ప్రభాకర్‌.

పాటని గుంజి గుంజి ఎక్కడికో తీసుకుపోయాడు యాటిట్యూడ్ స్టార్ చంద్రహాస్‌. పబ్లిక్‌గా స్టేజ్ పై అలాంటి బూతు పాట ఎలా పాడతావంటూ అతన్ని నెటిజన్లు దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. కడుపుకి అన్నం తినేవాడెవడూ అలాంటి పాటరాయడు. గాయకుడన్నవాడెవడూ అలాంటి చరణాలు పాడడు. కానీ చంద్రహాస్‌ యాటిట్యూడ్‌ స్టార్‌ కదా! లిరిక్స్‌ మార్చేసి.. బూతు పదాలు కలిపేసి తన పైత్యం ప్రదర్శించాడు.

చంద్రహాస్‌ ఆ బూతు పాట పాడే సమయంలో జేడీ చక్రవర్తి అక్కడే ఉన్నా మౌనంగా ఉన్నాడని సోషల్ మీడియాలో కొందరు పోస్టులు పెడుతున్నారు. దీంతో అక్కడేం జరుగుతుందో తెలియని స్థితిలో ఉన్నానని, అవి బూతు పదాలని గ్రహించిన తర్వాత వెంటనే తాను వెళ్లిపోవాల్సిందని జేడీ చక్రవర్తి రిగ్రెట్‌ అయ్యాడు. మూవీ ప్రమోషన్లు క్రియేటివ్‌గా ఉండాలనుకోవడం తప్పుకాదుగానీ.. అసభ్యంగా ఉండకూడదంటూ ఆయనో వీడియో రిలీజ్ చేశారు.

మరోవైపు తన వ్యవహారాన్ని తప్పుపట్టిన ఓ జర్నలిస్టుకి చంద్రహాస్‌ 24 గంటల టైమిస్తున్నా అంటూ వార్నింగ్‌ ఇచ్చాడు. దీంతో ఆ జర్నలిస్టు తనకు ప్రాణహాని ఉందంటూ పోలీసులకు కంప్లెయింట్ చేశాడు. నాలా టాలెంట్‌ని నమ్ముకోరా అంటూ ప్రభాకర్‌ కొడుక్కి నాలుగు మంచి మాటలు చెబితే బావుంటుందేమో!

Share this post

submit to reddit
scroll to top