విధ్వంసం, విశ్వరూపం, వీరవిహారం. రోహిత్ ఇన్నింగ్స్ ముందు ఈ ఉపమానాలన్నీ దిగదుడుపే. ఆకలిగొన్న సింహంలా బంతిపై విరుచుకుపడే హిట్‌మ్యాన్ బ్యాటింగ్‌తో శివతాండవం చేస్తాడు. అలాంటి రోహిత్‌శర్మ అత్యధిక సిక్స్‌లు కొట్టిన ఆటగాడిగా మరో రికార్డ్ సృష్టించాడు. వన్డేల్లో రోహిత్ శర్మ అత్యధిక సిక్స్‌ల వీరుడిగా నిలిచాడు.
రాంచిలో దక్షిణాఫ్రికా, టీమ్‌ఇండియా మధ్య జరుగుతున్న తొలి మ్యాచ్‌లో రికార్డ్ బ్రేక్ చేశాడు. మూడు సిక్స్‌లు కొట్టి పాక్ క్రికెటర్ షాహిద్ అఫ్రిదీని వెనక్కు నెట్టి తన పేర కొత్త రికార్డ్ రాసుకున్నాడు 38 ఏళ్ల రోహిత్. దక్షిణాఫ్రికా ఆఫ్ స్పిన్నర్ ప్రేనలెన్ సుబ్రాయన్ బౌలింగ్‌లో తన 350వ వన్డే సిక్స్‌ను కొట్టాడు. ఆ తర్వాత బంతికి అదే షాట్‌ను రిపీట్ చేస్తూ అఫ్రిదితో సమానంగా నిలిచాడు. ఆవెంటనే మరో భారీ సిక్సర్ బాది నెంబర్ వన్‌గా నిలిచాడు.
అత్యధికంగా ఆస్ట్రేలియాపై 88 సిక్స్‌లతో విరుచుకుపడ్డాడు హిట్ మ్యాన్. ఆ తర్వాత శ్రీలంకపై 58 సిక్స్‌లు కొట్టాడు. న్యూజిలాండ్‌పై 47, వెస్టిండీస్‌పై 35, బంగ్లాదేశ్‌పై 27, పాకిస్థాన్‌పై 27, ఇంగ్లండ్‌పై 21, సౌతాఫ్రికాపై 20 సిక్స్‌లు బాది అత్యధిక సిక్స్‌లు కొట్టిన ఆటగాడిగా రోహిత్ రికార్డు సృష్టించాడు.
352 సిక్స్‌లతో రోహిత్ శర్మ ఫస్ట్ ప్లేస్‌లో ఉంటే.. 351 సిక్స్‌లతో సెకండ్ ప్లేస్‌లో ఉన్నాడు పాకిస్తాన్ ఆల్‌రౌండర్ షాహిద్ అఫ్రిది. 331 సిక్స్‌లతో వెస్టిండీస్ డేరింగ్ అండ్ డాషింగ్ ప్లేయర్ క్రిస్‌గేల్ థర్డ్ ప్లేస్‌లో ఉన్నాడు. ఇక శ్రీలంక ప్లేయర్ సనత్ జయసూర్య 270 సిక్స్‌లతో నాలుగో స్థానంలో కొనసాగుతున్నాడు. మన ధనాధన్ ధోని 229 సిక్సర్లతో టాప్ 5గా ఉన్నాడు.





