ఎన్నికల పండుగలోపు ఇల్లు క్లీన్ చేసేద్దాం!

migrant-vote-e1766638329990.jpg

ఓటర్ల సవరణ జరిగితే కొన్ని వందల ఓట్లో, వేల ఓట్లో తగ్గిపోవచ్చు. కానీ ఎస్‌ఐఆర్‌ దెబ్బకు కోట్లకు కోట్ల ఓట్లు లేచిపోతున్నాయ్‌. విపక్షాలు ఎంత గోలపెట్టినా ఎలక్షన్‌ కమిషన్‌ దీన్నో యజ్ఞంలా పూర్తిచేస్తోంది. బెంగాల్‌లో అర్హుల ఓట్లు గల్లంతయ్యాయని దీదీ గగ్గోలు పెడుతుంటే.. తమిళనాడులో ఏకంగా 2కోట్లదాకా ఓటర్లు రద్దయ్యాయి. అధికార డీఎంకేకి గట్టి పట్టున్న నియోజకవర్గాల్లో లక్షల ఓట్లను లిస్ట్‌లోంచి తీసేసింది ఎలక్షన్‌ కమిషన్‌.

బెంగాల్‌, తమిళనాడు తర్వాత మిగిలిన రాష్ట్రాలపైనే ఈసీ ఫోకస్‌పెట్టింది. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలో ఉన్న తెలంగాణలోనూ ఎస్‌ఐఆర్‌ చేపట్టేందుకు సిద్ధమైంది. ఓటరు లిస్ట్‌ ప్రక్షాళనపై చీఫ్‌ ఎలక్షన్‌ కమిషనర్‌ జ్ఞానేశ్‌కుమార్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. త్వరలో తెలంగాణలోనూ S.I.R. (Special Intensive Revision) ప్రక్రియ అమలు చేస్తామని ప్రకటించారు. డూప్లికేట్‌ ఓట్ల తొలగింపు కోసం ఓటర్‌ జాబితాను క్లీన్‌ చేయాల్సిన అవసరం ఉందని సీఈసీ కామెంట్స్‌ చేయడం ఆసక్తిగా మారింది.

స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌.. దేశమంతా ఇప్పుడిదే హాట్‌ టాపిక్‌. అనేక అనుమానాలు, ఆరోపణలు, ఆందోళనల మధ్యే భారత ఎన్నికల కమిషన్‌ SIR ప్రక్రియను కంటిన్యూ చేస్తోంది. దేశంలోని ఓటరు జాబితాలో ఉన్న వలసవాదులు, అనర్హులను తొలగించడమే లక్ష్యంగా ముందుకెళ్తోంది. ఫస్ట్‌ ఫేజ్‌లో ఇప్పటికే బిహార్‌లో S.I.R. ప్రక్రియను సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్‌ చేసిన సీఈసీ.. సెకండ్‌ ఫేజ్‌లో 12 రాష్ట్రాల్లోని ఓటరు జాబితా దుమ్ము దులిపే పనిలో ఉంది. ఇప్పుడు థర్డ్‌ ఫేజ్‌కు సైతం కసరత్తు చేస్తోంది.

త్వరలోనే తెలంగాణతోపాటు మిగతా  రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో SIR ప్రక్రియ చేపట్టబోతోంది. ఓటర్‌ జాబితా ప్రక్షాళనలో భాగంగా దేశవ్యాప్తంగా పర్యటనలు చేస్తున్న భారత ప్రధాన ఎన్నికల కమిషనర్‌ జ్ఞానేశ్‌కుమార్‌ తెలంగాణలోనూ మూడు రోజుల టూర్‌ చేపట్టారు. హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో బూత్‌ లెవల్‌ ఆఫీసర్స్‌తో సమావేశం అయ్యారు. దేశంలో ఒక్కొక్కరికి రెండు, మూడు చోట్ల ఓట్లు ఉన్నాయన్నారు సీఈసీ జ్ఞానేశ్‌కుమార్‌. ఇలాంటి వాటిని తీసేయాల్సిన అవసరం ఉందని.. బిహార్‌లో అదే జరిగిందని చెప్పారు.

పండుగల ముందు ఇళ్లు పూర్తిగా శుభ్రం చేసుకున్నట్లు.. ఐదేళ్లకోసారి ఓటర్‌ జాబితాను కూడా క్లీన్‌ చేద్దామని సీఈసీ జ్ఞానేశ్‌కుమార్‌ పిలుపునిచ్చారు. దీనికి అనుగుణంగానే ఓట్లను సవరించేందుకు SIR ప్రక్రియ చేపట్టామన్నారు. డూప్లికేట్‌ ఓట్లను తొలగించడమే ప్రధాన ఉద్దేశమంటూ ఎస్‌ఐఆర్‌ ప్రక్రియలో ఎన్నికల కమిషన్‌ దూకుడుగా వ్యవహరిస్తోంది. తెలంగాణలోనూ త్వరలో ఈ ప్రక్షాళన మొదలవుతుందని సంకేతాలిచ్చేసింది. ఎస్‌ఐఆర్‌ ప్రక్రియను ఇండి కూటమి తీవ్రంగా వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ రియాక్షన్‌ ఎలా ఉంటుందో మరి!

Share this post

submit to reddit
scroll to top