వద్దంటే డబ్బు.. ఎలాన్‌మస్కా మజాకా!

elonmask-billioneer.jpg

ఎంత పెద్ద బిజినెస్ మేన్ అయినా రోజుకు ఎన్నికోట్లు సంపాదిస్తాడు. వంద, రెండొందలు, నాలుగొందలు కోట్లు. కానీ ప్రపంచ కుబేరుడు ఎలాన్‌ మస్క్‌ సంపదను అంచనా వేయలేం. ఫ్లాష్‌ ఫ్లడ్‌లా ఉంటుందాయన సంపాదన. అవును.. మస్క్ సంపాదనకు నో లిమిట్స్‌. డిసెంబర్ 15, 2025 నాటి ఫోర్బ్స్ అంచనాల ప్రకారం ఎలాన్‌మస్క్ సంపద 638 బిలియన్ డాలర్లు దాటింది. అంటే మన కరెన్సీలో 54లక్షల కోట్లకుపైగా చేరింది. ఇది ప్రపంచ చరిత్రలో ఎవరూ చేరని మైలురాయి.

600 బిలియన్లకు పైగా సంపద కలిగిన ఏకైక సంపన్నుడిగా ఎలాన్ మస్క్ సరికొత్త రికార్డు క్రియేట్ చేశాడు. ఇంత భారీగా సంపద పెరగడానికి కారణం స్పేస్‌ఎక్స్ కంపెనీ వాల్యుయేషన్. ఇటీవల ఇన్‌సైడర్ షేర్ సేల్‌లో స్పేస్‌ఎక్స్ విలువ 800 బిలియన్ డాలర్లకు చేరింది. ఇందులో మస్క్‌ షేర్‌ సుమారు 42శాతంగా ఉంది. దీంతో ఆయన సంపదకు ఒక్కరోజులోనే 168 బిలియన్ డాలర్లు కలిశాయి. స్పేస్‌ఎక్స్ ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత విలువైన ప్రైవేట్ కంపెనీగాఉంది. ఈ సంస్థ 2026లో IPOకు సన్నాహాలు చేస్తోంది.

టెస్లా, xAI కంపెనీలు కూడా మస్క్ సంపద పెరగడానికి కారణాలు. నవంబర్‌లో టెస్లా షేర్‌హోల్డర్లు ఆయనకు 1 ట్రిలియన్ డాలర్ల విలువైన కొత్త పే ప్యాకేజీని ఆమోదించారు. దీంతో మస్క్ త్వరలోనే మొదటి ట్రిలియనైర్‌గా మారనున్నాడు. ఐదేళ్ల కిందట మస్క్ ఆస్తుల విలువ 25బిలియన్ డాలర్లే. కానీ ఐదేళ్లలో ఆయన ఆస్తుల విలువ 25రెట్లు పెరిగింది. ఫోర్బ్స్ అంచనాల ప్రకారం xAI హోల్డింగ్స్‌లో మస్క్‌కు 53% వాటా ఉంది. దీని విలువ సుమారు 60 బిలియన్ డాలర్లు. 2020 మార్చిలో మస్క్ సంపద 24.6 బిలియన్ డాలర్లు.

టెస్లా షేర్ ధరలు వేగంగా పెరగడంతో 2020 ఆగస్టులో 100 బిలియన్ డాలర్ల సంపద కలిగిన ఐదవ సంపన్న వ్యక్తిగా రికార్డులకెక్కాడు. 2024లో 400 బిలియన్లు, 2025లో 500 బిలియన్లు .. ప్రస్తుతం ఆయన సంపద 600 బిలియన్లకు పైమాటే! రాకెట్లు, ఎలక్ట్రిక్ కార్లు, ఏఐ వంటి భవిష్యత్ టెక్నాలజీలపై ఆయన అంచనాల ఫలితమే ఇంతటి విజయానికి కారణమంటారు నిపుణులు. ఈ భూప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా ఉన్న మస్క్ ను టచ్ చేయాలంటే మిగతా బిలియనీర్స్‌కు ఇప్పట్లో సాధ్యం కాదు. ప్రస్తుత రెండో స్థానంలో ఉన్న గూగుల్ సహ వ్యవస్థాపకుడు లారీ పేజ్ సంపద 252 బిలియన్ డాలర్లు. అంటే ఆయన ఎలాన్‌మస్క్‌ను క్రాస్ చేయాలంటే మూడురెట్లు ఆర్జించాలి.

బ్లూమ్‌బర్గ్ ప్రపంచ కుబేరుల జాబితాలో టాప్ 20లో మనదేశానికి చెందిన ముఖేశ్ అంబానీ, గౌతం అదానీ పేర్లు ఉన్నాయి. 106బిలియన్ డాలర్ల సంపదతో టాప్ 18లో ముఖేశ్ పేరుండగా, 85బిలియన్ డాలర్ల సంపదతో టాప్ 20లో గౌతమ్ అదానీ ఉన్నారు.

Share this post

submit to reddit
scroll to top