ఆసియా కప్ ఫైనల్‌లో టీమిండిమా పేసర్ దెబ్బకి శ్రీలంక జట్టు కకావికలమైంది. కేవలం 50పరుగులకే శ్రీలంక ఆలౌట్ అయింది. ఒకే ఓవర్‌లో నాలుగు వికెట్లు తీసిన మహ్మద్ సిరాజ్ మొత్తం 21 పరుగులు ఇచ్చి ఆరు వికెట్లు పడగొట్టటంతో శ్రీలంక జట్టు చేతులెత్తేసింది. ఈ మ్యాచ్‌తో మహ్మద్ సిరాజ్ కొత్త రికార్డు నమోదుచేశాడు. ఆసియాకప్ చరిత్రలోనే బెస్ట్ బౌలింగ్‌గా నిలిచిపోయింది సిరాజ్ ప్రదర్శన.
వికెట్లు టపటపా పడిపోతుంటే శ్రీలంక బ్యాట్స్‌మెన్లలో ఒకరే కాసేపు క్రీజ్‌లో నిలవగలిగారు. 17పరుగులు చేసిన కుశాల్ మెండిస్ ఆ జట్టులో టాప్ స్కోరర్, ఏకంగా ఐదుగురు శ్రీలంక బ్యాట్స్‌మెన్ ఖాతా తెరవకుండానే డకౌట్లతో పెవిలియన్ బాట పట్టారు. పాథుమ్ నిశాంక (2), ధనంజయ డిసిల్వా (4), దునిత్ వెల్లలాగె(8) సింగిల్ డిజిట్‌కే పరిమితమైతే… చివరిలో దుషాన్ హేమంత (13) ఒక్కడే కొన్ని పరుగులు తీసి జట్టు స్కోరుని 50 పరుగులకైనా తీసుకెళ్లగలిగారు.
మహ్మద్ సిరాజ్ ఆరు వికెట్లు తీస్తే హార్థిక్‌పాండ్య మూడు వికెట్లు పడగొట్టాడు. మిగిలిన ఒక్క వికెట్ బుమ్రా ఖాతాలో పడింది. భారత్ జట్టు తరపున అత్యుత్తమ బౌలింగ్ నమోదుచేసిన నాలుగో బౌలర్‌గా నిలిచాడు మహ్మద్ సిరాజ్. అంతకుముందు స్టువర్ట్ బిన్నీ (6/4), అనిల్ కుంబ్లే (6/12), బుమ్రా (6/19) ఆ ఘనత సాధించారు. గతంలో షార్జాలో శ్రీలంకతో జరిగిన వన్డే ఫైనల్ మ్యాచ్‌లో భారత్ 54పరుగుల అతితక్కువ స్కోరుకు ఔటైంది. ఇప్పుడు శ్రీలంక 50 పరుగులకే ఆలౌట్ అయి అత్యల్ప స్కోరు చేసిన జట్టుగా నిలిచింది.
సిరాజ్ దెబ్బకు శ్రీలంక కుప్పకూలటంతో ఆడుతూపాడుతూ ఆసియా కప్ గెలిచేసింది టీమిండియా. వికెట్ నష్టపోకుండా టార్గెట్ ఛేజ్ చేసింది. ఆసియాకప్‌ని భారత్ గెలవడం ఇది ఎనిమిదోసారి.