మనిషి మెదడు గొప్పా? కంప్యూటర్ గొప్పా? ఇప్పటికైతే మెదడే పవర్‌ఫుల్. కానీ మనం అవునన్నా కాదన్నా కొన్నిసార్లు మెదడు కంటే కంప్యూటరే వేగంగా పనిచేస్తుంది. ఆధునిక యుగంలో కంప్యూటరే కీలకం కానుంది. అయితే ఈ రెంటినీ కలిపేస్తే ఎలా ఉంటుంది? అసాధ్యమనుకుంటున్నారా.. మనిషిని కంప్యూటర్‌ను ఒక్కటి చేసి చూపిస్తానంటున్నాడు ట్విట్టర్‌ని టేకోవర్ చేసుకుని చెడుగుడు ఆడేస్తున్న ఎలాన్‌మస్క్.
మెదడుని బయటినుంచి నియంత్రించడం కుదిరేపనేనా అంటే.. సాంకేతికత కొత్తపుంతలు తొక్కుతున్న ఈరోజుల్లో ఏదయినా సాధ్యమే. ఓ బుల్లి చిప్‌ను మెదడులో అమర్చితే చాలు.. మీ బ్రెయిన్ కంప్యూటర్‌కి కనెక్ట్ అయిపోతుంది. మైండ్‌లోని మెమరీ మొత్తం సిస్టమ్‌లో రికార్డ్ అయిపోతుంది. అంటే పొరపాటున మరిచిపోయినా మతిమరుపువచ్చినా మీ జ్ఞాపకాల్ని బ్యాకప్ తీసుకోవచ్చు. దాన్ని రీలోడ్ చేసుకుంటే మరిచి పోయిన సంఘటల్ని మళ్లీ గుర్తు చేసుకోవచ్చు. కీబోర్డు, మౌస్ అవసరం లేకుండానే కంప్యూటర్‌ని ఆపరేట్ చేసుకోవచ్చు. ఇంకో అద్భుతమైన విషయం ఏమిటంటే మన మెదడుతోనే ఇంట్లోని ఎలక్ట్రానిక్ పరికరాలన్నింటినీ నియంత్రించవచ్చు.
అంతేనా అంటే అంతులేనంత ఉంది. ఒక్క చిప్ సెట్ చేస్తే చాలు బ్రెయిన్‌లోని డేటాను కంప్యూటర్‌లో సేవ్ చేసుకోవచ్చు.. ఎరేజ్ చేయ్యవచ్చు.. ఎవరితోనైనా షేర్ చేసుకోవచ్చు. మానవుడి మెదడులో చిప్ అమరికపై కొన్నేళ్లుగా ప్రయోగాలు చేస్తున్న ఎలాన్‌మస్క్ ఆ దిశగా మరో అడుగు ముందుకేశాడు. మనిషిపై ప్రయోగం కంటే ముందు పంది మెదడులో కాయిన్ సైజులో ఓ కంప్యూటర్ చిప్ పెట్టి సక్సెస్ అయ్యాడు. ఆతర్వాత కోతి మెదడులో కూడా చిప్‌తో చేసిన ప్రయోగాలకు సానుకూల ఫలితం వచ్చింది. చిప్ పెట్టడంతో కోతి తన సొంత మెదడుతో వీడియో గేమ్స్ ఆడగలుగుతోంది.
ఇప్పుడు మనుషుల్లో కూడా మైండ్ చిప్‌ను పెట్టే ప్రయోగానికి సిద్ధమని టెస్లా అధినేత ఎలాన్‌మస్క్‌కు చెందిన న్యూరాలింక్ సంస్థ ప్రకటించింది. అమెరికా ఆహార ఔషధ నియంత్రణ సంస్థ (ఎఫ్‌డీఏ) దీనికి ఆమోదం కూడా తెలిపింది. పెరాలసిస్ పేషెంట్లపై ఫస్ట్ ట్రయల్స్‌కు రెడీ అయ్యారు. టెక్నాలజీ సాయంతో మనుషుల మెదళ్లను సూపర్ కంప్యూటర్లుగా మార్చడమే న్యూరాలింక్ ప్రాజెక్ట్ లక్ష్యం. భవిష్యత్తులో మన మెదళ్లలో ఇదే మెమరీ స్టోరేజ్ డివైజ్. సృష్టికి ప్రతిసృష్టిలాంటి ఈ ప్రయోగంతో మనిషి చనిపోయినా ఆలోచనలు, తెలివితేటల కాపీ భద్రంగా ఉంటుంది.
ఈ బ్రెయిన్ చిప్‌తో కంటి చూపుతో పాటు మెదడుకు సంబంధించిన ఏ వ్యాధినైనా నయం చేయవచ్చంటున్నారు ఎలాన్ మస్క్. చిప్ అవసరం లేనప్పుడు దాన్ని బ్రెయిన్ నుంచి తీసేయొచ్చు. ఇన్ని అద్భుతాలతో పాటే కొన్ని అనర్ధాలు కూడా తలెత్తే ప్రమాదం కూడా పొంచి ఉంది. ఇంటర్‌నెట్‌తో అనుసంధానించిన మన మెదడు మరొకరి కంట్రోల్‌లోకి వెళ్లే ప్రమాదం కూడా ఉంది. అంటే మన డబ్బు కోసమో, మన ప్రతిభ కోసమో భౌతికంగా కిడ్నాప్ చేయాల్సిన అవసరం లేదు. బ్రెయిన్‌ని హ్యాక్ చేస్తే సరిపోతుంది. భవిషత్తులో బ్రెయిన్ హ్యాకర్లు పుట్టుకొస్తే అల్లకల్లోలమే. అయితే రోబోలను సృష్టించింది ఆ మెదడే. రోదసిలోకి అడుగులు వేయించిందీ మన మెదడే. అద్భుతాల సృష్టికి మూలాధారమైన మానవ మెదడు ఇప్పుడు తన మూలాల్లోకి వెళుతోంది. తన జ్ఞాపకాలను భద్రపరిచే ప్రయోగాలకు వేదికవుతోంది. మార్పు మంచిదే. ఆహ్వానించాల్సిందే!