చంద్రబాబు జైల్లో ఉన్నారు. ఇదే సమయంలో అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. విపక్షానికి బుర్రలో కాస్త గుజ్జుంటే వ్యూహాత్మకంగా అసెంబ్లీలో గొంతెత్తి ఉండేది. అక్కడ ఎంతోకొంత చర్చతో జనం దృష్టిలో పడే అవకాశం ఉండేది. కానీ అసెంబ్లీ సమావేశాల్లో టీడీపీ వ్యూహం గాడి తప్పింది. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో తమ అధినేత తప్పు లేదని చెబుతున్న టీడీపీ నేతలు అసెంబ్లీ ద్వారా ఆ విషయాన్ని ప్రజలకు వివరించడంలో విఫలమైనట్లే కనిపిస్తోంది. సమావేశాల బహిష్కరణ ద్వారా టీడీపీ నేతలే అధికార పార్టీకి మంచి అవకాశం ఇచ్చారన్నది ఏపీలో పబ్లిక్‌టాక్.
ఏపీలో స్కిల్ డెవలప్‌మెంట్ స్కాం కేసు విషయంలో అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఇదే సమయంలో అసెంబ్లీ సమావేశాలతో తమ వాదనని గట్టిగా వినిపించేందుకు అధికార, ప్రతిపక్షాలకు మంచి వేదిక దొరికింది. కానీ ఈ అవకాశాన్ని వాడుకోవడంలో టీడీపీ వ్యూహాత్మక తప్పిదం చేసింది. చంద్రబాబుపై అక్రమంగా కేసులు బనాయించారని మొదటి రోజు నుంచి వాదిస్తున్న టీడీపీ నేతలు ఇదే విషయాన్ని అసెంబ్లీలో వినిపించి ఉండాల్సింది. ఎందుకంటే అసెంబ్లీలో జరిగే ప్రతి విషయం ప్రజల్లోకి వెళ్తుంది. తమ పార్టీకి కేటాయించే విలువైన సమయాన్ని ఉపయోగించుకుని ప్రభుత్వ ఆరోపణలను తిప్పి కొట్టి ఉండే.. టీడీపీ వాదన ప్రజల్లోకి బలంగా వెళ్లేది.
సాధారణంగా ఎప్పుడు సమావేశాలు జరిగినా తమకు మాట్లాడే అవకాశం ఇవ్వలేదనో, అడ్డుపడుతున్నారనో ప్రతిపక్ష టీడీపీ ఆరోపణలు చేస్తూ వస్తోంది. కానీ ఈసారి మాత్రం టీడీపీ ఇచ్చిన వాయిదా తీర్మానంపై చర్చకు సిద్ధమని మంత్రి బుగ్గన స్వయంగా సభలో ప్రకటించారు. అయినా సభలో గందరగోళంతో సస్పెన్షన్‌కు గురై మొదటిరోజు సభ నుంచి బయటికి వెళ్లిపోయారు. మీసాలు మెలేయడం, తొడలుకొట్టడంలాంటివాటితో అసలుకంటే కొసరెక్కువైంది. ఇక రెండో రోజు కూడా సభలో కొంతమంది సభ్యులను స్పీకర్ సస్పెండ్ చేశారు. అదే సమయంలో మిగలిన సభ్యులు కూడా సభ నుంచి వెళ్లిపోయారు. సమావేశాలను బహిష్కరిస్తున్నట్టు ప్రకటించారు.
స్కిల్ స్కామ్‌పై చర్చ సందర్భంగా టీడీపీ తమ వాదన వినిపించి ఉంటే అసెంబ్లీ రికార్డులకు ఎక్కేది. కానీ టీడీపీ సభ్యుల వైఖరితో కనీసం సభలో తమ అధినేతపై వచ్చిన ఆరోపణలను ఖండించినట్లు కూడా రికార్డులకి ఎక్కలేదు. కొన్ని కీలక అంశాల్లో గతంలో ఉన్న రికార్డులను కూడా అసెంబ్లీలో ప్రస్తావిస్తుంటారు. కానీ చంద్రబాబు విషయంలో బ్యాడ్‌లక్ ఏంటంటే ఆ అవకాశమే లేకుండా పోయింది. అసెంబ్లీకి దూరంగా ఎక్కడో పవర్ పాయింట్ ప్రజంటేషన్లు ఇవ్వడం కంటే సభలోనే మాట్లాడి ఉంటే బాగుండేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వ్వాట్ ఐయామ్ సేయింగ్ అనే పెద్దతలకాయే పరేషాన్‌లో ఉంటే టీడీపీ నేతలకు బుర్రలెక్కడ పనిచేస్తాయి?