అంచనాలకు అందని సిన్మా క్లైమాక్స్‌లా ఉంది ఢిల్లీ లిక్కర్‌స్కామ్. సీఎం కేసీఆర్ కూతురికి ఈడీ పిలుపు వచ్చినప్పుడల్లా ఏదో జరుగుతుందనుకోవడం, చివరికి ఏమీ జరగకపోవడం.. ఓ ప్రహసనంలా జరుగుతోంది. లిక్కర్ స్కామ్ కీలక నిందితులు అప్రూవర్లుగా మారిపోతున్నారు. ఇదంతా కేసీఆర్ కూతురిని ఇరికించేందుకేనన్న ప్రచారం బలంగా ఉంది. మరోసారి ఈడీనుంచి కవితకు నోటీసులు అందాయి. ఈసారి ఆమె అరెస్ట్ తప్పకపోవచ్చన్న ఊహాగానాల వెంటే నాటకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఢిల్లీ డిప్యూటీ సీఎం సిసోడియాని కూడా వదిలిపెట్టని ఈడీ కవిత విషయంలో దాగుడుమూతలు ఆడుతుందనే అనుమానాలైతే కొందరికున్నాయి.
తండ్రికి తగ్గ కూతురుకదా. మొహంమీద ఎక్కడా బెరుకు కనిపించదు. అదే గాంభీర్యం. లిక్కర్‌స్కామ్‌లో టార్గెట్ తాను కాదన్నది కవిత వాదన. కేసీఆర్‌ని ఇబ్బందిపెట్టడమే కేంద్రం లక్ష్యం అంటారామె. ఆ మధ్య ఈడీ విచారణకు హాజరైనప్పుడు ఇవిగో దర్యాప్తుసంస్థ చెబుతున్న ఫోన్లని కవర్‌లో వేసి ప్రదర్శించారు. రాత్రిదాకా విచారణ జరిగినా చివరికి విజయగర్వంతో బయటికొచ్చారు. సౌత్‌గ్రూప్‌లో కవితే కీలకమని, ఆమె ఆధారాలు నాశనం చేశారంటుంది ఈడీ. కీలకమైన నిందితులు అరెస్ట్ అయ్యారు. కొందరు బెయిల్‌పై బయటికొచ్చారు. ఈ ఏడాది మార్చిలోనే మూడుసార్లు ఈడీ ముందు హాజరైన కవితకు మరోసారి సమన్లు జారీఅయ్యాయి.
కవితకు బినామీగా ఈడీ అభియోగాలు మోపిన అరుణ్ రామచంద్రన్ పిళ్లై అప్రూవర్‌గా మారటంతో ఈసారి విచారించి పంపకపోవచ్చన్న అంచనాలున్నాయి. కవిత కూడా ఊహించినట్లే విచారణకు ఇప్పుడే రావడం లేదని జవాబిచ్చారు. తన లీగల్ టీంతో సమాధానం పంపారు. బీఆర్ఎస్ బీజేపీకి బి టీమ్‌గా విపక్షాలు ఆరోపిస్తున్నాయి. దానికితగ్గట్లే కవిత విషయంలో ఈడీ అడుగులు ముందుకుపడటం లేదు. తెలంగాణలో అధికారంలోకొస్తామని కలలు కంటున్న బీజేపీకి ఈ పరిణామాలు కాస్త ఇబ్బందికరంగానే ఉన్నాయి. ఎన్నికలముందు లిక్కర్ స్కామ్‌లో కవిత అరెస్ట్ అయితే ఏ లాలూచీ లేదని చెప్పుకునే అవకాశం ఉంటుంది. కానీ ఈడీ, కవిత మధ్య దాగుడుమూతలకు ముగింపు ఎలా ఉంటుందో అంతుపట్టటంలేదు.
మునుగోడు ఉప ఎన్నికల్లో తమను వాడుకుని అసెంబ్లీ ఎన్నికలొచ్చేసరికి కరివేపాకుల్లా పక్కనపడేసిన కేసీఆర్‌పై లెఫ్ట్ పార్టీలు గుర్రుమంటున్నాయి. సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ లిక్కర్ స్కామ్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్-బీజేపీ బంధం బలంగా ఉందనేందుకు కవిత ఎపిసోడే ఉదాహరణంటున్నారు నారాయణ. విచారణకు రాలేనంత బిజీగా ఉన్నాని కవిత చెప్పగానే కోర్టు ఎలా నమ్ముతుందన్నది నారాయణ ప్రశ్న. ప్రధాని మోడీ ఆదేశాలు లేకుండా ఇలా జరిగే అవకాశమే లేదంటున్నారు నారాయణ. మరోవైపు లిక్కర్ స్కామ్ కేసులో కల్వకుంట్ల కవితకు సుప్రీంకోర్టులో తాత్కాలిక ఉపశమనం లభించింది. సెప్టెంబర్ 26దాకా సమన్లు జారీ చేయవద్దని, ఆమెపై ఎలాంటి బలవంతపు చర్యలకు దిగరాదని ఈడీని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది.