ఒక్క సిన్మా అతని జీవితాన్ని మార్చేసింది!

vinayakan-e1695189533149.jpg

జైలర్‌ హీరో సూపర్‌స్టార్‌ రజినీకాంత్‌ అయినా అంతకుమించిన క్రేజ్‌ సంపాదించుకున్నాడు ఆ సిన్మా విలన్‌ వినాయకన్‌. ఒక్క సిన్మాతో అతని జీవితం మారిపోయింది. జైలర్‌లో అతని విలనిజం విశ్వరూపం ముందు అంతకుముందున్న ప్రతినాయకులంతా చిన్నబోయినట్లు అయిపోయింది. జైలర్‌ తర్వాత వరుస అవకాశాలతో బిజీ అయిపోయాడు వినాయకన్‌.

రజినీకాంత్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా జైలర్‌ కొత్త రికార్డులు సృష్టించింది. కోలీవుడ్‌ రికార్డులన్నీ చెరిపేసి తలైవా స్టామినాని మరోసారి వెండితెరకు చాటిచెప్పింది. ఏకంగా 650 కోట్లకు పైగా కలెక్ట్ చేసిన జైలర్ రజిని కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్ సిన్మాల్లో ఒకటిగా నిలిచింది. సిన్మాలో విలన్ పాత్రలో నటించిన వినాయకన్‌కి ఎంతో గుర్తింపు వచ్చింది.

తమిళ, మలయాళం సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు, కామెడీ, విలన్ వేషాలు వేసుకుంటూ క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఎదిగాడు వినాయకన్. జైలర్‌లో పవర్‌ఫుల్ విలన్‌గా కనిపించి కామెడీ కలిపిన విలనిజంతో ప్రేక్షకులని మెప్పించాడు. తాజాగా వినాయకన్ ఓ ఇంటర్వ్యూలో రజినీకాంత్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రతిరోజు సెట్‌లోకి రాగానే వినాయకన్‌ని సూపర్‌స్టార్‌ హగ్‌ చేసుకుని మాట్లాడేవారు. ఒకవేళ తను కనిపించకపోతే వినాయకన్ ఎక్కడని పిలిచేవాళ్ళు. ఆయన ఎదురుగా నటించేందుకు ఇబ్బంది పడుతుంటే నీకు నచ్చినట్టు చెయ్యమని ప్రోత్సహించారు. అందుకే దేవుడిలాంటి రజినీకాంత్‌తో కలిసి నటించడం తన పూర్వజన్మ సుకృతమంటాడు వినాయకన్‌.

జైలర్‌ సిన్మాకు 35లక్షల రెమ్యునరేషన్‌ ఇచ్చారన్న వార్తలపైనా వినాయకన్‌ స్పందించాడు. దానికి మూడురెట్లు తనకిచ్చారని చెప్పుకున్నాడు. ఈసినిమాలో అనేకమంది విలన్స్ ఉన్నా అందరినీ ఆకర్షించింది మాత్రం వినాయకనే. బక్కపలుచ మాస్‌ బాడీ లాంగ్వేజ్ ఉన్న ఈ నటుడుకి అదృష్టం తలుపుతట్టడానికి 28 సంవత్సరాలు పట్టింది. కేరళకు చెందిన వినాయకన్‌ కెరీర్‌ 1995లో మొదలైంది కెరీర్ ప్రారంభంలో డాన్సర్‌గా అవకాశాల కోసం చాల చోట్ల ప్రయత్నాలు చేశాడు. బ్లాక్ మెర్క్యూరీ పేరుతో ఒక డాన్స్ టీంని ఏర్పాటు చేసుకుని చాలచోట్ల ప్రదర్శనలు కూడా ఇచ్చాడు.

జైలర్‌ సిన్మా రిలీజ్‌ అయ్యాక సౌత్‌ ఇండస్ట్రీలో అంతా రజినీకాంత్‌తో సమానంగా ఇప్పుడు వినాయకన్‌ గురించి మాట్లాడుకుంటున్నారు. జైలర్‌ తర్వాత వరుసగా అవకాశాలు అందుకుంటున్నాడు. వినాయకన్‌ పర్సనాలిటీ, మేనరిజానికి తగ్గట్లు కొందరు క్యారెక్టర్లు సృష్టించుకుంటున్నారు. దురదృష్టవంతుడిని ఎవరూ బాగుచేయలేరు. అదృష్టవంతుడిని ఎవరూ ఆపలేరు. వినాయకన్‌ రెండోటైపు.

Share this post

submit to reddit
scroll to top