అవనిపై సగం..ఆకాశంలో సగం.. అన్ని రంగాల్లో మనం అన్న మహిళల ఆకాంక్ష ఇప్పటిదాకా నినాదాల్లోనే. మహిళా సాధికారిత గురించి ప్రసంగాలు గుప్పించినవారెవరూ దానికి చట్టబద్ధత గురించి ఆలోచించలేదు. కానీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఈ దిశగా ఓ అడుగుముందుకేసింది. చట్టసభల్లో మహిళల రిజర్వేషన్ల బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర వేసింది. కేంద్ర కేబినెట్‌లో తీసుకున్న ఈ చారిత్రక మహిళా రిజర్వేషన్ బిల్లు నిర్ణయంపై కేంద్రమంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్ ట్వీట్ చేశారు. తర్వాత కాసేపటికే ఆయన ఆ ట్వీట్‌ని తొలగించినా పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల ఎజెండాలో మహిళా రిజర్వేషన్ బిల్లు కూడా కీలక అశమన్న విషయం తెలిసిపోయింది.
పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల సమయంలో కేబినెట్ ఈ కీలక బిల్లుకు ఆమోదం తెలపడం అంటే అది శాసన ఆమోదం పొందడం ఖాయమని తేలిపోయింది. ఈ బిల్లు పార్లమెంట్‌లో ఆమోదం పొందితే.. లోక్‌సభ, రాష్ట్రాల శాసనసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు అమలవుతాయి. స్వతంత్రభారత చరిత్రలో ఇది కచ్చితంగా చరిత్రలో లిఖించదగ్గ అధ్యాయమే. ఇప్పటిదాకా మహిళలకు తప్పదన్నట్లు ఒకటీ అరా సీట్లు ఇస్తూ వచ్చారు. అన్ని పార్టీలదీ అదే పంథా. మహిళా మంత్రి కూడా లేకుండా కొన్ని రాష్ట్రాల్లో ప్రభుత్వాలు కొలువుదీరాయి. అంతెందుకు మొన్న బీఆర్‌ఎస్ ప్రకటించిన 115 సీట్లలో మహిళలకు ఇచ్చింది ఏడే సీట్లు.
చట్టసభల్లో మహిళా రిజర్వేషన్లు బిల్లు మాట దశాబ్దాలుగా ఓ నినాదంగానే మిగిలిపోయింది. 1996లో దేవెగౌడ సారథ్యంలోని యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వం తొలుత ఈ బిల్లుని లోక్‌సభలో ప్రవేశపెట్టింది. తర్వాత వాజ్‌పేయి, మన్మోహన్ సింగ్ ప్రభుత్వాల హయాంలోనూ ఈ బిల్లు ప్రవేశపెట్టినా ఏ పార్టీకీ చిత్తశుద్ధి లేకపోవటంతో ఆమోదానికి నోచుకోలేదు. 2010లో మహిళా రిజర్వేషన్ బిల్లు పెద్దలసభ ఆమోదం పొందినా.. పార్లమెంట్‌లో మాత్రం పెండింగ్‌లో పడింది. 2014లో లోక్‌సభ రద్దుతో ఆ బిల్లుకి కాలం చెల్లింది. ఎన్ని సంవత్సరాలు గడిచినా ఈ బిల్లు ఇక ఇంతేననుకుంటున్న సమయంలో ఎన్డీఏ ప్రభుత్వం ముందుకొచ్చింది. బిల్లు దుమ్ము దులిపింది. ఉభయసభల్లో ఎన్డీయేకి సంఖ్యాబలం ఉండటం, వచ్చేది ఎన్నికల సీజన్ కావటంతో చట్టసభల్లో ఆమోదం లాంఛనప్రాయమే!