దేశంలోనే తొలి వందేభారత్ స్లీపర్ ట్రైన్ హౌరా-కామాఖ్య మధ్య ఈమధ్యే ప్రారంభమైంది. దాదాపు వెయ్యి కిలోమీటర్ల దూరాన్ని ఈ రైలు 14 గంటల్లోనే చేరుకుంటుంది. కామాఖ్య ఆలయానికి వెళ్లాలనుకున్న వారికి ఈ వందేభారత్ స్లీపర్ రైలు ఓ వరంలా మారింది. అయితే ఈ రైల్లో సర్వ్ చేస్తున్న ఫుడ్‌పైనే ఇప్పుడో కాంట్రవర్సీ మొదలైంది. స్లీపర్ రైల్లో కేవలం శాకాహార వంటకాలే సర్వ్ చేస్తున్నారని.. నాన్ వెజ్ ఆప్షనే లేదని చాలామంది ప్రయాణికులు కంప్లైంట్ చేశారు.
అయితే కామాఖ్య దేవాలయానికి వెళ్తూ నాన్‌వెజ్ ఏంటని బీజేపీ సపోర్టర్స్ వాదిస్తున్నారు. ప్రభుత్వం ఈ ప్రయాణాన్ని ఎంతో పవిత్రంగా ఉండేలా శాకాహారాన్ని మాత్రమే అందిస్తుంటే మాంసాహారంతో పవిత్రతను చెడగొట్టాలా అంటున్నారు. దీనిపై తృణమూల్ కాంగ్రెస్ పార్టీ గట్టి కౌంటర్లే ఇస్తోంది. ప్రజలు ఏం తినాలో చెప్పడానికి మీరెవరని ప్రశ్నిస్తోంది.తృణమూల్ చేస్తున్న ఆరోపణలపై భారత రైల్వే స్పందించింది. రెండు మతపరమైన ప్రదేశాల మధ్య రైలు నడుస్తోంది కాబట్టి నాన్ వెజ్ పెట్టడంలేదని బదులిచ్చింది.
అసలు ట్విస్ట్ ఏంటంటే కామాఖ్య ఆలయంలో అమ్మవారికి నాన్‌వెజ్‌ని నైవేద్యంగా పెడతారు. అలాంటపుడు అక్కడికొచ్చే యాత్రికులు మాంసాహారం తీసుకుంటే మీకొచ్చిన ఇబ్బందేంటని కొందరు విమర్శకులు అడుగుతున్నారు. అటు కాళీ మాతకు కూడా మాంసంతో భోగ్‌ను సమర్పిస్తారు ఇలా అమ్మవారి దగ్గరే మాంసాహార నైవేద్యాలు నడుస్తుంటే.. రైల్లో ప్రయాణికులకు ఇవ్వడంలో తప్పేముందని అంటున్నారు. వందేభారత్ స్లీపర్ ట్రైన్ టికెట్ ధర రూ.2,300 పైనే ఉంది. కానీ రైల్లో ఇస్తున్న ఆహారం సరిగా లేదంటూ చాలామంది ఆన్‌లైన్‌లో IRCTCకి కంప్లైంట్ చేస్తున్నారు.
వెజ్ వద్దనుకుని మానేయడానికి వీల్లేకుండా టికెట్‌లో ఆప్షన్ కూడా లేదు. తిన్నా తినకపోయినా నచ్చినా నచ్చకపోయినా టికెట్‌తోపాటు వెజ్‌మీల్స్‌కి కూడా డబ్బు కట్టాల్సిందే. అయితే ఈ వివాదంలో తృణమూల్ కామెంట్లకు బీజేపీ ఘాటుగానే కౌంటర్స్ ఇస్తోంది. నాన్ వెజ్ ఫుడ్ కావాలంటే వేరే రైలు బుక్ చేసుకుని వెళ్లొచ్చని అంటోంది. హిందూ సంప్రదాయాలంటే టీఎంసీకి ఎంతమాత్రం పట్టింపు లేదంటోంది బీజేపీ. వద్దనుకున్నవారు ఎలాగూ తినరు. తినాలనుకున్నవారు వద్దన్నా ఆగరు. మధ్యలో ఈ సంస్కృతీ సంప్రదాయాల బాధ్యతను రైల్వేశాఖ ఎందుకు నెత్తికెత్తుకుందో అర్ధంకాదు. అందుకే పునరాలోచనలో పడింది. త్వరలోనే ముక్క కూడా దొరుకుతుందంటోంది.





