పశ్చిమాసియా తగలబడుతున్నా, ఎవడు ఎవడిమీద యుద్ధంచేసినా మనకేం ఫర్లేదని మాటలు చెప్పినంత సులువుకాదు సంక్షోభంనుంచి బయటపడటం. అమెరికా-ఇజ్రాయెల్ ఇరాన్‌మీద యుద్ధం ప్రారంభించి మూడువారాలైంది. సుప్రీంలీడర్ సహా కీలక నేతల మరణంతో ఇరాన్ ప్రతీకారంతో రగిలిపోతోంది. సారీ మరో దారి లేదంటూనే అమెరికా రక్షణస్థావరాలకు చోటిచ్చిన గల్ఫ్ దేశాలపై విరుచుకుపడుతోంది.
చమురుక్షేత్రాలపై దాడితో సంక్షోభం మరింత ముదిరింది. ఇరాన్‌కి గుండెకాయలాంటి చమురుక్షేత్రంపై దాడిచేసి ట్రంప్-నెతన్యాహు మరింత రెచ్చగట్టారు. ప్రపంచంలోని అతిపెద్ద సహజ వాయు క్షేత్రాలలో ఒకటైన ఇరాన్‌లోని సౌత్ పార్స్ గ్యాస్ ఫీల్డ్‌పై ఇజ్రాయెల్ దాడికి తెగబడింది. దానికి ప్రతీకారంగా ఖతార్‌లోని రాస్ లాఫాన్ ఎల్‌ఎన్‌జీ గ్యాస్ ఫీల్డ్‌పై ఇరాన్ జరిపిన దాడితో ప్రపంచం ఉక్కిరిబిక్కిరవుతోంది.
తనుచేసిన తప్పేంటో ట్రంప్‌కి తెలిసొచ్చింది. అందుకే ఇకపై ఇరాన్ చమురు క్షేత్రాలపై దాడి చేయం అంటున్నాడు. కానీ చర్యకు ప్రతిచర్యతో జరగాల్సిన నష్టం జరిగిపోయింది. హార్ముజ్ జలసంధి మూసివేయడంతో లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ సరఫరా తీవ్రంగా దెబ్బతింది. దశాబ్దాల తర్వాత ఇదే అత్యంత పెద్ద గ్యాస్ సంక్షోభం కావటంతో ధరలు పెరిగిపోయాయి. పరిశ్రమలు మూతపడుతున్నాయి.
ప్రపంచ ఇంధన సరఫరాలో ఐదవ వంతు హార్ముజ్ జలసంధి ద్వారానే జరుగుతుంది. ఈ జలసంధిని ఇరాన్ మూసేయగానే దాని ప్రభావం భారతదేశం, పాకిస్తాన్, బంగ్లాదేశ్, నేపాల్, శ్రీలంక వంటి దేశాల్లో తక్షణం కనిపించింది. ఎల్పీజీపై ఆధారపడే ఈ దేశాల్లో సరఫరా మందగించింది. ప్రభుత్వాలు గృహ వినియోగానికి ప్రాధాన్యమిస్తూ వ్యాపార వినియోగాన్ని పరిమితం చేస్తున్నాయి. మన దేశం క్రూడ్ ఆయిల్ కోసం నిల్వలు సృష్టించింది కానీ ఎల్పీజీ కోసం ఎప్పుడూ అంతగా ఏర్పాట్లు చేయలేదు. ప్రపంచవ్యాప్తంగా సాధారణంగా 40 నుంచి 60 రోజుల నిల్వలు ఉంటాయి. కానీ భారతదేశంలో కేవలం 20రోజులకు సరిపడా ఎల్పీజీ నిల్వలు మాత్రమే ఉంటాయి.
భారతదేశం తన ఎల్పీజీ అవసరాల్లో 60శాతం దిగుమతులపైనే ఆధారపడింది. అందులో 90శాతం హార్ముజ్ మార్గం ద్వారానే వస్తుంది. ఆ మార్గాన్ని మూసేశాక చాలా తక్కువ ఇంధనం మాత్రమే అందుతోంది. ఇతర దేశాల నుంచి సరఫరాకి సమయం పడుతోంది. పైగా ఖర్చు కూడా ఎక్కువ. అందుకే ప్రభుత్వం దేశీయ ఉత్పత్తిని పెంచాలని రిఫైనరీలకు ఆదేశించింది. గృహ వినియోగం, ఆసుపత్రులు, విద్యాసంస్థలకే ఎల్పీజీ సరఫరాలో ప్రాధాన్యం ఇవ్వటంతో వ్యాపార రంగం తీవ్రంగా దెబ్బతింది.
ఎల్పీజీ ఆధారిత పరిశ్రమలపై యుద్ధ ప్రభావం పెరుగుతోంది. గుజరాత్‌లోని ప్రపంచంలో రెండవ అతిపెద్ద టైల్ తయారీ కేంద్రం మోర్బి దాదాపు నిలిచిపోయింది. 670 ఫ్యాక్టరీల్లో 450 మూతపడ్డాయి. 430 ఫ్యాక్టరీలు కనీసం మూడు వారాలు మూసివేయాలని నిర్ణయించాయి. విపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నాయని కొన్నాళ్లు ఖండించవచ్చేమోగానీ.. భవిష్యత్తు సంక్షోభానికి కేంద్రం వేరే సాకులు వెతుక్కోవాల్సి వచ్చేలా ఉంది.





