సంక్రాంతి వస్తే రంగురంగుల పతంగులు నింగిలో మురిపిస్తాయి. పిల్లలూ పెద్దలన్న తేడా లేదు. అందరికీ గాలిపటాలంటే అదో ఎంజాయ్‌మెంట్. అయితే గాలిపటాలు కూడా పీకలు తెగ్గోస్తున్నాయ్. పండగ సందడిని రక్తసిక్తం చేస్తున్నాయ్. దీంతో అంతా నువ్వే చేశావ్ అంటూ అందరూ ఆ చైనీస్ మాంజానే కొరకొరా చూస్తున్నారు. ఆకాశంలో ఎగరేసే గాలిపటాలకు ఆధారం దారమే. ఆ దారపు ఉండల్నే మాంజాలంటాం. కానీ, ఇవాళారేపూ మనం వాడే పాపులర్ మాంజాలన్నీ మేడిన్ చైనా. అవే ఇప్పుడు ప్రాణాలమీదికి తెస్తున్నాయి.
చైనీస్ మాంజాలు మహా పదునైనవి, చచ్చినా తెగవు. చుట్టుకుంటే మన అవయవాలైనా తెగిపోతాయేగానీ ఆ మాంజామాత్రం ఓ పట్టాన తెగదు. ఎగరేసినవాళ్లు సేఫే. దారిన పోయే దానయ్యల ప్రాణాలే ప్రమాదంలో పడుతున్నాయి. పండక్కి ముందే ప్రమాదాల సంఖ్య పెరగడంతో చైనీస్ మాంజాతో ఖాకీలు అప్రమత్తమయ్యారు. కేసులు పెట్టి దుకాణాల్ని సీజ్ చేస్తున్నారు. నిజానికి చైనీస్ మాంజానే కాదు, సాధారణ మాంజా కూడా డేంజరే. లోకల్ మేడ్ మాంజాల్లో కూడా గొంతును కోసేంత పదును ఉంటోంది.
చైనీస్ మాంజా తయారీ ఫార్ములాను తెలుసుకుని అదే కంపోజిషన్‌తో మనోళ్లు కూడా మాంజాల్ని విచ్చలవిడిగా తయారు చేస్తున్నారు. చైనీస్ మాంజాలకు దీటుగా అమ్మేస్తున్నారు. గాలిపటాల్ని ఎగరెయ్యడానికి వాడే మాంజాలు కామన్‌గా కాటర్ దారంతోనే తయారవుతాయ్. కానీ అవతలి పతంగిని తెగ్గొట్టాలన్నా, మన పతంగి స్ట్రాంగ్‌గా నిలబడాలన్నా మామూలు దారానికుండే పటుత్వం సరిపోదు. అందుకే చైనీస్ మాంజాకి అంత డిమాండ్.
నైలాన్ సింథటిక్ ఫైబర్‌తో తయారు చేయడం, గాజుపొడి- లోహపు చూర్ణం పూత చైనా మాంజాల స్పెషాలిటీ. ఇందుకే అవి అంత పదునుగా, ప్రమాదకరంగా మారుతున్నాయి. చైనా మాంజాలు ప్రమాదకరం అంటున్నామేగానీ వాస్తవానికి చైనా ఫార్ములాతో తయారయ్యే లోకల్ మేడ్ మాంజాలే మార్కెట్లో ఎక్కువగా చెలామణీలో ఉన్నాయి. కేవలం కాటన్ థ్రెడ్‌తో తయారయ్యే మాంజాలే సేఫ్, మిగతా ఏ మెటీరియల్‌తో చేసిన అవి డేంజరస్. టపాసులు కాలుష్యకారకం అంటేనే అంతెత్తున ఎగిరేవారు మాంజాలొద్దంటే ఊరుకుంటారా!





