కేంద్ర దర్యాప్తు సంస్థలు రంగంలోకి దిగాయంటే దాని వెనుక అసలు కథ వేరే ఉంటుంది. కానీ పుట్టలో వేలెడితే కుట్టడానికి దీదీలాంటి గండు చీమ కూడా సిద్ధంగానే ఉంటుంది. పశ్చిమబెంగాల్‌లో అదే జరుగుతోంది. ఐప్యాక్ కార్యాలయంలో ఈడీ సోదాల వ్యవహారంపై తీవ్ర దుమారం రేగింది. ఎప్పుడూ తన గ్యాంగ్‌ని దించే దీదీనే డైరెక్ట్‌గా రంగంలోకి దిగిపోయింది. ఐప్యాక్ కార్యాలయంలో సోదాలను అడ్డుకున్న బెంగాల్ సీఎం మమతాబెనర్జీని అరెస్ట్ చేసేందుకు ఆదేశాలు ఇవ్వాలని ఈడీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
ఈడీ వర్సెస్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ వ్యవహారం ఇప్పట్లో చల్లారే అవకాశం కన్పించడం లేదు. ఐప్యాక్ కార్యాలయంలో తమ సోదాలను మమత అడ్డుకున్నారని ఈడీ రెండోసారి పిటిషన్ దాఖలు చేసింది. మమతా బెనర్జీ, డీజీపీ రాజీవ్ కుమార్, కోల్‌కతా పోలీస్ కమిషనర్ మనోజ్ వర్మపై ఈడీ అధికారులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. జనవరి 8న ఐ-ప్యాక్ డైరెక్టర్ ప్రతీక్ జైన్ కార్యాలయాల్లో జరిగిన ఈడీ దాడులు అడ్డుకున్నారని ఆరోపించారు. సాక్ష్యాలను తారుమారు చేశారని.. డిజిటల్ పరికరాలను తీసుకెళ్లారని పేర్కొన్నారు.
దాదాపు రూ.2,742 కోట్ల కుంభకోణంతో సంబంధం ఉన్న అంశాలపై ఈడీ దర్యాప్తు చేస్తోంది. హవాలా ద్వారా ఐ-ప్యాక్ రూ.20 కోట్లు అందుకుందని ఈడీ ఆరోపిస్తోంది. మమతా బెనర్జీ 200 మంది పోలీసులతో వచ్చి ఈడీ అధికారులను అడ్డుకున్నారని తెలిపింది. ల్యాప్‌ట్యాప్‌లు, మొబైల్ ఫోన్లు, పత్రాలను బలవంతంగా తీసుకెళ్లి 2 గంటల పాటు పోలీస్ స్టేషన్‌లో పెట్టారని ఈడీ ఆరోపించింది. కోల్‌కతా ఐప్యాక్ కార్యాలయంలో ఈడీ సోదాల విషయం తెలియగానే మమతా బెనర్జీ అక్కడికి చేరుకున్నారు. కీలకమైన పత్రాలు, హార్డ్‌డిస్క్‌లు స్వాధీనం చేసుకున్నారు. తాను బీజేపీ కార్యాలయంపై దాడి చేస్తే పరిణామాలు వేరేగా ఉంటాయని వార్నింగ్ ఇచ్చారు.
మనీలాండరింగ్ కేసులో మమత అధికారులను బెదిరించడమే కాకుండా విచారణకు ఆటంకం కలిగించారని ఈడీ ఆరోపిస్తోంది. ఈడీ అధికారులపై పశ్చిమబెంగాల్ ప్రభుత్వం ప్రతీకార చర్యలకు దిగితే రక్షణ కల్పించాలని సుప్రీంకోర్టుకు విజ్ఞప్తి చేసింది. అలాగే డిజిటల్ పరికరాలను ఫోరెన్సిక్‌లో భద్రపరచాలని కోరింది. అయితే ఈడీ సోదాల వెనుక పెద్దకుట్రే ఉందంటోంది దీదీ సారధ్యంలోని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ. తమ డేటాను దొంగిలించేందుకే ఈ కుట్ర చేశారంటోంది. స్టేట్‌లో అడుగుపెడితే తాట తీస్తానన్నట్లు దీదీ వ్యవహారం ఉంటే.. అవసరమైతే ఆమెనైనా అరెస్ట్ చేస్తామంటోంది కేంద్ర దర్యాప్తు సంస్థ.





