ఇండికో సంక్షోభం వెనుక అసలు సీక్రెట్!?

indigo1.jpg

సమస్యలు రావడం, వాటికి పరిష్కారాలు వెతకడం సర్వసాధారణం. కానీ ఓ సమస్యను సృష్టించుకుని తాము అనుకున్న విధంగా పరిష్కారం కోసం ప్రయత్నించడం అసాధారణమైన విషయం. ఇండిగో సంక్షోభం రెండో కోవలోనిదేన్న అనుమానాలొస్తున్నాయి. ఇలాంటి ఓ సమస్యను సృష్టించి తాము అనుకున్న ఫలితాన్ని సాధించాలనే కుట్రతోనే ఇండిగో సంస్థ ఇలా చేస్తోందా అన్న సందేహాలొస్తున్నాయి.

ఇండిగో ఎయిర్‌లైన్స్ సంక్షోభం దేశ విమానయాన రంగాన్ని ఓ కుదుపు కుదిపేస్తోంది. విమాన ప్రయాణికులు ఎప్పుడూ చవిచూడని కష్టాలు చూడవలసి వస్తోంది. పైకి చెబుతున్న కారణాలు వేరే ఉన్నా.. ఇండిగో సంస్థ గుత్తాధిపత్యం కారణంగానే సంక్షోభం తీవ్ర రూపం దాల్చిందనే అనుమానాలొస్తున్నాయి. విమానయాన రంగం ఒకరిద్దరి చేతుల్లో ఉంటే ప్రమాదమనే విషయం జరుగుతున్న పరిణామాలను బట్టి అర్థమవుతోంది.

2005లో ప్రారంభమైన ఇండిగో ఆ మరుసటి ఏడాదిలోనే కార్యకలాపాలను మొదలుపెట్టింది. ప్రస్తుతం ఆ కంపెనీ దగ్గర 434 విమానాలు ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా 128 నగరాలకు ఇండిగో రోజూ 2,300 సర్వీసులను నడుపుతోంది. దేశీయ విమాన సర్వీసుల్లో ఇండిగో వాటా 63 శాతంగా ఉంది. అయితే కేంద్రం కొత్తగా తీసుకొచ్చిన ఎఫ్‌డీటీఎల్‌ నిబంధనలను పాటించడంలో ఇండిగో విఫలమైంది. అదే ప్రస్తుత సంక్షోభానికి పరోక్షంగా కారణమైందన్న వాదన బలపడుతోంది.

అవసరాలకు తగ్గట్లు మరింత మంది పైలట్లు, సిబ్బందిని నియమించుకోవాల్సి ఉన్నా ఇండిగో నిర్లక్ష్య వహించడంతో.. సమస్య జఠిలంగా మారిందనే వాదనలు వినిపిస్తున్నాయి. అహ్మదాబాద్‌ విమాన ప్రమాదం తరువాత కేంద్రం ఎఫ్‌డీటీఎల్‌ నిబంధనలను మరింత కఠినతరం చేసింది. అయితే దేశంలో అత్యధిక మార్కెట్‌ వాటా కలిగిన ఇండిగో ఈ రూల్స్‌కు సిద్ధమైందా లేదా అనే విషయాలను కేంద్రం పెద్దగా పరిగణనలోకి తీసుకున్నట్టు కనిపించడం లేదు. అందుకే ఇలాంటి పరిస్థితిని ముందే ఊహించలేకపోయిందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

ఎఫ్‌డీటీఎల్‌ రూల్స్‌ నుంచి మినహాయింపు కోసమే కృత్రిమంగా ఈ సంక్షోభాన్ని సృష్టించారనే వాదన కూడా వినిపిస్తోంది. విమాన సర్వీసుల రద్దు, జాప్యం లాంటి చర్యలతో ప్రయాణికులను ఇబ్బందిపెట్టి తద్వారా నిబంధనల సడలింపు కోసం ప్రయత్నించారా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఈ అనుమానాలకు బలం చేకూర్చేలా ఇండిగో సిబ్బంది సంతకాలతో కూడిన ఓ లేఖ ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. సంక్షోభాన్ని సృష్టించి, డీజీసీఏ నిబంధనల సడలింపు కోసమే నిర్వహణ వైఫల్యాన్ని ఇండిగో ప్రతినిధులు తెర మీదకు తీసుకొచ్చారని ఆ లేఖలో ఉద్యోగులు ఆరోపించారు.

కారణాలు ఏవైనా.. భవిష్యత్తులో ఇలాంటి సంక్షోభాలు మళ్లీ తలెత్తకుండా ఉండేలా కేంద్రం, డీజీసీఏ మరింత పకడ్బందీగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని జరుగుతున్న పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. ఇండిగో అంతర్గత సమస్యల వల్లే ఈ సంక్షోభం తలెత్తిందని, పైలట్ రోస్టర్, క్రూ సిబ్బంది సమస్యల వల్లే విమాన సర్వీసుల రద్దు అయ్యాయని కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు. ఎఫ్డీటీఎల్ నిబంధనలను రూపొందించే ముందు అందరితో చర్చించామంటున్నారు. ఇండిగో సంక్షోభంతో వారంరోజుల్లోనే 6లక్షల టికెట్ల దాకా రద్దయ్యాయి. అత్యవసర పనులమీద బయలుదేరినవారు నిస్సహాయంగా కన్నీరు పెట్టాల్సి వచ్చింది. అన్నిటికంటే ముఖ్యంగా ఈ సంక్షోభం ప్రపంచదేశాల్లో భారత్‌ ప్రతిష్ట మసకబారేలా చేసింది.

Share this post

submit to reddit
scroll to top