పరకామణి కేసు.. ఓ డెత్‌ మిస్టరీ!

parakamani.jpg

పరకామణిలో డాలర్లు కొట్టేసినోడు నిక్షేపంగా ఉన్నాడు. అతనిపై ఫిర్యాదుచేసిన వ్యక్తే శవమయ్యాడు. టీటీడీ పరకామణి కేసులో నెత్తుటి మరకలు తెరవెనుక చీకటికోణాలపై అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. ఫిర్యాదు చేసిన వ్యక్తి శవమై కనిపించడం ఆ కేసు దర్యాప్తును మలుపు తిప్పేసింది. ఇది హత్యేనని ఓ నిర్ధారణకొచ్చేశారు పోలీసులు. కానీ ఎవరు చేశారు? ఎలా చేశారు? అన్న మిస్టరీని మాత్రం ఛేదించలేకపోతున్నారు.

టీటీడీ మాజీ AVSO సతీష్ కుమార్ హత్య చిక్కుముడిగా మారింది. రాత్రి 11.50కి గుంతకల్‌ రైల్వేస్టేషన్‌కు వచ్చిన సతీష్‌, అర్ధరాత్రి ఒంటిగంటకు రైలెక్కాడు. 1.20కి అసౌకర్యంగా ఉందంటూ భార్యకు మెసేజ్‌ పెట్టాడు. అది తనే పెట్టాడా.. ఎవరైనా పెట్టించారా? అర్ధరాత్రి ఒంటిగంట నుంచి తెల్లవారుజామున 3గంటల మధ్యలో ఏం జరిగింది? రైల్వేట్రాక్‌కి 7 అడుగుల దూరంలో డెడ్‌ బాడీ ఉన్నా.. తలపై తప్ప శరీరంపై మరెక్కడా పెద్దగా గాయాలు లేకపోవడమేంటి? సతీష్‌కుమార్‌ డెత్‌ కేసులో ప్రతీది మిస్టరీనే.

అనంతపురం పోలీసులు 10 బృందాలతో దర్యాప్తు చేస్తున్నారు. సతీష్ మరణానికి కొన్ని గంటల ముందు రైల్లో ఏం జరిగిందనే కోణంలో విచారణ కొనసాగిస్తున్నారు. సతీష్ ఫోన్ డేటాను విజయవాడ ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపి విశ్లేషిస్తున్నారు. గుంతకల్లు, గుత్తి, తాడిపత్రి టవర్ లొకేషన్లను, సీసీ కెమెరాల ఫుటేజ్‌ను అణువణువూ పరిశీలిస్తున్నారు. నవంబరు 13వ తేదీ రాత్రి రాయలసీమ ఎక్స్‌ప్రెస్ ఏసీ కోచ్‌లో ప్రయాణించిన 1140 మంది ప్రయాణికుల లిస్ట్‌ను జల్లెడ పడుతున్నారు. ప్యాసింజర్లలో పాత నేరస్తులు, నేర స్వభావం ఉన్నవారు ఎవరైనా ఉన్నారా అని ఆరా తీస్తున్నారు.

రైలులో సతీష్‌ బ్యాగ్‌ను స్వాధీనం చేసుకున్న పోలీసులు, రాయలసీమ ఎక్స్‌ప్రెస్ A1 కోచ్‌లో బెడ్ రోల్ అటెండర్ రాజీవ్ రతన్, A2 కోచ్ కృష్ణయ్యను విచారించారు. సతీష్ బ్యాగ్‌ సీటు 29 నుంచి సీట్ నెంబర్ 11కు ఎలా వచ్చిందనే దానిపై ఆరా తీస్తున్నారు. మృతదేహం పడున్న తీరుపై వస్తున్న అనుమానాల్ని కూడా పోలీసులు సీరియస్‌గా తీసుకున్నారు. ఇందులో భాగంగా గుంతకల్లు-తాడిపత్రి రూట్‌లో సీన్‌ రీ-కన్‌స్ట్రక్షన్ చేసి డ్రోన్‌ కెమెరాలతో చిత్రీకరించారు. సతీష్‌ కుమార్‌కు సమానమైన బరువున్న బొమ్మలను రన్నింగ్‌ ట్రైన్‌ నుంచి తోసి పరిశీలించారు.

సతీష్ మృతదేహం 7 అడుగుల దూరంలో పడితే… బొమ్మ మాత్రం 2 అడుగుల దూరం కూడా పడకపోవంటతో ఇది హత్యేనని తేల్చారు. మరోవైపు సతీష్ కుమార్ తలపై బలమైన వస్తువుతో కొట్టడంతో పుర్రె పగిలి మెదడు బయటికొచ్చి చనిపోయాడని వైద్యులు చెప్పినట్లు తెలుస్తోంది. మృతుడి కుటుంబీకులు సైతం ఇది హత్యేనని వాదిస్తున్నారు. టీటీడీ పరకామణి చోరీపై ఫిర్యాదు చేసిన వ్యక్తి అనుమానాస్పద మృతి చెందడం ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయంగా కలకలం సృష్టిస్తోంది.

Share this post

submit to reddit
scroll to top