కౌన్ బనేగా నెక్ట్స్ ఉపరాష్ట్రపతి అనే డైలమాకు తనదైన స్టయిల్‌లో ఫుల్‌స్టాప్ పెట్టింది మోడీ టీమ్. అన్ని సమీకరణాల్ని వర్కవుట్ చేసి కూటమి అభ్యర్థిగా సీపీ రాధాకృష్ణన్ పేరును ఖరారు చేసింది. ఇందుకోసం బీజేపీ అమలుచేసిన ప్లాన్ ‘ఆపరేషన్ కొంగునాడు’. తమిళనాడులో పాగా వేయడమే లక్ష్యంగా ఆ రాష్ట్రానికి చెందిన చంద్రపురం పొన్నుస్వామి రాధాకృష్ణన్‌ని బీజేపీ తెరపైకి తెచ్చింది.
తమిళనాడు బీజేపీ అధ్యక్షుడిగా పనిచేసిన రాధాకృష్ణన్ రెండుసార్లు కోయంబత్తూరు నుంచి ఎంపీ అయ్యారు. 93 రోజుల పాటు రథయాత్ర చేసి బీజేపీ హైకమాండ్ దృష్టిలో పడి తర్వాత గవర్నర్ అయ్యారు. మళ్లీ ఇన్నాళ్లకు తమిళనాట రాజకీయ చక్రం తిప్పే బాధ్యతను పరోక్షంగా ఆయనకు కట్టబెట్టింది హైకమాండ్. అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకేతో కలిసి తమిళనాట పాగా వేయాలన్నది కమలంపార్టీ ప్లాన్. మదురైలో మురుగన్ మానాడు, తర్వాత చోళ రాజేంద్రుడి సహస్రాబ్ది ఉత్సవాలకు ప్రధాని రాక.. ఇవన్నీ వ్యూహాత్మకంగా జరుగుతున్నవే.
తమిళనాడులో దేవర కమ్యూనిటీ తర్వాత అత్యంత బలమైన సామాజికవర్గం గౌండర్లు. ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా బీజేపీ ఎంచుకున్న రాధాకృష్ణన్ గౌండర్ కులస్థుడే. కోయంబత్తూర్, కరూర్, సేలం, ఈరోడ్ సహా 8 జిల్లాల్లో 2 కోట్లకు పైగా జనాభా ఉండే కొంగునాడు పరిధిలో గౌండర్ సామాజికవర్గం ఎక్కువ. 60కి పైగా అసెంబ్లీ సీట్లున్న కొంగునాడులో ఇప్పటికే అన్నాడిఎంకే ఆధిపత్యం నడుస్తోంది. ఇదే ప్రాంతానికి చెందిన బలమైన గౌండర్ నేత రాధాకృష్ణన్‌కు ఉపరాష్ట్రపతిగా ప్రమోషన్ ఇచ్చి గట్టి పాచికే విసిరింది బీజేపీ.
అన్నాడీఎంకే అగ్రనేత పళనిస్వామి, బీజేపీ మాజీ ప్రెసిడెంట్ అన్నామలై కూడా గౌండర్ వర్గానికి చెందినవారే. టీవీకే పార్టీ దళపతి విజయ్ కూడా ఇదే ప్రాంతం నుంచి పోటీ చేసే ఆలోచనలో ఉన్నారు. అందుకే రాధాకృష్ణన్‌ను ముందు నిలబెట్టి, ట్రయాంగిల్ ఫైట్‌లో రసవత్తరమైన పోటీనిచ్చి కొంగునాడులో డీఎంకేకి గట్టి షాక్ ఇవ్వాలనేది కమలదళం స్ట్రాటజీ. అయితే బీజేపీ ఎన్ని పిల్లిమొగ్గలేసినా దాని ఆటలు సాగవంటోంది డీఎంకే.





