90 రోజుల్లో 84 మంది. అంటే సగటున సుమారుగా రోజుకొక్కరు. లంచం పుచ్చుకుంటూ తెలంగాణలో రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోయారు. ఏసీబీ కాస్త చొరవ తీసుకుంటేనే ఇంతమంది అవినీతిపరులు అడ్డంగా బుక్కయ్యారు. అంటే బల్లకింద చెయ్యిపెట్టకుండా సర్కారు కార్యాలయాల్లో పనులు జరగడం లేదన్నమాట. ఇప్పుడు దొరుకుతున్నారంటే ఇన్నాళ్లూ చేతివాటం చూపలేదని కాదు. ఎవరెంత బొక్కినా పట్టించుకోలేదు. ఇప్పుడు వారి పాపం పండిందంతే.
సకలజనుల పోరాటంతో తెలంగాణకు దక్కిన సొతంత్రం పదేళ్లు అడవిగాచిన వెన్నెలైంది. దోచుకో దాచుకో అన్నట్లు నడిచింది దొరలపాలన. మనం మాత్రమే బాగుపడితే ఎలాగని సర్కారీ ఉద్యోగులను కూడా ఉదారంగా వదిలేశారు. అడిగేవాడు లేడు.. పట్టుకున్నవాడు లేడు. పదేళ్లు దోచుకున్నోళ్లకి దోచుకున్నంత. చావు నోట్లో తలపెట్టి తెచ్చిన తెలంగాణలో సామాన్యులను అవినీతికి ఎరగా వేయడానికి కారణమేంటో గత పాలకులే చెప్పాలి. ధరణి నుంచి కాళేశ్వరం దాకా.. పల్లెల్లో గొర్రెల స్కీమ్ నుంచి సిటీలో ఈ కార్ రేస్‌దాకా ఎందెందువెదికినా అవినీతి భాగోతమే!
కేసీఆర్ పాలనలో ఏసీబీ ట్రాప్‌లు లేవా అంటే లేకేం అప్పుడప్పుడూ పెద్దపెద్ కేసులే దొరికాయి. కానీ దర్జాగా మళ్లీ సీట్లలోకొచ్చారు. పదోన్నతులు పొందారు. నాలుగు రెస్టులు తీసుకున్నట్లు అలా వెళ్లి ఇలా వచ్చేశారు. కారణం.. ఏసీబీ కేసుల్లో ప్రాసిక్యూషన్‌కి అప్పటి బీఆర్‌ఎస్ ప్రభుత్వం అనుమతించకపోవడమే. పదేళ్ల పాలనలో 800 కేసులు పెండింగ్. ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్రా పాలకుల ఏలుబడిలో కూడా ఇంత దారుణంగా జరగలేదేమో!
ఏసీబీ, సీఐడీ వ్యవస్థల్ని దారుణంగా నిర్వీర్యం చేసిన ఘనత బీఆర్‌ఎస్ ప్రభుత్వానికే దక్కుతుంది… రెడ్ హ్యాండెడ్‌గా దొరికిన అవినీతిపరులను కూడా ఉదారంగా క్షమించేసిన పెద్ద మనసు కల్వకుంట్ల సంస్థానానిది. రేవంత్‌రెడ్డి అద్భుతాలేమీ చేయాల్సిన పన్లేదు. ఆ మలినాలను, పేరుకున్న బురదను తొలగిస్తే చాలు. తెలంగాణ సమాజానికి కొంతైనా మేలు జరుగుతుంది.





