బలిసిన సిన్మాల్ని మనం ఎందుకు బతికించడం?

balakrishna.jpg

స్క్రీన్‌ మీద పడకముందే ఆడియెన్స్‌కి బొమ్మ చూపిస్తున్నారు. చిన్న సినిమాలు ఇలా వచ్చి అలా సైలెంట్‌గా హిట్‌ కొట్టేస్తున్నాయి. ఎటొచ్చీ పెద్ద సినిమాలతో పెద్ద పేచీ. ఇంత పెట్టాం కాబట్టి ఇంత వసూలు చేయాల్సిందేనన్న దాదాగిరీ ఎక్కువైపోయింది. టికెట్‌ ధరల పెంపు వ్యవహారంపై కోర్టు చీవాట్లు పెట్టేదాకా వెళ్లినా సీన్‌ మారడం లేదు. అఖండ-2 మాట ఎలా వున్నా టికెట్‌ రేట్ల పెంపు ప్రతీసారీ కాంట్రవర్సీ అవుతూనే ఉంది.

ప్రీమియర్‌ షోలు..టికెట్ల ధరల పెంపుతో అడ్డగోలుగా దోచుకుంటున్నారన్న ఫిర్యాదుపై సింగిల్‌ బెంచ్‌ విచారణ జరిపింది. టికెట్‌ ధరల పెంపుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ధరలు పెంచుకునేందుకు అనుమతిఇస్తూ ప్రభుత్వం ఇచ్చిన మెమోని సస్పెండ్‌ చేసింది. ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శిపై కోర్టు ధిక్కరణ చర్యలు ఎందుకు తీసుకోకూడదని ప్రశ్నించింది.అసలు టికెట్ల ధరలు పెంచాల్సిన అవసరమేంటని సింగిల్‌ బెంచ్‌ నిలదీసింది. కట్‌ చేస్తే అఖండ2 నిర్మాణ సంస్థ డివిజన్‌ బెంచ్‌ను ఆశ్రయించింది. తమ వాదనలు పరిగణనలోకి తీసుకోకుండా సింగిల్ జడ్జ్ ఉత్తర్వులు ఇచ్చారని అఖండ-2 ప్రొడ్యూసర్లు వాదించారు. అఖండ 2 నిర్మాణ సంస్థకు డివిజన్‌ బెంచ్‌లో ఊరట లభించింది.

టికెట్ల రేట్ల పెంపు వ్యవహారంలో అఖండ-2 మొదటిదీ కాదు చివరిదీ కాదు. టాలీవుడ్‌లో ఇదో వేలంవెర్రి విషయంలా మారిపోయింది. సినిమాల రిలీజ్‌కి ముందు రాయితీల విజ్ఞప్తులు.. ప్రీమియర్‌ షోల విన్నపాలు.. ధరలు పెంచండి మహాప్రభో అంటూ దీనరాగాలు.. ముందు బెట్టుచేసి తర్వాత అనుకూలంగా సర్కార్‌ వారి జీవోలు.. చిత్రపరిశ్రమ నుంచి కృతజ్ఞాతిభివందనాలు. ఇదంతా ఎప్పటి నుంచో నడుస్తోన్న చరిత్రే. కోర్టులే మొట్టికాయలు వేస్తుండటంతో సర్కార్‌ సైడ్‌ నుంచి స్ట్రాంగ్‌ వాయిస్‌ వినిపించింది. మాది ప్రజాప్రభుత్వం.. పేదలపై భారం వేస్తే సహించేది లేదు.. సిన్మా టికెట్ల ధరలు పెంచమని మా దగ్గరికి ఎవరూ రావొద్దంటూ రియాక్టయ్యారు తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి.

స్టార్లకు వేలకోట్ల రెమ్యునరేషన్‌ ఎవ్వరు ఇమ్మన్నారు. వాలీడ్‌ పాయింట్‌ని సాలీడ్‌గా చెప్పారు మంత్రి కోమటిరెడ్డి. శభాష్‌ శభాష్‌ అని ప్రశంసలిద్దామనుకుంటే.. ఈ తరహా డైలాగ్‌ ఇదే మొదటిసారేం కాదు. పెంచేది లేదనడం.. పెంచేయడం.. తర్వాత మళ్లీ ఇక జరగదనడం. ప్రేక్షకులకు కూడా ఇదంతా చూసీచూసీ అలవాటైపోతోంది. అభిమాన హీరో సినిమా వస్తుందంటే ఫ్యాన్స్‌కు పండగే. పస్తులుండైనా కటౌట్‌ పెట్టాల్సిందే. రేటెంతైనా ఫస్ట్‌ షో చూడాల్సిందే.

ఎన్నో సినిమాలు వస్తుంటాయి.పోతుంటాయి. కానీ టికెట్‌ ధరల పెంపు, ప్రీమియర్‌ ఆటల తెగులు తెలుగు సినిమాలకున్నంతగా మరెక్కడా కనిపించదు. విమర్శలకు కళ్లెమేస్తూ తెలంగాణ సర్కార్‌ ఇటీవల ఓ నిర్ణయం తీసుకుంది. టికెట్‌ ధరల పెంపునకు కండిషన్‌ అప్లయ్‌ చేసింది. పెంచిన ధరలో 20 శాతం సినీ కార్మికుల సంక్షేమానికి కేటాయించాలని నిబంధన విధించింది. ప్రేక్షకులు కోరుకున్నా.. కోర్టులు చెప్పినా.. మ్యాటర్‌ ఒక్కటే. ప్రీమియర్‌ షోలు,టికెట్ల రేట్ల పెంపు విషయంలో ఓ స్టాండర్డ్‌ పాలసీ అనేది ఉండాలి.

Share this post

submit to reddit
scroll to top