దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ పతనాన్ని చూవిచూస్తున్నాయి. ఈ ఐదు నెలల కాలంలోనే మదుపరుల సంపద దగ్గర దగ్గర 95లక్షల కోట్లు హరించుకుపోయింది. ట్రంప్ నిర్ణయాలే దీనికి కారణమని మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు. ప్రస్తుతం షాలో మార్కెట్ నడుస్తోందని నిపుణులు చెప్తున్నారు. కొనుగోళ్లు ఎక్కువగా లేనప్పుడు మార్కెట్లు మరింత కుదుపునకు లోనవుతాయి. ప్రస్తుతం దేశీయ మార్కెట్లలో ఇదే జరుగుతోంది. వాల్యూమ్స్ తగ్గి, అమ్మకాలు పెరిగినప్పుడు మార్కెట్ పడిపోవడంతో షాలో మార్కెట్ ఏర్పడుతుంది. ప్రస్తుతం దేశీయ మార్కెట్లలో ఇదే కనిపిస్తోంది. ఇది చాలా రేర్‌గా జరిగే ప్రక్రియ.
కొనుగోళ్లు తక్కువ.. అమ్మకాల జోరుతో ఇండియన్ మార్కెట్లు ఇప్పడు సంక్షోభ పరిస్థితిని ఎదుర్కొంటున్నాయి. 30 ఏళ్ల క్రితం నాటి షాలో మార్కెట్ మళ్లీ ఇప్పుడు ఎదురైంది. అన్ని ట్రేడింగ్ ఫ్లాట్‌ఫామ్స్‌లో ట్రేడింగ్ 30 శాతం నిలిచిపోయింది. 1994-95 మధ్య మార్కెట్లు బాగా పడిపోయాయి. 8 నెలలో కాలంలో 31.3 శాతం క్షీణించాయి. దాన్ని బ్రేక్ చేస్తూ మార్కెట్లు ఇప్పుడు మరింత పతనమయ్యాయి. ఏకంగా 5 నెలల కాలంలోనే 33 శాతం పడ్డాయి. రిటైల్ టర్నోవర్‌లో 41 శాతం క్షీణత కనిపిస్తోంది. ఈ పతనం మరింత కూడా ఉండొచ్చన్నది జీరోదా చీఫ్ కామత్ అంచనా.
కారణాలెన్ని ఉన్నా ట్రంప్ దూకుడు మార్కెట్లను ముంచేస్తోంది. ట్రంప్ టారిఫ్ నిర్ణయాలతో ప్రపంచ మార్కెట్లు డౌన్ ఫాల్ దిశగా వెళ్తున్నాయి. ఆసియా, యూరప్ మార్కెట్లలో క్షీణత కనిపిస్తోంది. ట్రంప్ వచ్చిన తర్వాత రూపాయి మరింత బలహీనపడింది. దీంతో విదేశీ ఇన్వెస్టర్స్ తమ పెట్టుబడులను ఉపసంహరించుకుంటున్నారు. ఫారిన్ ఇన్వెస్టర్స్ వెళ్లిపోవడం, భారత కంపెనీల త్రైమాసిక ఫలితాలు నిరాశపరచడంతో దేశీయ స్టాక్ మార్కెట్లు పతనం అవుతున్నాయి. ప్రస్తుతం మార్కెట్లు 30 ఏళ్లనాటి పరిస్థితులను చవిచూస్తున్నాయని మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు.