తెలంగాణ కాంగ్రెస్‌లో బీసీలు ఈసారి పంతంమీదున్నారు. మాటలతే సరిపెడితే ఈసారి సర్దుకుపోయే ముచ్చటే లేదంటున్నారు. మా వాటా మాకియ్యాల్సిందేనంటూ కాంగ్రెస్ పార్టీలో బీసీ నేతలు యుద్ధం ప్రకటించారు. పార్టీ అ్రగనేత రాహుల్‌గాంధీని కలిసేందుకు ఢిల్లీబాట పట్టారు. అవసరమైతే మేడమ్‌తో మాట్లాడేందుకు రెడీ అయ్యారు. ఎన్నికలు దగ్గర పడుతున్నవేళ టిక్కెట్ల పంపకాల ప్రక్రియ ఊపందుకున్న టైంలో బీసీ నేతల అల్టిమేటం కాంగ్రెస్ అధిష్ఠానానికి సవాలుగానే ఉంది.
తెలంగాణా కాంగ్రెస్‌లో టికెట్లకోసం అప్లికేషన్లు పెట్టుకున్న బీసీ నేతలు ప్రత్యేకంగా గాంధీభవన్‌లో సమావేశమయ్యారు. వీహెచ్, పొన్నాల, అంజన్ కుమార్ యాదవ్, సురేష్ షెట్కార్, పొన్నం ప్రభాకర్ సహా సీనియర్లంతా హాజరయ్యారు. 50 శాతానికి పైగా ఉన్న బీసీలకు అన్యాయం జరుగుతోందని పార్టీలోని ఆ వర్గంనేతలు ఆవేదన చెందుతున్నారు. అగ్రవర్ణాలకే పెద్ద పీటవేస్తున్నారని, సీడబ్ల్యుసీ, స్క్రీనింగ్ కమిటీల్లో కూడా బీసీ నేతలను నిర్లక్ష్యం చేశారని అసంతృప్తి వ్యక్తంచేశారు. ఓబీసీలకు తగిన ప్రాధాన్యం ఇవ్వాలని చింతన్ శిబిర్‌లో చేసిన తీర్మానాల్ని ఎందుకు తుంగలో తొక్కుతారని బీసీ నేతలు నిలదీస్తున్నారు.
జనాభా ప్రాతిపదికన తెలంగాణలో కనీసం 45 నుంచి 48 సీట్లు కేటాయించాల్సిందేనని కాంగ్రెస్ అధిష్టానానికి ఓబీసీ నేతలు అల్టిమేటం ఇస్తున్నారు. సర్వేలను బూచిగా చూపెట్టి బీసీ నేతల్ని బ్లాక్‌మెయిల్ చేస్తున్నారన్నది పీసీసీపై ఆ వర్గం నేతలు కొత్త ఆరోపణ చేస్తున్నారు. తెలంగాణ కాంగ్రెస్‌లో బీసీ నేతలు ఏకం కావటంతో పార్టీ అధిష్ఠానం కూడా దీన్ని సీరియస్‌గానే తీసుకుంది. తొలి విడతలో 50 శాతానికి పైగా అభ్యర్థుల ప్రకటనకు పార్టీ రెడీ అవుతోంది. స్క్రీనింగ్ కమిటీలో బీసీల వాటాపై లోతైన చర్చ జరిగింది. అయితే అక్టోబర్ మొదటి వారంలో విడుదలయ్యే మొదటి జాబితాలో బీసీల పేరు ఉంటుందో లేదో అనుమానమేనన్న సంకేతాలతోనే ఆ వర్గం నేతలంతా గాంధీభవన్‌లో మీటింగ్ పెట్టారన్న చర్చ జరుగుతోంది.
అక్టోబర్ 10న షాద్‌నగర్‌లో బీసీ గర్జనకు కర్నాటక సీఎం సిద్ధరామయ్య ముఖ్యఅతిధిగా పాల్గొంటున్నారు. ఈ వేదిక మీద తెలంగాణ కాంగ్రెస్ బీసీ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తే పార్టీకి అది పెద్ద డ్యామేజే. మరి ఈలోపు బీసీ నేతలను సంతృప్తిపరిచేలా కాంగ్రెస్ అధిష్ఠానం ఏం చేయబోతోందో?