కర్త, కర్మ, క్రియ నేనే, నన్ను నడిపించే ఆత్మ మాత్రం వేరే
తన వెనకున్న ఆర్‌ఎస్‌ఎస్ ధ్వజాన్ని సగర్వంగా చూపిస్తూ ప్రధాని మోదీ చెప్పే మాటలివి. సంఘ్ వందేళ్లు పూర్తిచేసుకున్న సందర్భాన్ని పురస్కరించుకుని మోదీ అన్న మాటలు ప్రభుత్వంలో సంఘ్ పాత్ర ఎంత బలీయమో తేల్చిచెప్పేశాయి. కానీ సంఘ్ నాయకత్వం మాత్రం రాజకీయాలకు దూరం దూరం అంటోంది.
ఆర్‌ఎస్‌ఎస్ కేంద్ర ప్రభుత్వాన్ని వెనకుండి నడుపుతున్న సూపర్ పవరని జనంలో ఉన్న చర్చపై సూటిగా స్పందించారు రాష్ట్రయ స్వయం సేవక్ సంఘ్ చీఫ్ మోహన్‌భగవత్. ఆర్‌ఎస్‌ఎస్‌ని బీజేపీ దృష్టికోణంతో చూడటమే పెద్దతప్పంటున్నారాయన. ఆర్‌ఎస్ఎస్ ఎటువంటి రాజకీయ అజెండా లేని సంస్థనేది భగవత్ మాట. ఆరోగ్యకరమైన సమాజాన్ని, బలమైన దేశాన్ని నిర్మించడానికే సంఘ్ పుట్టిందని మోహన్ భగవత్ మాటలు చర్చనీయాంశంగా మారాయి.
సంఘ్ పేరుతో దేశవ్యాప్తంగా మోరల్ పోలీసింగ్ జరుగుతోందని, ప్రభుత్వోద్యోగుల్ని ప్రభావితం చేస్తున్నారని ఎప్పటినుంచో అభియోగాలున్నాయి. కేరళ, తమిళనాడు, కర్నాటకల్లో ఆర్‌ఎస్‌ఎస్‌ని నిషేధించే ప్రయత్నాలు కూడా జరిగాయి. బీజేపీలో కీలక పదవులన్నీ ఆర్‌ఎస్‌ఎస్ సౌజన్యంతోనే ఖరారవుతాయని, దేశంలో సమాంతర ప్రభుత్వం నడుస్తోందని అపోజిషన్ ఆరోపిస్తూ వస్తోంది.
వందేమాతర గీతంపై ఇటీవల పార్లమెంటులో జరిగిన చర్చ సందర్భంగా కూడా.. ఆర్‌ఎస్‌ఎస్ చెప్పుచేతల్లోనే మోదీ సర్కార్ నడుస్తోందని రాహుల్ ఆరోపించారు. ఈ క్రమంలో తమ సంఘ్, రాజకీయం కలవని పట్టాలన్నట్లు మోహన్ భగవత్ చేసిన ప్రకటన ఆసక్తికరంగా మారింది.





