ప్రాణం పోయలేం.. ఎవరి ప్రాణం తీయలేం!

harish-rana-coma.png

మన బతుకుపై మనకు వైరాగ్యం కలిగినా.. కళ్లముందు జీవచ్ఛవంలా ఉన్న బంధాన్ని చూడలేక అయినవాళ్లు తల్లడిల్లినా చచ్చేదాకా అలా బతకాల్సిందే. మృత్యువు తనంతటతాను వెతుక్కుంటూ వచ్చేదాకా వేచి చూడాల్సిందే. కొన్ని దేశాల్లో కారుణ్య మరణం చట్టబద్దమేమో. కానీ మన చట్టాలు దానికి అనుమతించవు. అందుకే సానుభూతి వ్యక్తంచేస్తూనే మనమేం చేయగలం అని నిస్సహాయత వ్యక్తంచేసింది అత్యున్నత న్యాయస్థానం కూడా.

మేమూ మనుషులమే. ఎవరు బతికి ఉండాలో.. ఎవరు చనిపోవాలో నిర్ణయించేందుకు మనం ఎవరం?

కారుణ్యమరణానికి అనుమతించాలంటూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు ధర్మాసనం స్పందన ఇది. దాదాపు 13 ఏళ్లుగా కోమాలో ఉండి జీవచ్ఛవంలా మారిన 32 ఏళ్ల హరీశ్ రాణా కారుణ్య మరణం అంశంపై సుప్రీంకోర్టు తీర్పు రిజర్వ్‌ చేసింది. కొడుకును అలా చూడలేక కారుణ్య మరణం ప్రసాదించాలంటూ హరీశ్ తల్లిదండ్రులు కన్నీళ్లతో కోర్టును అభ్యర్థించారు.

హరీశ్‌రాణా కోలుకునే అవకాశం లేదని వైద్యులు ధ్రువీకరించారు. అందుకే మానవీయ కోణంలో మర్యాదపూర్వక చావును ప్రసాదించాలని హరీశ్‌ తల్లిదండ్రులు కోర్టును వేడుకున్నారు. ఈ కేసుని విచారించిన సుప్రీంకోర్టు ధర్మాసనం ఆవేదన వ్యక్తంచేసింది. ఇది చాలా సున్నితమైన అంశమని.. కారుణ్య మరణం అనే పదాన్ని తాము ఉపయోగించలేమని అత్యున్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది. ప్రాణాధార వైద్య చికిత్సను ఉపసంహరించే అంశాన్ని మాత్రం పరిశీలిస్తామని న్యాయస్థానం వెల్లడించింది.

ఢిల్లీకి చెందిన 32 ఏళ్ల హరీశ్ రాణా చండీగఢ్‌ యూనివర్సిటీలో ఇంజినీరింగ్ చదువుతున్న సమయంలో 2013 ఆగస్టు 20న ప్రమాదానికి గురయ్యాడు. నాలుగో అంతస్తు బాల్కనీ నుంచి ప్రమాదవశాత్తూ పడిపోవడంతో అతడి తలకు తీవ్ర గాయమైంది. హరీశ్‌ శరీరంలో అప్పట్నించీ చలనం లేకుండా పోయింది. ఎన్నో ఆసుపత్రుల్లో చికిత్స అందించినా, అతను కోమాలోనే ఉండిపోయాడు. ఇంట్లోనే ఉంచుకుని తల్లిదండ్రులు చూసుకుంటున్నారు. ఆర్థికంగా, మానసికంగా కుంగిపోయిన తల్లిదండ్రులు కారుణ్య మరణానికి అనుమతించాలంటూ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.

Share this post

submit to reddit
scroll to top