‘ఫాదర్‌’ల్యాండ్‌ని నొప్పించొద్దనా?

hind-rajab-e1774333170654.jpg

పండితుల ఊచకోతపై కశ్మీర్‌ ఫైల్స్‌ సూపర్‌డూపర్‌ హిట్టవుతుంది. కేరళ స్టోరీకి సీక్వెల్స్‌ వస్తాయి. వాటిని ప్రమోట్‌ చేస్తూ థియేటర్లలోనే ప్రతిజ్ఞలు జరుగుతుంటాయి. శత్రుదేశంలో మన సీక్రెట్‌ ఏజెంట్ల ప్రతాపాన్ని మహోన్నంతగా చూపించే దురంధర్‌ దుమ్మురేపుతుంటుంది. తప్పేంలేదు. చరిత్రలో మరుగునపడ్డ వాస్తవాలను తెరకెక్కించడం తప్పేమీ కాదు. చావ్లాలాంటి దేశభక్తిని ప్రభోదించే సినిమాలు రావాల్సిందే. మన రక్తాన్ని మరిగించాల్సిందే. మనమంతా పూనకమొచ్చినట్లు ఊగిపోవాల్సిందే. మనకు తెలీని చరిత్రను మనకు నచ్చిన దృశ్యమాధ్యమంలో చిత్రీకరిస్తున్న, వాటిని మనసారా ప్రోత్సహిస్తున్నవారికి మనమంతా రుణపడి ఉండాల్సిందే.

సినిమా ఇప్పుడు కేవలం ఓ వినోద సాధనంమాత్రమే కాదు. అత్యంత శక్తిమంతమైన మాధ్యమం, ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లగల ఆయుధం. కానీ అందులో వివక్ష చూపడమే అభ్యంతకరం. అదికూడా మన దేశ ప్రజల మనోభావాలపై పెద్దగా ప్రభావం చూపని ఓ దేశ నేపథ్యంతో తీసిన సినిమాని మనం అనుమతించకపోవడం. గోవా ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో ఎన్నో విదేశీ సిన్మాలు ప్రదర్శిస్తుంటాం. కానీ గాజా బాధిత కుటుంబంపై విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఓ సినిమాని మాత్రం మన వెండితెరపై అంగీకరించలేకపోతున్నాం. కారణం.. ఆ దేశ శత్రువు మనకు మిత్రుడు కావడమే.

ఎవడో తీసిన తలకుమాసిన సినిమా గురించి మనకెందుకనుకుందామా అంటే అదేం అంత తీసిపారేసే సినిమా కాదు. ఆస్కార్‌ నామినేషన్‌ పొందిన చిత్రం. ‘ది వాయిస్ ఆఫ్ హింద్ రాజబ్’ సినిమాను మన దేశంలో విడుదల చేసేందుకు చిత్రమైన నిబంధనలు అడ్డుపడుతున్నాయి. దేశంలో థియేటరికల్‌ విడుదలకు సెన్సార్‌బోర్డ్‌ ఆఫ్‌ ఫిల్మ్‌ సర్టిఫికేషన్‌ నిరాకరించింది. “రాజకీయ సంబంధాల సున్నితత్వం” కారణంగా ఈ నిర్ణయం తీసుకుంది సీబీఎఫ్‌సీ. మిగిలిన ఏ సినిమాలకు అడ్డుపడని ఆ ‘సున్నితత్వం’ గురించే ఇప్పుడు దేశమంతా చర్చ జరుగుతోంది.

‘ది వాయిస్ ఆఫ్ హింద్ రాజబ్’ సినిమాను ఫిబ్రవరిలో సర్టిఫికేషన్ కోసం సెన్సార్‌బోర్డుకు సమర్పించారు. మార్చి 6న విడుదల చేసి ఆస్కార్ పోటీలోకి ముందుగా ప్రేక్షకులకు అందించాలనుకున్నారు. కానీ CBFC ఆమోదం ఇవ్వలేదు. దానికి సీబీఎఫ్‌సీ చెప్పిన కారణమేంటో తెలుసా.. సినిమా విడుదలైతే భారతదేశం–ఇజ్రాయెల్ సంబంధాలపై ప్రభావం పడొచ్చని. అంటే ఓ సినిమా రిలీజ్‌కి అనుమతిస్తే దెబ్బతినేంత బలహీనంగా ఫాదర్‌ ల్యాండ్‌తో మన సంబంధాలున్నాయా. లేదంటే ‘ఫాదర్‌-మదర్‌’ మధ్య చిచ్చుపెట్టేంత బలంగా ఆ సినిమా సందేశం ఉందా అన్నదే అంతుచిక్కని ప్రశ్న.

ఆ సినిమా కాల్పనికం కాదు. యదార్థఘటనల ఆధారంగా నిర్మించిందే. మన ఫైల్స్‌లోనైనా కొన్ని అతిశయోక్తులు, కల్పితాలు ఉన్నాయేమోగానీ గుండెల్ని పిండేసే ఓ ఘటన ఆధారంగా ఆ సిన్మా తెరకెక్కింది. 2024 జనవరి 28న గాజాలో జరిగిన నిజ సంఘటన ఆ సినిమాకు మూలం. బాంబింగ్ హెచ్చరిక తర్వాత కారులో చిక్కుకుపోయే ఓ కుటుంబంలో మిగిలినవారంతా ప్రాణాలు కోల్పోతారు. ఒక చిన్నారి మాత్రమే బతికి ఉంటుంది. ఆ చిన్నారి ఆరు గంటల పాటు సహాయం కోసం చూస్తుంది. చివరికి సహాయం అదే సమయంలో ట్యాంక్ దాడిలో ఆ కారు పేలిపోతుంది.

సినిమాలో ఆ చిన్నారి ఒరిజనల్‌ వాయిస్‌నే వాడారు. ఎలాంటి రాజకీయ వ్యాఖ్యలు లేకుండా, యుద్ధం వల్ల సాధారణ ప్రజలపై పడే మానవీయ బాధను మాత్రమే చూపించే ఆ సినిమా అంతర్జాతీయంగా విడుదలైంది. అమెరికా, యూకే, ఫ్రాన్స్, ఇటలీ వంటి దేశాల్లో విడుదలైంది. ఇజ్రాయెల్‌తో సత్సంబంధాలున్న దేశాల్లోనే నిరభ్యంతరంగా విడుదలైన ఆ సినిమా మనకు మాత్రం అభ్యంతకరంగా కనిపిస్తోంది. దౌత్య సంబంధాలపై ప్రభావం పడుతుందనే సాకును వెతుక్కుంటోంది.

మన ‘సున్నితత్వం’లో పెద్ద కామెడీ ఏంటంటే తన బలగాల దాడిలో జరిగిన ఈ అమానుషంపై తీసిన ఈ సినిమాను ఇజ్రాయెలే తన దేశంలో ప్రదర్శనకు అనుమతించడం!

రివైజింగ్ కమిటీకి దరఖాస్తు చేసినా రిలీజ్‌కి అనుమతి దొరికేలా లేదు ప్రభుత్వ ఒత్తిడి భయంతో ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌ కూడా వెనుకడుగు వేస్తున్నాయి. కాంగ్రెస్‌ ఎంపీనే అయినా ఇటీవలి కాలంలో బీజేపీకి మద్దతు పలుకుతున్న శశిథరూర్‌లాంటి వారు కూడా దీన్ని తప్పుపడుతున్నారు. ప్రజాస్వామ్యంలో సినిమా ప్రదర్శన స్వేచ్ఛను ప్రతిబింబిస్తుంది. విదేశీ దేశాలు నొచ్చుకుంటాయనే భయంతో సినిమాలను నిషేధించడం తగదంటున్నారు. కానీ రోజుల తరబడి ఇంటర్నెట్‌ సేవలను నిషేధించడానికి అలవాటుపడ్డ మన ‘స్వేచ్ఛా వ్యవస్థ’ ఆ సినిమాకు అకారణంగా భయపడుతోంది.

గాజాపై ‘ఫాదర్‌’ ల్యాండ్‌ అమానుషాల్ని భారత్‌ సమర్ధిస్తుందా? అక్కడి పిల్లలు, మహిళల ఊచకోత అమానవీయం కాదని భావిస్తోందా? రేపటి ఉగ్రవాదులను ఉప్పుపాతర వేయడంలో తప్పులేదన్నట్లు ఊగిపోతున్న కొందరు సైకోల వాదనతో ఏకీభవిస్తోందా? ఒకపక్క యుద్ధాలతో వినాశనం తప్పదంటూనే అలాంటి యుద్ధం సామాన్య ప్రజల బతుకుల్లో ఎంతటి విధ్వంసం సృష్టిస్తుందో కళ్లకు కట్టే సినిమాను చూసి ఎందుకు భయపడుతున్నట్లు? ఫాదర్‌ల్యాండ్‌ కళ్లల్లో ఆనందం కోసమా?

Share this post

submit to reddit
scroll to top