దేవుడి సొమ్ముకు దిక్కెవ‌రు?

ayodhya-yogi-trust-e1783344443593.jpg

అయోధ్య రామమందిరంలో విరాళాల దుర్వినియోగం ఆరోపణలు హిందూ స‌మాజాన్ని కుదిపేస్తున్నాయి. జైశ్రీరామ్ అంటూ బీజేపీ చేసిన ప్ర‌చారం నైతిక‌త ఇప్పుడు బోనులో నిల‌బ‌డింది. దేవుడు సొమ్ము దిగ‌మింగిన‌వారిలో ఇప్పటికే ఎనిమిది మంది అరెస్టు కాగా… ట్రస్ట్ ప్రధాన కార్యదర్శితో పాటు పలువురు కీలక సభ్యులు పదవులకు వైదొలిగారు. ఈ పరిణామాల మధ్య రామమందిరాన్ని తిరుమల తిరుపతి దేవస్థానాల తరహాలో నిర్వహించాలని నిర్మాణ కమిటీ మాజీ ఛైర్మన్ నృపేంద్ర మిశ్రా చేసిన సూచన ఇప్పుడు కొత్త చర్చకు దారితీస్తోంది. కోట్లాది మంది భక్తుల విశ్వాసానికి ప్రతీకయిన‌ అయోధ్య రామమందిరంలో విరాళాల దుర్వినియోగం ఆరోపణలు రావడం దేశవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తోంది. కేసు దర్యాప్తు కొనసాగుతుండగా… ట్రస్ట్‌లో కీలక మార్పులు చోటుచేసుకోవడం మరిన్ని ప్రశ్నలను లేవనెత్తుతోంది.

2019లో సుప్రీంకోర్టు తీర్పు అనంతరం కేంద్ర ప్రభుత్వం 2020లో శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్‌ను ఏర్పాటు చేసింది. రామమందిర ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన పలువురు ప్రముఖులు ట్రస్ట్‌లో సభ్యులయ్యారు. దీంతో ఆలయ నిర్వహణ బాధ్యతలు పూర్తిగా ట్రస్ట్ చేతుల్లోకి వెళ్లాయి. ఇప్పుడు వెలుగులోకి వచ్చిన విరాళాల దుర్వినియోగం ఆరోపణలతో… ట్రస్ట్ వ్యవస్థపై దేశవ్యాప్తంగా చర్చ మొదలైంది. అత్యంత ప్రాధాన్యమున్న రామమందిరంలోనే ఇలాంటి ఆరోపణలు వస్తే… దేశవ్యాప్తంగా ప్రైవేట్ ట్రస్టుల ఆధీనంలో ఉన్న వేలాది దేవాలయాల్లో జవాబుదారీతనం ఎలా ఉంటుందన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి.

దక్షిణ భారత రాష్ట్రాల్లో పరిస్థితి భిన్నంగా ఉంటుంది. ఆంధ్రప్రదేశ్‌లో ఎండోమెంట్స్ శాఖ, తిరుమల తిరుపతి దేవస్థానాలు… తమిళనాడులో హెచ్‌ఆర్ అండ్ సీఈ శాఖ… కేరళలో దేవస్వం బోర్డులు… కర్ణాటకలో ముజరాయ్ శాఖల ఆధ్వర్యంలో అనేక దేవాలయాల నిర్వ‌హ‌ణ కొన‌సాగుతోంది. ఈ వ్యవస్థలో ప్రభుత్వ నియమిత అధికారులు పరిపాలనను పర్యవేక్షిస్తారు. ఖాతాలు ఆడిట్ అవుతాయి. అవసరమైతే శాసనసభలో కూడా ప్రభుత్వం సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ట్రస్ట్ వ్యవస్థలో మాత్రం బాధ్యతల విషయంలో జ‌వాబుదారీత‌నం లోపించింద‌ని విమర్శలు ఉన్నాయి. ఆలయ నిర్వహణ పూర్తిగా ట్రస్ట్ చేతుల్లో ఉండటంతో… అవకతవకలు జరిగితే బాధ్యత ఎవరిద‌న్న ప్ర‌శ్న‌కు స‌మాధానం దొర‌క‌డం క‌ష్ట‌మ‌వుతోంది.

అయోధ్య ఘటన ఒక్క ఆలయానికే పరిమితం కాకుండా… దేశవ్యాప్తంగా దేవాలయాల పరిపాలనపై కొత్త చర్చకు తెరతీసింది. ట్రస్ట్ వ్యవస్థ కొనసాగాలా… లేక దక్షిణాది తరహా చట్టబద్ధ పరిపాలనా నమూనాను విస్తృతంగా అమలు చేయాలా అనే అంశంపై రాబోయే రోజుల్లో మరింత చర్చ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయోధ్య రామమందిర విరాళాల వివాదం కేవలం ఒక క్రిమినల్ కేసు మాత్రమే కాదు… దేశంలోని దేవాలయాల నిర్వహణ విధానంపై కూడా కీలక ప్రశ్నలను లేవనెత్తుతోంది. పారదర్శకత, జవాబుదారీతనం, భక్తుల విశ్వాసాన్ని కాపాడే వ్యవస్థ ఏదన్నదే ఇప్పుడు ప్రధాన చర్చగా మారింది.

Share this post

submit to reddit
scroll to top