ఇరాన్ చుట్టూ యుద్ధనౌకల్ని మోహరిస్తాడు. మళ్లీ చర్చించుకుందాం రమ్మంటాడు. పీక మీద కత్తిపెట్టి తన మాటే నెగ్గించుకునేందుకు ట్రంప్ చేస్తున్న ప్రయత్నంతో సమస్య ఇంకాస్త జటిలమవుతోంది. హార్మూజ్ చుట్టూ అగ్రరాజ్యం నడిపిస్తున్న హైడ్రామాతో ప్రపంచం ఇంకా ఉలిక్కిపడుతూనే ఉంది. ఇరాన్‌తో చర్చలకోసం పాకిస్తాన్‌కు మళ్లీ ట్రంప్ ప్రతినిధులను పంపించారు. ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌తో పాటు, అల్లుడు జరెడ్ కుష్నర్, మరో ప్రత్యేక దౌత్య ప్రతినిధి బృందాన్ని పాకిస్తాన్‌కి పంపారు,
చర్చల లక్ష్యం కేవలం ప్రాంతీయ కాల్పుల విరమణ కాదు, ఇరాన్ అణు సామర్థ్యాలను పూర్తిగా నిర్మూలించడమేనంటున్నారు ట్రంప్. ఇరాన్ తన అణు కార్యక్రమాన్ని పూర్తిగా వదులుకోవాలనేదే తమ ప్రధాన కండిషన్ అంటున్నారు. చర్చలు విజయవంతమైతే తాను నేరుగా ఇరాన్ సీనియర్ నాయకులతో కలవడానికి సిద్ధంగా ఉన్నానంటున్నారు. అయితే చర్చలు విఫలమైతే పరిస్థితులు తీవ్రంగా మారొచ్చని హెచ్చరించారు. దాని గురించి ఎక్కువగా చెప్పాలనుకోవడం లేదంటూ పాత పాట అందుకున్నారు.
ఇరాన్‌తో అమెరికా చర్చలు సఫలమవుతాయనే నమ్మకం లేదు. అసలు కుదురుగా ఎదురెదురుగా కూర్చుంటున్నారన్న నమ్మకమే లేదు. ఎందుకంటే ట్రంప్ మాట మీద నిలబడటం లేదు. పదేపదే నాలుక మడతేస్తున్నారు. అమెరికా నమ్మకద్రోహం, హార్మూజ్ జలసంధి దగ్గర సముద్ర దిగ్బంధనంతో రెండో దఫా చర్చలపై తమకు ఎలాంటి నమ్మకం లేదంటోంది ఇరాన్. అయితే ట్రంప్ ఇరు పక్షాలు చర్చలు జరపాల్సిందేనని దబాయిస్తున్నారు. ఏప్రిల్ 11-12 తేదీల్లో జరిగిన 21 గంటల సుదీర్ఘ చర్చలు ఎలాంటి ఫలితం లేకుండా ముగిశాయి.
కాల్పుల విరమణ గడువు ఏప్రిల్ 22తో ముగుస్తుండటంతో ఇస్లామాబాద్ చర్చలని చివరి దౌత్య అవకాశంగా భావిస్తున్నారు. చర్చలు విఫలమైతే, పూర్తి స్థాయి మౌలిక సదుపాయాల యుద్ధానికి దారితీయొచ్చనే అంచనాలున్నాయి. అమెరికా న్యాయమైన, సమంజసమైన ఒప్పందం సిద్ధంగా ఉందని చెబుతుంటే, ఇంత ఒత్తిడిలో చర్చలు జరపలేమంటోంది ఇరాన్.





