ప్రాణం పోయలేనప్పుడు ఓ ప్రాణం తీసే హక్కు మనకెక్కడిదన్న న్యాయస్థానం గుండె బరువెక్కింది. కఠినశిక్షలు విధించినప్పుడు కూడా చలించని న్యాయం ఆ తీర్పు చెప్పేముందు కన్నీటిపర్యంతమైంది. ఈ కారుణ్య మరుణం న్యాయస్థానాన్ని కదిలించింది. న్యాయమూర్తితో కంటతడి పెట్టించింది.
ఆ తీర్పుకి ముందు కోర్టు హాలులో కొన్ని క్షణాలపాటు భావోద్వేగం ఆవరించింది. ఎందుకంటే అనేకానేక కేసుల్లో అది కూడా ఒకటి అనుకునే సందర్భం కాదది. మానవత్వమున్న మనుషుల గుండెల్ని పిండేసే వ్యథ. అందుకే తీర్పు చెప్పే వేళ అప్రయత్నంగా న్యాయమూర్తి స్వరం కూడా కాస్త కంపించింది. ఆయన గుండె లోతుల్లోంచి ఆవేదన పెల్లుబుకింది.
గౌరవప్రదమైన మరణానికి అనుమతించడంలో ఇంత సంఘర్షణ ఉంటుందా? జీవచ్ఛవంలా బతికే కన్నా ప్రశాంతంగా ఈ లోకంనుంచి నిష్క్రమించడమే మంచిదన్న నిర్ణయం తీసుకోవడంలో ఇంత వేదన ఉంటుందా? అది ఆ కుటుంబ ఆవేదనే కాదు.. మనిషినేవాడిని పట్టిపీడించిన మనోవేదన. ఎందుకంటే ఆ కేసులో ఉన్న వ్యక్తి శరీరం ఇంకా పనిచేస్తోంది. కానీ జీవితం మాత్రం ఎప్పుడో ఆగిపోయింది.
మాట్లాడలేడు. కదల్లేడు. కళ్లు కూడా తెరవలేడు. తన బాధనెవరికీ చెప్పుకోలేడు. కేవలం యంత్రాల సాయంతో అతని బొందిలో ప్రాణం ఇంకా మిణుకు మిణుకుమంటోందంతే. 13 ఏళ్లుగా చావలేక, బతకలేక… జీవచ్ఛవంలా మంచంపై పడున్న హరీష్ రాణా అనే యువకుడికి కారుణ్య మరణం ప్రసాదించాలని తీర్పు చెప్పేముందు అత్యున్నత న్యాయస్థానం గొంతుకూడా జీరబోయింది. కానీ ఈ కేసులో అంతకుమించిన అత్యున్నత తీర్పు మరొకటి లేదనే నిర్ణయానికొచ్చి మనసు నిబ్బరం చేసుకుంది.

పగవాడికి కూడా రాకూడదీ కష్టం!
ఎలాగూ లేచి తిరగలేడని, ఎప్పటికీ సాధారణ స్థితికి చేరలేడని తెలిసినా కన్నవారు బిడ్డ ప్రాణాన్ని నిలబెట్టేందుకు ఎంతగానో తల్లడిల్లారు. చికిత్స కోసం ఆస్తులు అమ్ముకున్నారు, అప్పులపాలయ్యారు. అయినా కొడుకు మంచంలో ప్రాణమున్న శవంలా పడుంటే జీవితాంతం చూస్తూ ఉండలేక కారుణ్య మరణానికి అంగీకరించాలని న్యాయస్థానాన్ని ప్రాధేయపడ్డారు. అది సాధ్యంకాదని మొదట్లో అభిప్రాయపడ్డ న్యాయస్థానం గుండె కరిగింది. చివరికి కన్నవారి వాదనతో ఏకీభవించింది.
దేశంలో కారుణ్య మరణంపై ఎప్పట్నించో చర్చ నడుస్తోంది. 2011లో అరుణ శాన్బాగ్ కేసు దేశాన్ని కదిలించింది. ముంబైలో నర్సుగా పనిచేసిన అరుణ తనపై జరిగిన దారుణ దాడి తర్వాత అనేక సంవత్సరాలు కోమాలోనే ఉండిపోయింది. ఆ కేసులో సుప్రీంకోర్టు చారిత్రక నిర్ణయం తీసుకుంది. కొన్ని కఠిన నిబంధనలతో లైఫ్ సపోర్ట్ ఎక్విప్మెంట్ని నిలిపివేయడానికి అనుమతించవచ్చని అభిప్రాయపడింది. అయితే చివరికి కోరుకున్న విముక్తి రాకముందే నిమోనియాతో ఆ బాధితురాలు మరణించింది.
కారుణ్య మరణంపై స్పష్టమైన చట్టాన్ని తీసుకురావాలని అత్యున్నత న్యాయస్థానం ఎన్నోసార్లు కేంద్రానికి సూచించింది. కానీ ఇప్పటికీ దేశంలో పూర్తి స్థాయి చట్టం లేదు. కొన్ని ప్రత్యేక కేసుల్లో కోర్టు మార్గదర్శకాలే ఆధారం అవుతున్నాయి. దేశంలో జీవచ్ఛవాల్లా బతుకుతున్న ఇలాంటి కేసులెన్నో ఉన్నా మరణం ఓ ప్రశ్నగానే ఉంది. ఈ పరిస్థితి ఆత్మీయులను, వైద్యులను సందిగ్ధంలోకి నెడుతోంది. అందుకే ఈరోజుకూ కారుణ్య మరణం దక్కక ఎన్నో కుటుంబాలు ఈ వ్యథను అనుభవిస్తూనే ఉన్నాయి.





