బీపీ వచ్చినట్లు రూపీ వణికిపోతోంది. రూపాయి మారకం విలువ ఆల్ టైమ్ కనిష్ట స్థాయికి చేరడంతో ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. రూపాయి విలువ రోజురోజుకూ క్షీణిస్తోంది. అమెరికన్ డాలర్‌తో పోలిస్తే 77 పైసలు క్షీణించి 91.74 దగ్గర ఆల్‌టైమ్ కనిష్ట స్థాయిని నమోదు చేసింది. చివరకు 68 పైసలు నష్టపోయి 91.65 దగ్గర స్థిరపడింది. ఇది దేశ ఆర్థిక వ్యవస్థకు ముప్పు తెచ్చిపెట్టేలా ఉందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.
రూపాయి పతనంతో ఖర్చులు పెరిగి, రుణాలు మరింత ఖరీదెక్కి, దిగుమతులు భారమై ధరలు పెరిగే ప్రమాదం ఉందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తొలిసారిగా రూపాయి ఈ స్థాయిలో పతనం అవడం అలారం బెల్స్ మోగిస్తోంది. రూపాయి విలువ గత 11 ఏళ్లలో 57 శాతం డౌన్ అయింది. ఈ ఏడాదిలో రూపాయి విలువ రూ. 1.77 మేర పతనమైంది. ఆసియాలోనే అత్యంత బలహీన కరెన్సీల్లో రెండోదిగా రూపాయి నిలిచిందని అంతర్జాతీయ ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.
సుంకాల పేరిట అమెరికా అధ్యక్షుడు ట్రంప్ యూరోపియన్ యూనియన్ దేశాలపై బెదిరింపులకు దిగడం, తమ దేశంలోకి దిగుమతయ్యే భారతీయ వస్తువులు, సర్వీసులపై ట్రంప్ పెద్ద ఎత్తున సుంకాలు విధించడం, ప్రపంచవ్యాప్తంగా భౌగోళిక-రాజకీయ అనిశ్చితులతో ఫారెక్స్ మార్కెట్‌లో రూపాయి విలువ అంతకంతకూ బలహీనపడుతున్నట్టు ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. స్టాక్ మార్కెట్ నుంచి విదేశీ నిధుల నిరంతర నిష్క్రమణ, అలాగే బంగారం, వెండి లాంటి మెటల్స్ దిగుమతిదారుల నుంచి డాలర్‌కు విపరీతమైన డిమాండ్ పెరగడంతో రూపాయి విలువ క్షీణిస్తోంది.
రూపాయి విలువ అంతకంతకు పతనమైతే అది పెను ప్రమాదమే. దేశీయంగా ద్రవ్యోల్బణం కట్టలు తెంచుకునే ప్రమాదం ఉందని చెబుతున్నారు. అలాగే దేశంలోకి దిగుమతయ్యే ప్రతి వస్తువు ధర పెరుగుతూపోతుంది. చెల్లింపులు డాలర్లలో జరగడమే దీనికి కారణమంటున్నారు. ముఖ్యంగా ముడిచమురుతో పాటు మొబైల్స్, కంప్యూటర్ల వంటి దిగుమతి వస్తువుల ధరలు పెరగొచ్చని అంచనా వేస్తున్నారు. ప్రజల కొనుగోలు శక్తి సన్నగిల్లి తయారీ రంగం కుంటుబడుతుందని భయపడుతున్నారు.
మార్కెట్లో అస్థిరతను తగ్గించేందుకు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అప్పుడప్పుడు జోక్యం చేసుకుంటున్నా అంతర్జాతీయ పరిస్థితులు చక్కబడే వరకు రూపాయిపై ఒత్తిడి ఇలాగే కొనసాగే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.





