మహిళలకు చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించేందుకు ప్రవేశపెట్టిన 128వ రాజ్యాంగ సవరణ బిల్లు ద్వారా రాజ్యాంగంలోని 239AA, 330, 332, 334 అధికరణలకు సవరణలు చేస్తున్నారు. ఆర్టికల్ 239AA క్లాజ్ (2), సబ్‌క్లాజ్ (B)కింద కొత్తగా BA, BB, BC క్లాజులను చేర్చారు. ఆర్టికల్ 330 కింద కొత్తగా 330A(1)(2)(3)ని చేర్చారు. ఆర్టికల్ 332 కింద 332A (1)(2)(3)క్లాజ్‌లు చేర్చి ఢిల్లీ అసెంబ్లీతో పాటు దేశవ్యాప్తంగా లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీలు, వాటి పరిధిలోని ఎస్సీ, ఎస్టీ నియోజకవర్గాల్లో మూడో వంతు సీట్లను మహిళలకు కేటాయించారు.
ఆర్టికల్ 334లో కొత్తగా 334ఏ(1) చేర్చటంతో చట్టం అమల్లోకి వచ్చాక చేపట్టే జనగణన అనంతరం నిర్వహించే డీలిమిటేషన్ ప్రక్రియ తర్వాతే రిజర్వేషన్లు అమల్లోకి వచ్చేలా చూశారు. అప్పటిదాకా ఇప్పుడున్న సీట్లన్నీ యథాతథంగా కొనసాగుతాయి. పంచాయతీరాజ్ సంస్థలు, మున్సిపల్ వ్యవస్థల్లో మహిళల భాగస్వామ్యం సంఖ్యాపరంగా సంతృప్తికరంగా ఉంది. అయితే అసెంబ్లీలు, పార్లమెంటులో మహిళల భాగస్వామ్యం ఇప్పటికీ పరిమితమే. లోక్‌సభ, అసెంబ్లీల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించడానికి గతంలో చాలా ప్రయత్నాలు జరిగాయి. 2010లో చివరిసారి అలాంటి ప్రయత్నం జరిగింది. అప్పుడు మహిళా రిజర్వేషన్ బిల్లును రాజ్యసభ ఆమోదముద్రవేసినా లోక్‌సభ ఆమోదించలేదు.
కేంద్ర ప్రభుత్వం లోక్‌సభలో ప్రవేశపెట్టిన బిల్లు ఉభయ సభల ఆమోదం పొంది చట్టరూపం సంతరించుకున్నా ఆ ఫలాలు అందుకునేందుకు మహిళలు 2029 ఎన్నికలదాకా వేచిచూడాల్సిందే. ఎందుకంటే ఈ బిల్లు ద్వారా రాజ్యాంగంలో కొత్తగా చేరుస్తున్న 334A క్లాజ్ ప్రకారం ఈ బిల్లు చట్టరూపం సంతరించుకున్న తర్వాత చేపట్టే మొదటి జనాభా లెక్కల సేకరణ తర్వాత నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుంది. దీనికోసం ప్రత్యేక డీలిమిటేషన్ కమిషన్ ఏర్పాటుచేయాలి. దానికి చాలా కసరత్తు జరగాల్సి ఉంది. 2010లో రాజ్యసభలో ఆమోదం పొందిన బిల్లులో ఈ నిబంధన లేదు. కేంద్ర ప్రభుత్వం జనాభా లెక్కల సేకరణ మొదలుపెట్టి, దాన్ని పూర్తి చేసి నోటిఫై చేయడానికి ఎంతలేదన్నా రెండేళ్లు పట్టొచ్చు.