తెగించినోడికి.. జెలెన్‌స్కీ అదే టైపు!

మొండివాడు రాజుకంటే బలవంతుడు. జెలెన్‌స్కీ అదే టైప్‌. ఎవరినైనా నల్లిని నలిపినట్లు నలిపేస్తామనుకునే రష్యాకే మూడేళ్లుగా కొరకరాని కొయ్యగా మారాడు జెలెన్‌స్కీ. బైడెన్‌ ఉన్నన్నాళ్లూ బేఫికర్‌ అన్నట్లే ఉంది ఉక్రెయిన్. కానీ అమెరికాలో పవర్‌ మారి పుతిన్‌ ఫ్రెండ్‌ ట్రంప్‌ కొత్త ప్రెసిడెంట్‌గా రావటంతో లెక్కమారిపోయింది. ఉక్రెయిన్‌కి ఇక ఏ విధమైన సాయం తమ వైపునుంచి ఉండదంటోంది అమెరికా. పైగా ఉక్రెయిన్‌ ఖనిజ సంపదపై అగ్రరాజ్యం కన్నుపడింది. యూరప్‌లోని 32 క్రిటికల్‌ మినరల్స్‌లో 22 ఉక్రెయిన్‌లోనే ఉన్నాయి. వీటి తవ్వకాల ఒప్పందం కోసం జెలెన్‌స్కీని అమెరికా ఆహ్వానించింది. డీల్‌ స్మూత్‌గా జరిగిపోయుంటే ఏ గొడవా ఉండేది కాదు. కానీ ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌ జోక్యంతో జెలెన్‌స్కీ అహం దెబ్బతింది. నీ వల్ల మూడో ప్రపంచ యుద్ధం వచ్చేలా ఉందంటూ ట్రంప్‌ కూడా నోరుపారేసుకున్నారు. దీంతో మొహంమీద కొట్టినట్లు ఏమీ తేల్చకుండానే అక్కడినుంచి వచ్చేశారు జెలెన్‌స్కీ.

జోబైడెన్‌ అధ్యక్షుడిగా ఉన్నపుడే ఉక్రెయిన్‌-రష్యా వార్‌ మొదలైంది. ఉక్రెయిన్‌కు లక్షలాది డాలర్ల సాయం అందించింది అమెరికా. సైనిక, ఆయుధ సామాగ్రిని సమకూర్చింది. బైడెన్‌ దిగిపోయి ట్రంప్‌ అధ్యక్షపదవిని చేపట్టాక సీన్‌ మారింది. జెలెన్‌స్కీపై ఎన్నికల ప్రచారం నుంచే విరుచుకుపడుతూ వచ్చిన ట్రంప్‌, అధ్యక్షపదవి చేపట్టిన తర్వాత జెలెన్‌స్కీని నియంతంటూ విమర్శలు చేశారు. మళ్లీ తాను ఆ మాట అనలేదని నాలుక మడతేశారు. రష్యాకి సరెండర్‌ కాకుండా మూడేళ్లుగా యుద్ధాన్ని కొనసాగిస్తూ ఉక్రెయిన్‌ ప్రజల దృష్టిలో హీరో అయ్యారు జెలెన్‌స్కీ. ఇప్పుడు వైట్‌హౌస్‌లో అగ్రరాజ్య అధినేతలను ధిక్కరించి జనం దృష్టిలో ఇంకా క్రేజ్‌ తెచ్చుకున్నారు. 2022 ఫిబ్రవరి 24న రష్యా యుద్ధం మొదలుపెట్టిన దగ్గర్నుంచి ఆయన్ని భౌతికంగా అంతమొందించేందుకు జరగని కుట్రలంటూ లేవు.

జెలెన్‌స్కీ అధికారంలోకి వచ్చి ఆరేళ్లవుతున్నా ఉక్రెయిన్‌లో ఎన్నికలు జరగలేదు. డోనాల్డ్ ట్రంప్ మొదటి నుంచి రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధాన్ని వ్యతిరేకించారు. రెండోసారి అమెరికా అధ్యక్ష పగ్గాలు చేపట్టిన తర్వాత ఉక్రెయిన్‌కు సైనిక సహాయాన్ని నిలిపేశారు. రష్యాతో శాంతి చర్చలకు మధ్యవర్తిత్వం వహిస్తామని ప్రకటించారు. కానీ చర్చల్లో ఎలాంటి పురోగతి కనిపించలేదు. శాంతి ప్రయత్నాల్లో భాగంగా ఉక్రెయిన్ భూభాగంపై ఉన్న అరుదైన ఖనిజాల వెలికితీతకు అనుమతించాలని అమెరికా ప్రతిపాదించింది. అయితే తమకు సైనిక సహాయాన్ని నిలపవద్దని జెలెన్‌స్కీ షరతు పెట్టారు. అకస్మాత్తుగా సైనిక సహాయాన్ని తగ్గించడంపై కాస్త పరుషంగా మాట్లాడారు. ఇది ట్రంప్‌కు ఆగ్రహం తెప్పించింది.

జెలెన్‌స్కీ లక్షల మంది ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని, ఇది మూడో ప్రపంచ యుద్ధానికి దారితీసేలా ఉందని ట్రంప్ అసహనం, ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో అమెరికా-ఉక్రెయిన్‌ చర్చలు అర్థంతరంగా ముగిశాయి. ఖనిజాల ఒప్పందంపై సంతకం చేయకుండానే జెలెన్‌స్కీ తమ దేశానికి వెనుదిరిగారు. రష్యా అధ్యక్షుడు పుతిన్‌ను ఉగ్రవాదిగా అభివర్ణిస్తూ.. లక్షల మంది ప్రాణాలు బలిగొన్న నియంతతో రాజీపడాల్సిన అవసరం లేదని జెలెన్‌స్కీ అన్నారు. మరోవైపు ట్రంప్ కూడా జెలెన్‌స్కీ శాంతి కాంక్షించే వ్యక్తి కాదని విమర్శించారు. అమెరికా అధ్యక్ష ఉపాధ్యక్షులు సహనంతో వ్యవహరించారని, తామైతే మెడపెట్టి గెంటేసి ఉండేవాళ్లమన్నట్లు మాట్లాడుతోంది రష్యా. పుతిన్‌కి కావాల్సింది కూడా అమెరికాతో ఉక్రెయిన్‌ సంబంధాలు దెబ్బతినడమే.

Share this post

submit to reddit
scroll to top