దావూద్ ఇబ్రహీం ఓ గతం. తన తర్వాత దేశంలో కొందరు గ్యాంగ్‌స్టర్స్ పుట్టుకొచ్చినా తెరమరుగైపోయారు. కానీ ఇప్పుడు దేశంలో ఏ సెలబ్రిటీ ఇంటిపైకి తూటాలు దూసుకొచ్చినా, బడా పారిశ్రామికవేత్తలకు బెదిరింపులు వచ్చినా కేరాఫ్ అడ్రస్ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగే. చివరికి విదేశాల్లోనూ మాఫియా నెట్‌వర్క్‌ని విస్తరిస్తోంది ఈ నెటోరియస్ గ్యాంగ్. ఆ గ్యాంగ్‌లో షూటర్లు దొరుకుతున్నారు. కొందరు ఎన్‌కౌంటర్ కూడా అవుతున్నారు. కానీ ఇప్పుడా గ్యాంగ్‌తో అంటకాగే ఓ లేడీ డాన్ దొరికింది.
లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ డ్రగ్స్ సిండికేట్‌తో సంబంధాలున్న ఖుష్నుమా అన్సారీ అలియాస్ నేహాను పోలీసులు అరెస్ట్ చేశారు. తను బిష్ణోయ్ గ్యాంగ్‌లో గన్‌మ్యాన్‌గా పేరున్న బాబీ కబూతర్ గర్ల్‌ఫ్రెండ్. గ్యాంగ్ కార్యకలాపాల్లో కీలకంగా వ్యవహరిస్తున్న ఆమె ముద్దుపేరేంటో తెలుసా. మేడమ్ జహర్. తన లవర్ బాబీ కబూతర్ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌కు అక్రమ ఆయుధాల సరఫరాదారు. సిద్ధూ మూసేవాలా మర్డర్, దిశా పటానీ ఇంటిపై కాల్పులు, ఢిల్లీలో నాదిర్ షా హత్య, సీలంపూర్ డబుల్ మర్డర్‌లో వాడిన ఆయుధాలు సమకూర్చింది మేడమ్ జహర్ ప్రియుడు బాబీ కబూతరే.
నేహా అలియాస్ మేడమ్ జహర్ నార్త్ ఈస్ట్ ఢిల్లీలో బ్యూటీ పార్లర్ నడుపుతుండేది. ఆ వ్యాపారాన్ని అడ్డుపెట్టుకుని బిష్ణోయ్ గ్యాంగ్ కు సహకరించినట్లు ఆరోపణలు ఉన్నాయి. బాబీ కబూతర్‌ని పట్టుకున్నాకే అతని ప్రేయసి వ్యవహారం బయటికొచ్చింది. నేహా ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్‌లో బ్యూటీ టిప్స్, గ్లామర్ ఫొటోలున్నా.. ఆమె అసలు బిజినెస్ బిష్ణోయ్ గ్యాంగ్‌కి సహకరించడమే. ఈ అరెస్టులతో లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌తో ఉన్న మరిన్ని లింకులు బయటికొస్తాయని భావిస్తున్నారు.





