పోలిశెట్టి ఫోర్‌.. శర్వానంద్‌ సిక్సర్‌!

imgonline-com-ua-twotoone-votADCieBdDtMl-e1768536987615.jpg

ఎప్పుడొచ్చామన్నది కాదన్నయ్యా.. బుల్లెట్‌ దిగిందా లేదా అని పాపులర్‌ డైలాగ్‌ ఒకటుంది. సంక్రాంతి బరిలో పందెం పుంజుల మధ్య కొక్కొరొక్కో అనకుండానే సైలెంట్‌గా వచ్చి హిట్‌ కొట్టేసింది ఓ చిన్న హీరో సినిమా. అండర్‌డాగ్‌లా వచ్చి హీరో శర్వానంద్‌ పండగమూడ్‌ని తన వైపు తిప్పుకుంటాడని ఎవరూ ఊహించలేదు. లాస్ట్‌లో క్రీజ్‌లోకి దిగాడనుకుంటే నారీ నారీ నడుమ మురారీ సిన్మాతో ఏకంగా ఓ పెద్ద సిక్సరే కొట్టేశాడు శర్వానంద్‌.

భారీ ప్రచారం లేదు. సంక్రాంతికొస్తున్నాం అంటూ చాటింపేయలేదు. భారీ ఎక్స్‌పెక్టేషన్స్‌ ఏమీ లేవన్నట్లే రిలీజ్‌ అయింది శర్వానంద్‌ నారీ నారీ నడుమ మురారి. క్రికెట్‌ భాషలో మాట్లాడుకోవాలంటే చిన్న హీరో నవీన్‌ పోలిశెట్టి అనగనగా ఒక రాజు సిన్మాతో బౌండరీ దాటేలా ఫోర్‌ కొడితే… శర్వానంద్‌ మాత్రం ఆడియెన్స్‌లో పడేలా బిగ్‌ సిక్స్‌ లేపాడు.

సంక్రాంతి పండగని అనధికారిక పేటెంట్‌గా పెట్టుకున్న అనిల్‌ రావిపూడి సినిమా ఒక్కటే పండగ చేసుకుంటుందనుకున్నారు. కానీ అనగనగా ఒక రాజు కూడా సంక్రాంతి బరిలో గట్టిగానే నిలబడితే.. శర్వానంద్‌ నారీ నారీ నడుమ మురారి నెలాఖరుదాకా పండగ చేసుకునేలా ఉంది. ఫీల్‌గుడ్‌ సినిమాలా ఫ్యామిలీ అంతా కూర్చుని చూసేలా సినిమాని తెరకెక్కించిన దర్శకుడు రామ్ అబ్బరాజుకు ఈ క్రెడిట్‌ దక్కుతుంది.

సంక్రాంతి బరిలో ఫైట్‌ చేయకుండానే ఓడిపోయిన పుంజు ఏదన్నా ఉందంటే అంది ప్రభాస్‌ ది రాజా సాబ్‌. అద్భుతం చేస్తాడనుకున్న మారుతి డాళింగ్‌ని ముంచేశాడు. ప్రభాస్‌ని తప్పుపట్టడానికేం లేదు.. మారుతిని నమ్ముకోవడమే కొత్త సంవత్సరంలో బాహుబలి హీరోకి పెద్ద మైనస్సయింది. సంక్రాంతికి వస్తున్నాం సిన్మాతో పోయిన పొంగల్‌లో పండగ చేసుకున్న అనిల్‌ రావిపూడి మన శివశంకర వరప్రసాద్‌ హిట్‌టాక్‌ తెచ్చుకుంది. వసూళ్లలో దూసుకుపోతోంది.

సంక్రాంతి బరిలో రవితేజ పరిస్థితి ఘోరం. భర్త మహాశయులకు విజ్ఞప్తి రేసులోనే లేకుండా పోయింది. పెద్ద స్టార్ల నడుమ చిన్న హీరోలే కాలర్‌ ఎగరేశారీసారి. హిట్‌ పడి ఎన్నేళ్లో అయిన శర్వానంద్‌కి మంచి బ్రేక్‌ దొరికింది. నవీన్ పోలిశెట్టికి బాగా గ్యాప్‌ వచ్చేసింది. ఇద్దరూ కాస్త గ్యాప్‌తో విడివిడిగా పండగ రేసులోకొచ్చారు. బరిలో బరాబర్‌ నిలిచారు. నారీ నారీ నడుమ మురారి సినిమాలో కథనాయకుడి కంటే హైలైట్‌ అయిన క్యారెక్టర్‌ నరేష్‌దే. 60 ఏళ్ల వయస్సులోనూ ఎక్కడా తగ్గలేదు. రియల్‌లైఫ్‌కి దగ్గరగా నరేష్ నారేషన్‌కి తగ్గ డైలాగులతో…ఈ సినిమాలో రియల్ హీరో ఓ రకంగా నరేషే.

సినిమాకు వెళ్లిన వారు కడుపుబ్బా నవ్వుకునేంత కామెడీ ఉంది ఇందులో. ఎక్కడా ట్రాక్‌ తప్పకుండా క్లయిమాక్స్‌ దాకా కామెడీ పండించడం చిన్న టాస్క్ కాదు. అందులో దర్శకుడు రామ్‌ అబ్బరాజుకు వందకు వంద మార్కులేయాల్సిందే. ఇద్దరు మహిళల నడుమ నలిగే మగాడి పాత్రలతో తెలుగులోనే బోలెడు సినిమాలొచ్చినా ఎక్కడా మొనాటనీ లేకుండా జాగ్రత్తపడ్డాడు డైరెక్టర్‌. శర్వానంద్‌ మెచ్యూర్డ్‌ యాక్షన్‌కి.. అందాలకు అభినయం తోడైన కథానాయికలు సంయుక్త మీనన్, సాక్షి వైద్య సరిగ్గా సరిపోయారు.

Share this post

submit to reddit
scroll to top