కామాక్షమ్మ. అరవ కామాక్షమ్మ. నెల్లూరు రూరల్ ఏరియా. పైకేమో స్క్రాప్ షాప్. లోన జరిగే దందా ఏంటో తెలుసా. గంజాయి వ్యాపారం అడ్డొస్తే ఏం చేస్తుందో తెలుసా.. తన జులాయి గ్యాంగ్‌తో మర్డర్ చేయిస్తుంది. కానీ పాపం పండింది. తన గ్యాంగ్‌తో పాటు జైలుకెళ్లింది.
నెల్లూరురూరల్‌లోని బోడిగాడితోట ప్రాంతంలో విజిల్ బ్లోయర్ పెంచలయ్య మర్డర్ కేసులో లేడీ డాన్ అరవ కామాక్షి అరెస్ట్ అయింది. బోడిగాడితోటలోని కామాక్షి ఇంట్లో 2 కిలోల గంజాయి కూడా సీజ్ అయినట్లు పోలీసులు చెబుతున్నారు. నెల్లూరులో డ్రగ్స్‌పై ప్రజల్లో అవగాహన కల్పిస్తూ డ్రగ్స్‌కు, గంజాయికి యువతను దూరంగా ఉండేందుకు ప్రయత్నించాడు పెంచలయ్య. గంజాయి ముఠా ఆగడాలపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. యువతను మత్తుకు బానిసలు చేయడమే వీళ్ల టార్గెట్. నెల్లూరును మరో బిహార్‌లా మార్చేందుకు ట్రై చేస్తున్న ముఠాకు పెంచలయ్య అడ్డుగోడగా మారాడు. దీంతో కామాక్షి పథకం ప్రకారం తన అనుచరులతో అతన్ని హత్య చేయించింది.
ఈ గ్యాంగ్ కోవూరు దగ్గర్లో ఉందని తెలిసి అరెస్టు చేయడానికి ప్రయత్నిస్తే పోలీసులపైనా అటాక్ చేశారు. ఒక కానిస్టేబుల్‌కు గాయాలయ్యాయి. పోలీసుల ఫైరింగ్‌లో ఓ నిందితుడి కాలుకి బుల్లెట్ తగిలింది. పోలీసులను కూడా ఈ గంజాయి గ్యాంగ్ లెక్కచేయట్లేదు. కాలేజ్ కుర్రాళ్లు టార్గెట్‌గా చాన్నాళ్లుగా గంజాయి అమ్ముతోంది కామాక్షమ్మ ముఠా. మైనర్ల ద్వారానే గంజాయి పొట్లాల రవాణా, అమ్మకాలు సాగిస్తోంది. ఒడిశా నుంచి అరవ కామాక్షి భర్త గంజాయి తేస్తుంటాడు. ఇక్కడ చిన్న చిన్న పొట్లాలుగా మార్చి బిజినెస్ చేస్తోంది కామాక్షి.
పెంచలయ్య మర్డర్‌తో అరవ కామాక్షి దందా అంతా బయటికొస్తోంది. RDT కాలనీ, బోడిగాడితోట అడ్డాగా కామాక్షి ముఠా సాగించే అరాచకాలన్నీ ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఆరేళ్లుగా కామాక్షి గ్యాంగ్‌లో అందరిమీదా కేసులున్నాయి. అయినా పోలీసులెందుకో నిఘా పెట్టలేదు. మరోవైపు కామాక్షి ముఠాపై పొలిటికల్ పోస్ట్‌మార్టం జరుగుతోంది. కామాక్షి మీ పార్టీ అంటే కాదు మీ పార్టీనే అంటూ నెల్లూరు లోకల్ లీడర్ల మధ్య లొల్లి మొదలైంది. మొత్తానికి నెల్లూరు లేడీడాన్ గంజాయి దందా స్థానికులనే కాదు, నేతలనూ రొచ్చులోకి లాగింది.





