56 అంగుళాల ఛాతీ ఎప్పుడో పాతమాట. ఇప్పుడది 100 అంగుళాలకు విస్తరించిందనేది బీజేపీ నేతల మాట. మంచిదే ప్రభుత్వాధినేత కండలు పెంచి గండరగండడిగా ఉండాలనే అందరూ కోరుకునేది. దేశంలో రొమ్ము విరుచుకుతిరుగుతున్న ఛాతీ.. పరాయిదేశాల్లో కూడా ఎవరైనా టచ్ చేయడానికి కూడా భయపడేలా ఉండాలి. కానీ ట్రంప్ ముందు సాగిలపడ్డారనే విమర్శ మోదీ మూడో టర్మ్ పాలనకు ఓ మచ్చగా మిగలబోతోంది. పరిపక్వత లేని రాహుల్‌లాంటి నాయకుడు ఏదో అన్నంత మాత్రాన ఆయన ఇమేజ్ డ్యామేజ్ కాదని కాషాయదళం గయ్యిమనొచ్చు. కానీ ప్రపంచమంతా వాళ్ల కళ్లతోనే చూడాలనేం లేదు.
మనిషనే ప్రతీవాడూ తప్పుచేస్తుంటాడు. తెలిసోతెలియకో కొన్ని పొరపాట్లు జరిగిపోతుంటాయి. కొన్ని గ్రహపాటుల్లా వచ్చి తెలీకుండానే మెడకు చుట్టుకుంటాయి. ప్రధాని నరేంద్రమోడీ కూడా వాటికి అతీతమేం కాదు. కానీ ఏదన్నా సమస్యొచ్చినప్పుడో, నిందపడ్డప్పుడో ఆత్మవిమర్శ చేసుకుని పశ్చాత్తాపం ప్రకటించడం విజ్ఞులైనవారు చేసే పని. మైక్రోసాఫ్ట్ కోఫౌండర్ బిల్‌గేట్స్ ఇప్పుడదే పనిచేశారు. ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపుతున్న ఎప్‌స్టీన్ సెక్స్ కుంభకోణంలో వచ్చిన ఎందరో ప్రముఖుల్లో ఆయన కూడా ఉన్నారు. స్కాండల్ సూత్రధారి ఎప్‌స్టీన్‌తో సాన్నిహిత్యంతో ఈ బురద అంటింది.
వాడెవడో గన్నాయ్‌గాడు వాగినంత మాత్రాన నా కేరక్టర్‌ని అనుమానిస్తారా అని బిల్‌గేట్స్ చిందులేయలేదు. ఓ నేరగాడు చేసిన ఆరోపణల్ని పట్టించుకోవాల్సిన పనిలేదని దులుపుకుని పోలేదు. హుందాగా స్పందించారు. ఎప్‌స్టీన్ కోసం కేటాయించిన ప్రతీ క్షణానికి తాను చింతిస్తున్నానని పశ్చాత్తాపం ప్రకటించారు. ఈమెయిల్ నిజం కాదంటూనే ఏదో సందర్భంలో ఆ నేరగాడిని కలిసినందుకు క్షమాపణలు చెప్పారు. రష్యన్ మహిళలతో లైంగిక సంబంధాలు నెరిపారని, సుఖవ్యాధుల బారిన పడ్డారని బిల్‌గేట్స్‌పై ఎప్‌స్టీన్ చేసిన సంచలన ఆరోపణలు ఈమధ్యే బయటపడ్డాయి.
ఎప్‌స్టీన్ సెక్స్ కుంభకోణం దర్యాప్తుకు సంబంధించి 30లక్షల పేజీలను అమెరికా లా డిపార్ట్‌మెంట్ ఇటీవల విడుదలచేసింది. ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాధినేతలు, పెద్దపెద్ద పారిశ్రామికవేత్తల పేర్లు వీటిలో బయటపడ్డాయి. ఆరోపణలు చేసిన ఎప్‌స్టీన్ ఈభూమ్మీద లేడు. స్కాండల్‌లో దొరికి జైలుపాలైనప్పుడే సూసైడ్ చేసుకున్నాడు. కానీ అతగాడి నిర్వాకాలపై జరిపిన దర్యాప్తుతో ప్రపంచమంతా వణుకుతోంది. 1,80,000 ఫోటోలు, 2,000 వీడియోలలో అనేక మంది ప్రముఖుల ప్రస్తావన వచ్చింది. అందులో అమెరికా అధ్యక్షుడు ట్రంప్, మాజీ ప్రెసిడెంట్ బిల్ క్లింటన్‌తో పాటు బిల్ గేట్స్, ఎలాన్ మస్క్, బ్రిటన్ మాజీ యువరాజు ఆండ్రూల పేర్లు కూడా ఉన్నాయి. కానీ అనూహ్యంగా మన ప్రధాని మోడీ ప్రస్తావన కూడా రావడాన్నే ఎవరూ జీర్ణించుకోలేకపోతున్నారు.
నరేంద్ర మోడీ ఇజ్రాయెల్ అధికారిక పర్యటన గురించి ఎప్‌స్టీన్ ఫైల్స్‌లో ప్రస్తావించారనే విషయం తీవ్ర కలకలం రేపింది. 1992లో భారత్ – ఇజ్రాయెల్ మధ్య పూర్తి దౌత్య సంబంధం ఏర్పడిన తర్వాత 2017 జూలైలో ప్రధాని మోడీ ఇజ్రాయెల్‌లో పర్యటించారు. ఆ దేశంలో భారత ప్రధానమంత్రి అడుగు పెట్టడం ఇదే తొలిసారి. ఎప్‌స్టీన్‌ని ఎందుకు కలిశారు.. ఏం చేశారనేదానిపై ఎవరివాదనలు ఎలా ఉన్నా.. ఈ అనైతిక స్కామ్‌లో ప్రధాని పేరు చర్చకు రావడంతో భారత్‌కు తలకొట్టేసినట్లయింది. ఎప్‌స్టీన్ ఫైల్స్ వాదనలు పూర్తిగా నిరాధారమైనవని విదేశాంగశాఖ ఖండించింది. అందులో ప్రధాని పర్యటన తప్ప మిగిలిన విషయాలన్నీ పూర్తిగా ఖండించదగినవని మన విదేశాంగశాఖ ప్రకటన విడుదలచేసింది.
రాజకీయంగా మోడీతో తలపడలేకపోతున్న ప్రతిపక్షాలచేతికి ఎప్‌స్టీన్ ఫైల్స్‌తో బ్రహ్మాస్త్రం చిక్కింది. తన పేరు బయటికి రావటంతో పరువు పోతుందని భయపడ్డ మోడీ.. ట్రంప్‌తో రాజీపడ్డారని విపక్షనేత రాహుల్‌గాంధీ ఆరోపించారు. ప్రధాని భయపడుతున్నారు కాబట్టే కొన్ని నెలలుగా పెండింగ్‌లో ఉన్న అమెరికా- భారత్ వాణిజ్య ఒప్పందంపైౖ ఆగమేఘాల మీద సంతకం చేశారని, భారతీయుల కష్టార్జితాన్ని అగ్రరాజ్యానికి అమ్మేశారని రాహుల్ విమర్శించారు. మమతాబెనర్జీవంటి విపక్షనేతలు కూడా అదే అంటున్నారు. ఎవరో ఏదో అన్నారని కాదుగానీ.. ఇంత తీవ్ర విమర్శలు వచ్చినప్పుడు ప్రధాని స్వయంగా స్పందించి వివరణ ఇస్తేనే ఈదేశ గౌరవాన్ని కాపాడినట్లవుతుంది.





