శత్రువులెక్కడో ఉండరు. బంధుమిత్రుల రూపంలో మన పక్కనే ఉంటారనే సిన్మా డైలాగ్ కాంగ్రెస్ విషయంలో హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్. బయటి వారెవరూ బురదచల్లే పనిలేదు. నెత్తిన కుమ్మరించుకోడానికి ఎప్పుడూ బురద బకెట్లతో తిరుగుతుంటారు సొంతపార్టీ నేతలు. బిహార్ దర్భంగా మీటింగ్‌లో ఓ తలకుమాసినోడెవడో మోడీని, ఆయన తల్లిని వ్యక్తిగతంగా దూషించారు. ఆ నీచ ప్రేలాపనలతో రాహుల్‌గాంధీకి ఏ సంబంధం లేదు. కానీ ఆయన క్షమాపణలు చెప్పాలంటూ బీజేపీ నిరసనలకు దిగింది. రాహుల్‌గాంధే ప్రధాని తల్లిని దూషించారన్నట్లు ప్రచారం జరిగిపోతోంది. ఈ దుమారం సద్దుమణగకముందే కేరళ కాంగ్రెస్ నేతల వ్యాఖ్యలు కాంగ్రెస్‌కి మరో తల్నొప్పి తెచ్చిపెట్టాయి.
బీడీ , బిహార్ Bతోనే మొదలవుతాయని కేరళ కాంగ్రెస్ నేతలు చేసిన ట్వీట్‌పై వివాదం రాజుకుంది. బీడీపై జీఎస్టీని 18 శాతానికి తగ్గించడం వెనుక బిహార్ ఎన్నికలే కారణమని విమర్శించడమే కాంగ్రెస్ నేతల ఉద్దేశం. కానీ వారి కవి హృదయం మరోరకంగా టర్న్ అయింది. బిహార్ ప్రజలను అవమానించడమే కాంగ్రెస్ నేతలు పనిగా పెట్టుకున్నారని బీజేపీ ఆరోపనలు గుప్పిస్తోంది. కేరళ కాంగ్రెస్ నేతల ట్వీట్‌పై రాహుల్‌గాంధీ సమాధానం చెప్పాలని ఎన్డీఏ కూటమి డిమాండ్ చేస్తోంది.
బిహార్ అసెంబ్లీ ఎన్నికల వేళ బీడీ రాజకీయం ఊపందుకుంది. పొగాకు ఉత్పత్తులపై జీఎస్టీపై కేరళ కాంగ్రెస్ చేసిన వివాదాస్పద పోస్ట్‌పై బీజేపీ నేతలు విరుచుకుపడుతున్నారు. బీడీ , బిహార్ B అక్షరంతోనే మొదలవుతాయని, వాటిని ఇకపై పాపంగా పరిగణించాల్సిన అవసరం లేదని కేరళ కాంగ్రెస్ యూనిట్ పెట్టిన పోస్టు తీవ్ర దుమారం రేపింది. జీఎస్‌టీ శ్లాబుల్లో భాగంగా కేంద్రం సిగరెట్, పొగాకుపై ఉన్న 28 శాతం పన్ను 40 శాతానికి పెంచింది. బీడీలపై మాత్రం జీఎస్టీని 28 నుంచి 18 శాతానికి తగ్గించింది. దీనిపై కేరళ కాంగ్రెస్ యూనిట్ పోస్ట్ పెట్టింది.
కేరళ కాంగ్రెస్ నేతల తీరుపై ఎన్డీఏ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ నిజస్వరూపం బిహార్ ప్రజలకు అర్ధమయ్యిందన్నారు. కాంగ్రెస్ మరోసారి అన్ని హద్దులు అతిక్రమించిందని, ఈ వ్యాఖ్యలను ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ ఆమోదిస్తారా అని బీజేపీ నేతలు ప్రశ్నించారు. అయితే తేజస్వి యాదవ్ కేరళ కాంగ్రెస్ నేతల ట్వీట్‌ని తప్పుపట్టారు. వెంటనే క్షమాపణలు చెప్పాలని కోరారు. బీడీ-బిహార్ పోస్టుపై వివాదం రేగడంతో కేరళ కాంగ్రెస్ ఆ పోస్టును తొలగించింది. మోడీ ఎన్నికల జిమ్మిక్ అయిన జీఎస్టీ రేట్లను ఉద్దేశిస్తూ చేసిన పోస్టు తమ దృష్టికి వచ్చిందని, ఇది మిమ్మల్ని బాధపెడితే క్షమించండని కాంగ్రెస్ తమ అధికారిక ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసింది.





