అతని జీవితం విశృంఖలం. ఆ అరుదైన ప్రపంచంలోకి ప్రపంచాధినేతలను లాగాడు. ప్రముఖులను తనదైన లోకంలో విహరింపజేశాడు. తనే ఈ బతుకు వద్దనుకున్నాడో, అతను బతికుంటే తమకు బతుకు లేదని ఎవరన్నా అనుకున్నారోగానీ జైలుగోడల మధ్యే చచ్చాడు. కానీ చచ్చి కూడా వేలమందిని సాధిస్తున్నాడు. అగ్రరాజ్య అధిపతులతో పాటు కుబేరులు, వ్యాపార సంపన్నులు ఎందరో మీద పడ్డ బురదని కడుక్కోలేక చస్తున్నారు.
కేవలం ఎంజాయ్‌చేయడం, తన మరో ప్రపంచంలోకి పెద్దల్ని రప్పించి మరింత ఎదగడం ఒక్కటే కాదు. అంతకుమించిన లక్ష్యమేదో ఉంది మానసిక రోగి జెఫ్రీ ఎప్‌స్టీన్‌కి. ఫెడరల్ సెక్స్-ట్రాఫికింగ్ ఆరోపణలు పైకి కనిపించేవే. కానీ ఎప్‌స్టీన్‌కి క్రూరమైన ఆలోచనలు ఉండేవి. అమెరికా అధ్యక్షుడికి అర్ధరాత్రయినా ఫోన్‌చేసేంత సాన్నిహిత్యం. ప్రపంచవ్యాప్తంగా దేశాధినేతలు, సంపన్నులు, వ్యాపారప్రముఖులతో అతనికి అనుబంధం. ఆ ఎంజాయ్‌మెంట్ సరిపోలేదు. సొంత డీఎన్‌ఏతో ఓ సరికొత్త మానవజాతినే సృష్టించాలనుకున్నాడు. అదే సూపర్ రేస్ జనరేషన్.
న్యూమెక్సికోలోని తన విస్తారమైన రాంచ్‌లో అనేక సంవత్సరాల పాటు మహిళలను గర్భవతులను చేసి తన సంతానాన్ని పెంచాలని ఎప్‌స్టీన్ తాపత్రయపడ్డారు. బేబీ రాంచ్ ఆలోచనను సన్నిహితులతోనే కాదు శాస్త్రవేత్తలతో కూడా ఈ మానసిక రోగి పంచుకున్నాడు. తన స్పెర్మ్‌తో మహిళలకు కృత్రిమ గర్భధారణ చేసి వారు తన పిల్లలకు జన్మనిచ్చే కేంద్రంగా ఆ రాంచ్‌ని ఉపయోగించుకోవాలనుకున్నాడు.
ఎప్‌స్టీన్ ఆలోచనలను ట్రాన్స్‌హ్యూమనిజం ఆసక్తినుంచి వచ్చినట్లు చెబుతున్నారు. ట్రాన్స్‌హ్యూమనిజం అనేది జన్యుశాస్త్రం. కృత్రిమ మేథస్సు వంటి సాంకేతికతల ద్వారా మానవ సామర్థ్యాలను మెరుగుపరచాలని భావించే ఒక ఉద్యమం. అయితే ఇలాంటి ఆలోచనలతోనే యూజెనిక్స్ భావజాలాన్ని నాజీలు దుర్వినియోగం చేశారు.
న్యూయార్క్ టైమ్స్ ప్రకారం ఎప్‌స్టీన్ ఇదే వ్యూహాలతో శాస్త్రీయ రంగంలోని ప్రముఖుల మధ్య ఎంట్రీఇచ్చాడు. నోబెల్ ప్రైజ్ గ్రహీత భౌతిక శాస్త్రవేత్త ముర్రే గెల్‌మాన్, భౌతిక శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్, జీవశాస్త్రవేత్త స్టీఫెన్ జే గోల్డ్, జన్యుశాస్త్రవేత్త జార్జ్ ఎం.చర్చ్ వంటి ప్రముఖులు ఎప్‌స్టీన్ ఫ్రెండ్‌షిప్ లిస్టులో ఉన్నారు.
శాస్త్రవేత్తల సమావేశాలకు సహకరించడం, వారి పరిశోధనలకు డబ్బు ఖర్చుపెట్టటం, హైక్లాస్ విందులు వినోదాలతో ఎప్‌స్టీన్ వారికి దగ్గరయ్యాడు. అతని ఆహ్వానంతో కొన్ని సమావేశాలు యునైటెడ్ స్టేట్స్ వర్జిన్ ఐలాండ్స్‌లో జరిగాయి. అతిథులను విమానాల్లో ప్రైవేట్ ఐలాండ్‌కు తీసుకెళ్లి ఆతిథ్యం ఇచ్చేవాడు. స్టీఫెన్ హాకింగ్ సహా పలువురు శాస్త్రవేత్తలు ఎప్‌స్టీన్ ఏర్పాటు చేసిన సబ్‌మెరైన్‌లో కూడా ప్రయాణం చేశారు.
2000 ప్రారంభం నుంచి న్యూమెక్సికోలోని సాంటా ఫే సమీపంలోని 33వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న జోరో రాంచ్‌ను మహిళలకు గర్భధారణ చేసే కేంద్రంగా ఉపయోగించాలని ఎప్‌స్టీన్ శాస్త్రవేత్తలకు, వ్యాపారవేత్తలకు చెప్పేవాడు. 2001 నుంచి 2006 మధ్య కాలంలో జరిగిన విందులు, సమావేశాల్లో ఎప్‌స్టీన్ తన ఆలోచనను అందరితో పంచుకున్నాడు. తన రాంచ్‌లో ఏకకాలంలో 20 మంది మహిళలు గర్భవతులుగా ఉండాలని ఎప్‌స్టీన్ కోరుకున్నాడు. నోబెల్ బహుమతి గ్రహీతల నుంచి వీర్యాన్ని సేకరించి మానవ జాతిని బలోపేతం చేయాలన్న ఉద్దేశంతో పనిచేసిన ‘రిపాజిటరీ ఫర్ జర్మినల్ ఛాయిస్’ అనే మూతబడ్డ స్పెర్మ్ బ్యాంక్ నుంచి ఎప్‌స్టీన్ ప్రేరణ పొందినట్లు చెబుతారు.
మనిషన్నాక చావు తప్పుదు. కానీ ఎప్‌స్టీన్ ఆలోచనలు విపరీతం. చావు అనివార్యమైనా తన శరీరం కలకాలం ఉపయోగపడాలనుకునేవాడు. తన శరీరాన్ని భవిష్యత్తు కోసం కాపాడుకోవాలన్న ఆలోచనల గురించి బహిరంగంగానే మాట్లాడేవాడు. మరణానంతరం శరీరాన్ని గడ్డకట్టించి భవిష్యత్తులో పునరుద్ధరించాలనే క్రయోనిక్స్ గురించి ఎప్‌స్టీన్ చర్చించాడు. శరీరంలోని కీలక భాగాలు భద్రపరిచే విషయంలో తనకున్న ఆసక్తిని బయటపెట్టుకున్నాడు.
ఎప్‌స్టీన్ న్యూయార్క్ మాన్షన్‌లో తీసిన ఒక వీడియోలో టేబుల్‌పై డీఎన్‌ఏ పితృత్వ పరీక్ష పత్రాలు కనిపించాయి. కెప్‌స్టీన్ పిల్లలను పెంచే రహస్య కేంద్రం నడిపాడని, బ్రీడింగ్ ప్రోగ్రాం చేశాడని ఆరోపణలొచ్చాయి. కానీ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ఆధారాలను ఇంకా నిర్ధారించలేదు. కానీ ఓ వ్యక్తి అసాధారణ ఆలోచనల పర్యవసానాలు ఎలా ఉంటాయో చెప్పేందుకు ఎప్‌స్టీన్ జీవితం ఓ ఉదాహరణ.


న్యూయార్క్ టైమ్స్ ప్రకారం ఎప్‌స్టీన్ ఇదే వ్యూహాలతో శాస్త్రీయ రంగంలోని ప్రముఖుల మధ్య ఎంట్రీఇచ్చాడు. నోబెల్ ప్రైజ్ గ్రహీత భౌతిక శాస్త్రవేత్త ముర్రే గెల్‌మాన్, భౌతిక శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్, జీవశాస్త్రవేత్త స్టీఫెన్ జే గోల్డ్, జన్యుశాస్త్రవేత్త జార్జ్ ఎం.చర్చ్ వంటి ప్రముఖులు ఎప్‌స్టీన్ ఫ్రెండ్‌షిప్ లిస్టులో ఉన్నారు.



