జెఫ్రీ ఎప్‌స్టీన్ అరాచకాలకు ఆమె ప్రత్యక్షసాక్షి. కేవలం సాక్షి కాదు, తన పాపాల్లో భాగస్వామి. అమ్మాయిలను ట్రాప్‌చేయడం, అతిథులకోసం వారిని సిద్ధంచేయడం, ఎదురుతిరిగితే తనదైన ట్రీట్మెంట్ ఇవ్వడం.. ఇవన్నీ చేసింది ఆమెనే. పేరు ఘిస్లేన్ మ్యాక్స్‌వెల్. అనుమానాస్పద రీతిలో జైలుగోడల మధ్య ఎప్‌స్టీన్ జీవితం ముగిసిపోయింది. కానీ అతని సన్నిహితురాలు మ్యాక్స్‌వెల్ ఈ భూమ్మీద బతికే ఉంది. జైలు జీవితం గడుపుతోంది.
అమెరికా హౌస్ కమిటీ ముందుకు వీడియో విచారణకు హాజరైంది ఎప్‌స్టీన్ సన్నిహితురాలు ఘిస్లేన్ మ్యాక్స్‌వెల్. అయితే అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వకుండా తన ఫిఫ్త్ అమెండ్‌మెంట్ హక్కును వినియోగించుకుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నుంచి క్షమాభిక్ష లభిస్తే మాట్లాడేందుకు తన క్లయింట్ సిద్ధంగా ఉందని మ్యాక్స్‌వెల్ లాయర్ చెబుతున్నారు. ప్రపంచాన్ని ఎప్‌స్టీన్ ఫైల్స్ కుదిపేస్తున్న సమయంలో తాను ఎలాగోలా బయటపడాలనుకుంటోంది ఆ మాయలేడీ.
అమెరికా చట్టాల ప్రకారం దోషులకు క్షమాభిక్ష ప్రసాదించే ప్రత్యేక అధికారం అధ్యక్షుడికి ఉంటుంది. ఇందులో పార్డన్ అంటే పూర్తిస్థాయి క్షమాభిక్ష. ఈ నిర్ణయంతో చట్టపరమైన శిక్షలు తొలగిపోయి పౌర హక్కులు తిరిగి వస్తాయి. కమ్యూటేషన్ అంటే శిక్షా కాలాన్ని తగ్గించడం. రిప్రీవ్ తరహా క్షమాభిక్ష అయితే శిక్ష అమలు తాత్కాలికంగా వాయిదా పడుతుంది.
అయితే అలాంటి ఆలోచనేదీ లేదని ఈమధ్య ట్రంప్ ఓ స్టేట్మెంట్ ఇచ్చారు. కానీ ఆయన ఆలోచన స్థిరంగా ఉంటుందన్న నమ్మకం ఎవరికీ లేదు. 2025 జూలై-ఆగస్టులో అమెరికా డిప్యూటీ అటార్నీ జనరల్ టాడ్ బ్లాంచ్ మ్యాక్స్‌వెల్‌ను ఇంటర్వ్యూ చేశారు. ఆ ఇంటర్వ్యూ ఆడియో, ట్రాన్స్‌క్రిప్ట్‌ను డిపార్ట్‌మెంట్ ఆఫ్ జస్టిస్ విడుదల చేసింది. అందులో మ్యాక్స్‌వెల్ ట్రంప్‌ని పొగిడింది. సౌమ్యుడు, గౌరవప్రదమైన వ్యక్తి అంటూ ట్రంప్‌ని ఆకాశానికి ఎత్తేసింది. ఎప్‌స్టీన్ ‘ఆత్మహత్య’పై తను కూడా అనుమానం వ్యక్తంచేసింది.
ఘిస్లేన్ మ్యాక్స్‌వెల్ ప్రస్తుతం టెక్సాస్‌లోని ఫెడరల్ ప్రిజన్ క్యాంప్ బ్రయాన్‌లో 20 ఏళ్ల జైలు శిక్ష అనుభవిస్తోంది. 2025 ఆగస్టు 1న బ్యూరో ఆఫ్ ప్రిజన్స్ హఠాత్తుగా ఆమెను తక్కువ భద్రత ఉండే ఆ జైలుకు తరలించడంపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. అంతకు ముందు ఆమె ఫ్లోరిడాలోని FCI టల్లహాసీ జైల్లో ఉంది. అక్కడి పరిస్థితులు దారుణంగా ఉన్నాయని ఆమె లాయర్లు ఫిర్యాదు చేశారు. తర్వాత ఆమెను బ్రయాన్ జైలుకు తరలించారు. ఇప్పుడు తను క్షమాభిక్ష కోరుతోంది. ఏమో ట్రంప్‌గారి ఏలుబడిలో ఏమన్నా జరగొచ్చు!


అమెరికా చట్టాల ప్రకారం దోషులకు క్షమాభిక్ష ప్రసాదించే ప్రత్యేక అధికారం అధ్యక్షుడికి ఉంటుంది. ఇందులో పార్డన్ అంటే పూర్తిస్థాయి క్షమాభిక్ష. ఈ నిర్ణయంతో చట్టపరమైన శిక్షలు తొలగిపోయి పౌర హక్కులు తిరిగి వస్తాయి. కమ్యూటేషన్ అంటే శిక్షా కాలాన్ని తగ్గించడం. రిప్రీవ్ తరహా క్షమాభిక్ష అయితే శిక్ష అమలు తాత్కాలికంగా వాయిదా పడుతుంది.



